తప్పుడు ఆరోపణలు చేస్తే సహించం

If false accusations are made Do not tolerate– కేటీఆర్‌, మహేశ్వరరెడ్డికి ఉత్తమ్‌ హెచ్చరిక
– కిషన్‌రెడ్డిని ఓవర్‌ టేక్‌ చేయాలనే ప్రయత్నంలో ఏలేటి
– ప్రతిపక్షాల విమర్శల్లో నయా పైస నిజం లేదు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించబోనంటూ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాజీ మంత్రి కేటీఆర్‌, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డిని హెచ్చరించారు. ఏలేటి బీజేపీ అధ్యక్షులు కిషన్‌రెడ్డిని ఓవర్‌టేక్‌ చేయాలని చూస్తున్నారని విమర్శించారు. అంత ఓవర్‌ స్పీడ్‌ పనికి రాదని ఏలేటిని హెచ్చరించారు. ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డితో కలిసి ఉత్తమ్‌ విలేకర్లతో మాట్లాడారు. బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ మహేశ్వరరెడ్డిని తామే పెంచి పోషించామని తెలిపారు. ఇప్పుడేమో అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీకి డబ్బులు పంపి ఫ్లోర్‌ లీడర్‌ పదవి కొనుక్కున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి కేటీఆర్‌, మహేశ్వరరెడ్డి తెలిసీతెలియకుండా ఇష్టమెచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ కలిసి రాష్ట్ర ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నాయన్నారు. సివిల్‌ సప్లరు శాఖపై అబద్ధాలు, అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో నయా పైసా నిజం లేదని స్పష్టం చేశారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సివిల్‌ సప్లరు శాఖలో రూ.58వేల కోట్లు అప్పులు చేసిందని తెలిపారు. సివిల్‌ సప్లరు కార్పొరేషన్‌లోనూ రూ.11వేల కోట్ల అప్పులు చేసిందని వివరించారు. గత ప్రభుత్వం కంటే తామే ముందుగా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించామని తెలిపారు. తడిసిన ధాన్యాన్ని ఎంఎస్‌పీ ధరకు కొనాలని రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ఎమ్మెస్పీ ధరకు కొన్న ఏకైక ప్రభుత్వం తమదేనని స్పష్టం చేశారు. డిఫాల్టర్‌ రైస్‌ మిల్లర్ల కోసమే ఆ రెండు పార్టీలు మాట్లాడుతున్నాయని ఆరోపించారు. మిల్లర్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూనే, వారే మిలర్లను పలు రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. బయట ధాన్యం గురించి మాట్లాడి లోపల భూముల విషయం చర్చించే సంస్కారం తమది కాదని స్పష్టం చేశారు. మిల్లర్ల దగ్గర డబ్బులు తీసుకోవడం కాదు కదా, కనీసం వాళ్లను తాను ఇప్పటివరకు కలవలేదన్నారు. తనలాంటి నిజాయితీపరుడిపై ఇష్టమెచ్చినట్టు మాట్లాడటం సరైంది కాదని చెప్పారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సన్న బియ్యం ఒక్క గింజ కూడా కొనలేదన్నారు. టెండర్‌ నిబంధనల ప్రకారం ఒప్పుకుంటే ఎంత ధాన్యం అమ్మినా ప్రభుత్వం కొంటుందని స్పష్టం చేశారు. మిల్లర్లపై ఇంత కఠినంగా ఉన్న ప్రభుత్వం తమదేనని వివరించారు. తప్పు చేసిన మిల్లర్లపై చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఎక్కువగా మాట్లాడితే పెద్ద లీడర్‌ అవ్వరు ఏలేటికి ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి సలహా
రాజకీయాల్లో ఎక్కువగా మాట్లాడితే పెద్ద లీడర్‌ అవ్వరనీ, వాస్తవాలు మాట్లాడితేనే అవుతారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డికి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సలహా ఇచ్చారు. ‘మహేశ్వర రెడ్డికి ఇంత బుద్ది వచ్చిందా? బీజేపీలోకి వెళ్ళగానే వాళ్ళ తప్పులు ఒప్పులుగా మారాయా? లీడర్‌ కావాలని కోరికతో నిజాలను దాస్తారా?’ అని ప్రశ్నించారు. పేపర్లో పేరు వస్తే చాలు అన్న తీరులో వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. తడిచిన ధాన్యాన్ని కొన్న ప్రభుత్వం ఏదైనా ఉందా? సివిల్‌ సప్లరు శాఖ ఇంత అప్పుల్లోకి పోవడానికి కేంద్ర ప్రభుత్వం కారణం కాదా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ధాన్యం సగటు ధర రూ. 1700 మాత్రమే, ఇప్పుడు రూ. 2022 ఉందన్నారు. మిల్లర్లు చేస్తున్న తప్పుకు ప్రభుత్వాన్ని బదనాం చేస్తారా? అని ప్రశ్నించారు. ‘ఐదేండ్లలో కేసీఆర్‌ రుణమాఫీ చేయలేదు. మేం ఐదు నెలల్లో చేయబోతున్నాం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్‌ ఇస్తున్నారా?’ అని నిలదీశారు.
విద్యుత్‌ వినియోగం పెరిగింది కరెంట్‌ అంతరాయం విపక్షాల దుష్ప్రచారమే :మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
గతేడాది డిసెంబర్‌ కంటే ఈసారి విద్యుత్‌ వినియోగం మరింత పెరిగిందని, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. వినియోగం పెరిగినప్పటికీ కరెంట్‌ సరఫరాకు అంతరాయం లేకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుందని తెలిపారు. కరెంట్‌ కోతలపై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ రెండు పార్టీలు కలిసినా ఆశించిన సీట్లు రావట్లేదనే అక్కసుతో కాంగ్రెస్‌ సర్కారుపై అబద్ధపు ప్రచారం చేస్తున్నాయని తెలిపారు. ప్రతిపక్షాల విమర్శలకు ప్రభుత్వ పని తీరే నిదర్శనమన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కంటే తమ ప్రభుత్వం అభివృద్ధిలో మార్పు తెస్తోందనీ, ఆ మార్పుకు అడ్డు వస్తే సహించేది లేదని మంత్రి హెచ్చరించారు. వారిలో కూడా మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ను సలహాలు, సూచనలు ఇవ్వాలంటూ అనేక సార్లు కోరామనీ, వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. తమ ప్రభుత్వం అత్యంత ప్రజాస్వామికంగా ఉందనీ, ప్రజలకు ఇస్తున్న పథకాలను కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు పక్కదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ఎంజీఎం ఆస్పత్రుల్లో గతేడాది 121 సార్లు కరెంట్‌ బ్రేక్‌డౌన్‌ అయిందన్నారు. ఎంజీఎం ఆస్పత్రుల్లో ఎలుకలు రోగుల చర్మాన్ని తిన్నాయని గుర్తు చేశారు. గత ప్రభుత్వం సివిల్‌ సప్లరు శాఖలో అడ్డగోలుగా అప్పులు చేసిందంటూ ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Spread the love