కేంద్రానికి రైతులు డెడ్ లైన్

నవతెలంగాణ ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించిన రైతులు నేడు (బుధవారం) పాదయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో నేటి ఉదయం 11 గంటలకు పాదయాత్ర(Padayatra) చేస్తామని రైతులు కేంద్రాన్ని హెచ్చరించారు. ఉదయం 11 లోపు స్పందించాలని లేదంటే ఢిల్లీకి(Delhi) బయలుదేరుతామని రైతు నేతలు చెప్పారు. రైతుల పాదయాత్ర నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సింగూ సరిహద్దుల్లోని ఢిల్లీ పోలీసులతో పాటు మిగతా అన్ని జిల్లాల సరిహద్దుల్లో దాదాపు ఐదు వేల మంది పోలీసులు, పారామిలటరీ బలగాలను మోహరించారు. అంబాలా, కురుక్షేత్ర, కర్నాల్, పానిపట్, జీటి రోడ్‌, సోనిపట్‌, ఢిల్లీలోని సింగు సరిహద్దులో ఏర్పాటు చేసిన 40 లేయర్ బారికేడ్‌లను బద్దలు కొట్టడానికి శంభు సరిహద్దు వద్ద పోక్‌లేన్, హైడ్రా, జేసీబీలను కూడా ఏర్పాటు చేశారు.
ఇప్పటివరకు జరిగిన నాలుగోదశ చర్చల్లో ఐదు పంటల ఎంఎస్‌పీ(MSP)పై కేంద్రం ప్రతిపాదనను రైతులు తిరస్కరించారు. పంటలకు కనీస మద్దతు ధర (MSP) చట్టం, రుణమాఫీ సహా తమ డిమాండ్ల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా ఆధ్వర్యంలో ‘ఢిల్లీ చలో’ ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు ఉదయం 11 లోపు కేంద్ర ప్రభుత్వం రైతుల డిమాండ్లకు సానుకూలంగా స్పందిస్తుందా లేదా అనేది చూడాలి.

Spread the love