ఆగస్టు తర్వాతే రైౖతు భరోసా…?

ఆగస్టు తర్వాతే రైౖతు భరోసా...?– సాగు చేయని భూములపై సర్కార్‌ ఫోకస్‌
– జులై 12 లోపు
– మంత్రివర్గ ఉపసంఘం నివేదిక శాసనసభలో ఆ నివేదికపై విస్తృత చర్చ
– ఆ తర్వాతనే రైతుల ఖాతాల్లోకి నిధులు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రాళ్లు, రప్పలు, గుట్టలు, రియల్‌ఎస్టేట్‌,వెంచర్లు, రోడ్లు, భవనాలు వంటి సాగు చేయని భూములకు రైతు భరోసా కట్‌ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రైతు భరోసా అమలుపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం… జూలై 12లోపు తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. శాసనసభ సమావేశాల్లో ఆ నివేదికపై విస్తృతంగా చర్చించిన తర్వాత దాన్ని అమలు చేసే దిశగా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తున్నది. జూలై చివరి వారంలో శాసనసభ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నది. ఈ లెక్కన రైతు భరోసాపై ఓ క్లారిటీ వచ్చేందుకు నెలన్నర రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్టు వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో ఆ భూములకు రైతు భరోసా ఇవ్వబోమంటూ కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో చెప్పినట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తున్నది. అందుకనుగుణంగా కార్యాచరణను సిద్ధం చేసేందుకు పూనుకుంది. దీంతో రైతు భరోసా ఆగస్టు తర్వాతే అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.వానాకాలం సీజన్‌లో రైతు భరోసా ఆలస్యమవుతున్న కొద్దీ అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. యాసంగి సీజన్‌లో కూడా రైతు భరోసా ఆలస్యంగా పూర్తి చేసిన సంగతి తెలిసిందే. యాసంగి సీజన్‌ ముగిసే సమయానికి రైతు భరోసాను రైతుల ఖాతాల్లో జమ చేసింది. అప్పటికే రైతులు పెట్టుబడి సాయం కోసం అష్టకష్టాలు పడ్డారు. వానాకాలంలోనూ అదే పరిస్థితి రావడం పట్ల రైతులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీనికితోడు విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పని ముట్ల ధరలు కూడా రెట్టింపు అయ్యాయి. ఇప్పటికే రైతులు దుక్కులు దున్ని విత్తనాలు నాటారు.
ఎండలకు భూమి వేడెక్కడంతో విత్తనం మొలకెత్తకపోవడంతో మళ్లీ విత్తనాలు నాటుకునే పరిస్థితులొచ్చాయి. అందుకు నేలను మళ్లీ సదును చేయాల్సి ఉంటుంది. విత్తనాలు, ఎరువులు కూడా కొనాల్సి వస్తుంది. రెండుసార్లు విత్తనాలు, ఎరువులు కొనాల్సి రావడంతో రైతులపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతున్నది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీపై కసరత్తు ప్రారంభించిన నేపథ్యంలో రైతులకు బ్యాంకులు కొత్త అప్పులు ఇచ్చే అవకాశాలు సన్నగిల్లాయి.
రుణమాఫీ రద్దు నిర్ణయం మంచి శుభా పరిణామమే అయినా ఈ సమయంలో బ్యాంకులు రైతులకు కొత్త చిక్కులు తెచ్చి పెడుతున్నాయి.
రుణమాఫీ పూర్తి అయిన తర్వాతనే కొత్త అప్పులిస్తామంటూ బ్యాంకర్లు మెలిక పెడుతున్నారు. మరోవైపు సకాలంలో విత్తనం వేయకపోతే సీజన్‌ మొత్తం రైతు నష్టపోయే ప్రమాదముంది. దీంతో రైతులు పెట్టుబడి సాయం కోసం ప్రయివేటు అప్పులు చేయాల్సి ఉంటుందని ఆందోళన చెందుతున్నారు.

Spread the love