కాళేశ్వరం బ్యారేజీలకు తాత్కాలిక మరమ్మతులు

నవతెలంగాణ హైదరాబాద్‌: వర్షాకాలంలో నీటిని నిల్వ చేయడానికి వీలుగా కాళేశ్వరం బ్యారేజీలకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌(జనరల్‌) అనిల్‌కుమార్‌ కాంట్రాక్ట్ సంస్థలకు సూచించారు. డ్యాం సేఫ్టీ అథారిటీ నివేదిక ఆధారంగా శాశ్వత మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు తాత్కాలిక మరమ్మతులు చేసి.. వర్షాకాలంలో నీటిని నిల్వ చేయడంపై బుధవారం ఈఎన్సీ నిర్వహించిన సమావేశంలో కాళేశ్వరం చీఫ్‌ ఇంజినీర్‌ సుధాకర్‌రెడ్డి, సీడీఓ చీఫ్‌ ఇంజినీర్‌ మోహన్‌కుమార్‌, కాడా చీఫ్‌ ఇంజినీర్‌ చంద్రశేఖర్‌, కాళేశ్వరం ఎస్‌.ఇ. కరుణాకర్‌, మూడు బ్యారేజీల ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు తిరుపతిరావు, యాదగిరి, ఓంకార్‌ సింగ్‌, ఎల్‌ అండ్‌ టీ, ఆఫ్కాన్స్‌, నవయుగ, మేఘా గుత్తేదారు సంస్థల ప్రతినిధులు సురేశ్‌, మల్లికార్జునరావు, మనోజ్‌, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు జరిగిన అంశాలను పక్కనపెట్టి.. తాత్కాలిక మరమ్మతులు చేసి నీటిని నిల్వ చేయడంపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ ప్రతిపాదించింది. అయితే తాత్కాలిక మరమ్మతుల్లో భాగంగా ఏయే పనులు చేపట్టాలి, ఏ పని ఎంత చేయాలి, ధరలు ఎంత, పనులకు డిజైన్లు ఎవరిస్తారని కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులు ప్రశ్నించినట్టు తెలిసింది.
మూడు బ్యారేజీలు, పంపుహౌస్‌లకు కలిపి సుమారు రూ.600 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, డిఫెక్ట్‌ లయబిలిటీ పీరియడ్‌లో ఏమైనా సమస్య వస్తే చేయడం వేరని.. ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటెనెన్స్‌కు మూడేండ్లుగా బిల్లులు చెల్లించకపోతే ఏం చేయగలమని వారు చెప్పినట్లు తెలిసింది. దీనిపై సమావేశంలో చర్చ జరిగినట్లు తెలిసింది. ‘బ్యారేజీల పటిష్ఠానికి సంబంధించిన పరీక్షలు చేయలేదు. నీటిని పూర్తిగా తొలగించడం ఇదే మొదటిసారి. రెండు బ్యారేజీల్లో ఇసుక మేట వేసి ఉంది. బ్యారేజీలు కట్టి రిజర్వాయర్లలాగా వినియోగించడం వల్ల సమస్యలొచ్చాయి’ అనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేసినట్టు తెలిసింది.
మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌కు షీట్‌ పైల్స్‌ వేసి గ్రౌటింగ్‌ చేయాలని, రాఫ్ట్‌ కింద గుంతలు ఏ మేరకు ఉన్నాయో నిర్ధారించుకొని చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ ఇంజినీర్లు కోరినట్టు తెలిసింది. పంపుహౌస్‌లు మళ్లీ మునగకుండా ఏం చేయాలన్న దానిపైనా సమావేశంలో చర్చించినట్టు తెలిసింది. బ్యారేజీల దిగువన నీటి వేగానికి తగ్గట్టుగా చర్యల విషయంలో డ్యాం సేఫ్టీ అథారిటీ సిఫారసుల ఆధారంగా శాస్త్రీయంగా పనులు చేపట్టాలని కొందరు సూచించినట్టు తెలిసింది. అయితే ఏయే మరమ్మతులు చేయాల్సి ఉంటుంది, ఎంత వ్యయమవుతుంది, దాన్ని ఎవరు భరించాలనేది తేలకుండా ప్రస్తుతం ముందుకెళ్లే అవకాశం లేదని తెలుస్తోంది.

Spread the love