ఘనంగా రైతు దినోత్సవ వేడుకలు

నవతెలంగాణ- తాడ్వాయి
తెలంగాణ రాష్ట్రం అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని రైతు వేదిక భవనం లో స్థానిక తాసిల్దార్ ముల్కనూరు శ్రీనివాస్, ఎంపీడీవో సత్యాంజనేయ ప్రసాద్ ల ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ మండల ఇన్చార్జి ఏవో సూప్ర జ్యోతి అధ్యక్షతన రైతు దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా ములుగు జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి హాజరయ్యారు. తాడ్వాయి రైతువేదిక పరిధిలో గల గ్రామాల రైతులు ట్రాక్టర్లతో భారీ సంఖ్యలో తరలివచ్చారు. మేడారం ఆర్చ్ గేట్ నుండి వేదిక భవనం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మండలంలోని రైతు వేదిక భవనాల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. మొదట జాతీయ గీతం ఆలపించి సమావేశం ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీ వైస్ చైర్ పర్సన్ బడే నాగజ్యోతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం విజయవంతంగా 9 ఏళ్లు పూర్తి చేసుకొని పదో ఏడాదిలో అడుగుపెట్టిన సందర్భంగా తెలంగాణ ఆత్మగౌరవ ఉత్సవాలకు శ్రీకారం చుట్టిందని, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత తొమ్మిది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రైతుల కు తోడ్పాటు అందించడం జరిగింది అన్నారు. ఎంపీపీ గొంది వాణిశ్రీ, రైతు సమన్వయ కమిటీ కోఆర్డినేటర్ దిడ్డి మోహన్ రావు లు మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని అన్నారు. ఇన్చార్జి వ్యవసాయ శాఖ అధికారి సుప్రజ్యోతి, ఏ ఈ ఓ రవికుమార్ మాట్లాడుతూ తాడ్వాయి మండలంలో ఇప్పటివరకు రైతులకు అందించిన రైతుబంధు, రైతు బీమా, రైతులకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తదితర అంశాల గురించి వివరించారు. ఉద్యానవన శాఖ ములుగు నర్సరీ మేనేజర్, ములుగు ఇంచార్జి శివకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఆయిల్ ఫామ్ గురించి ఎన్నో సబ్సిడీలు ప్రవేశపెట్టిందన్నారు. ఒక్క ఎకరానికి 57 ముక్కలు సరిపోతాయని, ప్రభుత్వం ద్వారా నెలకు అకౌంట్లో 4200 వస్తాయన్నారు. ఒక్క సంవత్సరం ప్లాంటేషన్ చేస్తే 30 సంవత్సరాల వరకు ఆదాయం వస్తుందని తెలిపారు. మండలంలో ఆయిల్ ఫామ్ కు అనుకూలమైన నేలలు ఉన్నాయని, రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
స్థానిక సర్పంచ్ ఇర్ప సునీల్ దొర మాట్లాడుతూ రైతు సంక్షేమ పథకాలు అందరి రైతులకు అందేలా కృషి చేయాలన్నారు. అవినీతి అక్రమాలు జరగకుండా కృషి చేయాలన్నారు. సమావేశం అనంతరం రైతులకు, పిఎసిఎస్ సీఈవో స్వాతి మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు పిఎసిఎస్ ద్వారా గోదాములు నిర్మించుతున్నామని, ఎరువులు అందుబాటులో ఉన్నాయని, జీలుగు విత్తనాలు కూడా అందుబాటులో ఉన్నాయని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు మండల కోఆర్డినేటర్ తాటి రామచందర్, జిసిసి డైరెక్టర్ పులుసం పురుషోత్తం, సర్పంచులు ఉకే మోహన్ రావు, ఊకే మౌనిక నాగేశ్వరరావు, గౌరబోయిన నాగేశ్వరరావు, ఎల్లబోయిన ఝాన్సీ రాంబాబు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల ఉద్యోగులు, జాగృతి మహిళా అధ్యక్షురాలు పుర్రి స్వరూప, నాయకులు వివిధ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love