సాగులో రైతులు.. ధరణిలో రియల్టర్లు..

– రూ. వెయ్యి కోట్ల విలువజేసే ప్రభుత్వ భూమికి గాలం
– 76.24 ఎకరాల ‘బిల్లా దాఖలా’ భూములపై పెద్దల కన్ను
– ఎలాంటి రికార్డులు లేకుండా 21 ఎకరాలు రిజిస్ట్రేషన్‌ తమకూ పట్టాలివ్వాలని రైతుల ఆందోళన
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ఏండ్ల తరబడి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రైతులకు ఆ భూములపై హక్కులు కల్పించేందుకు.. రెవెన్యూ రికార్డుల సమస్యలు అడ్డొస్తాయి. కానీ బడాబాబులకు మాత్రం ఎలాంటి రికార్డులు లేకున్నా పనులు జరిగిపోతున్నాయి. రికార్డుల్లో లేని ‘బిల్లా దాఖలా’ భూమిపై కన్నేసిన పెద్దలు ఏకంగా సర్వే నెంబర్‌ సృష్టించి రూ.వెయ్యి కోట్ల విలువ గల భూమిని కొట్టేసేందుకు కుట్రలు చేశారు. ప్రస్తుతం రూ.500 కోట్ల విలువ గల భూమిని వినాయక డెవలపర్స్‌ పేరున రిజిస్ట్రేషన్‌ అయింది. ఏండ్ల కొద్దిగా పెండింగ్‌లో ఉన్న భూములు ఎలా రిజిస్ట్రేషన్‌ అవుతున్నాయని రెవెన్యూ అధికారులను ప్రశ్నించగా.. తమకు తెలియదని స్లాట్‌ బుక్‌ అవడంతో రిజిస్ట్రేషన్‌ చేస్తున్నామని రెవెన్యూ అధికారులు చెప్పడం గమనార్హం.
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం మోకిల-కొండకల్‌ రెవెన్యూ గ్రామాల మధ్య ‘బిల్లా దాఖలా(రెండు గ్రామాల సరిహద్దు)’ పేరుతో 76.24 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని ఎన్నో ఏండ్లుగా మెకిలా, కొండకల్‌ గ్రామాల రైతులు సాగు చేసుకుంటున్నారు. అయితే ఈ భూములకు పట్టాలివ్వాలని రైతులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదు. అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో రైతులకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించడంతో అసైన్డ్‌ భూములుగా పట్టా పాసు పుస్తకాలు ఇచ్చారు. కానీ రెవెన్యూ రికార్డుల్లో మాత్రం నమోదు చేయలేదు. రైతులను మభ్యపెట్టేందుకు నాటి ప్రభుత్వం డమ్మీ పాసుపుస్తకాలు ఇచ్చి రైతుల నోరు మూయించిందన్ని విమర్శలున్నాయి. ఇటీవల కొంత మంది రైతుల నుంచి ఈ భూములను కొనుగోలు చేసి ఈ భూములకు సర్వేనెంబర్‌ 555ను సృష్టించి ధరణిలో స్లాట్‌ బుక్‌ చేసి రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి భూమి బదిలీ చేయాలంటే.. లింక్‌ డాక్యుమెంట్‌ ఉండాలి. దాని ఆధారంగా రిజిస్ట్రేషన్‌ చేయాల్సి ఉంటుంది. కానీ సర్వేనెంబర్‌ 555 నెంబర్‌కు ఎలాంటి డాక్యుమెంట్స్‌ లేవు. సర్వే నెంబర్‌ 555/10, ఖాతా నెంబర్‌ 60850 వినాయక డెవలపర్స్‌కు, పంతం మల్లమ్మ అనే వ్యక్తి నుంచి ఈ నెల 12వ తేదీన 10 గుంటల భూమి బదిలీ అయింది. పంతం మల్లమ్మకు ఎలాంటి డాక్యుమెంట్‌ లేకుండా ఆమె పేరు నుంచి వినాయక డెవలపర్స్‌కు ఎట్లా భూమి బదిలాయించారని రెవెన్యూ అధికారులను అడిగితే వారి దగ్గర సమాధానం లేదు. సర్వే ఆఫ్‌ ల్యాండ్‌ రికార్డు రిపోర్టు ప్రకారం చేశామంటూ దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని లబ్దిదారులు కోరుతున్నారు.
మా పేర్లు కూడా రికార్డుల్లో పొందుపర్చండి
ప్రస్తుతం సాగులో ఉన్న రైతులు తమ పేర్లు కూడా ధరణిలో పొందుపర్చి పాసు పుస్తకాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం కొంత మంది రైతుల నుంచి వినాయక డెవలపర్స్‌కు పట్టా చేసిన విధంగా తమ భూములకు పట్టా పాసు పుస్తకాలు ఇవ్వాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. కొలను గోపాల్‌రెడ్డి రెండెకరాలు, పెంటరెడ్డి ఎకరం, గుత్త నర్సింహారెడ్డి ఎకరం, పాషా మాజీ సైనికుడు నాలుగు ఎకరాలు.. ఇలా మొత్తం 55 మంది రైతులు ఎన్నో ఏండ్లుగా ఈ భూములను చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఇందులో కొంత భూమిని జీవీకే సంస్థ కబ్జా పెట్టింది. దీనిపై రైతులు పదేండ్లుగా తమ భూమి కోసం పోరాటం చేస్తున్నారు. ఆ సమస్య కోర్టు దాకా వెళ్లింది. కోర్టు తీర్పు కోసం రైతులు వేచిచూస్తున్నారు.
ఈ భూములకు సర్వే చేయించి.. తహసీల్దార్‌ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా పాత రికార్డులను పరిశీలించి ఏడీ రిపోర్టు జారీ చేశారు. దీని ఆధారంగా కలెక్టర్‌ సూచన మేరకు సీసీఎల్‌ఏ ఈ భూములకు క్లీయరెన్స్‌ కూడా ఇచ్చినట్టు సంబంధిత అధికారులు చెబుతున్నారు. అప్పటికే ఈ భూములపై కన్నేసిన బడా నేతలు, రియల్టర్లు, వ్యాపారులు పహాణీలు, పట్టాదారు పాసుపుస్తకాలు, సర్వే నంబర్‌, ఖాతానంబర్లు లేవనే అంశాన్ని తెరపైకి తెచ్చారు. ప్రభుత్వం నుంచి ఏదైనా ఇబ్బంది ఉంటే తాము చూసుకుంటామని నమ్మబలుకుతున్నారు. తక్కువ ధరకు 21 ఎకరాలకుపైగా కొల్లగొట్టారు. అలాగే ఎలాంటి సపోర్టింగ్‌ డాక్యుమెంట్లూ సమర్పించకుండానే ‘ధరణి’లో స్లాట్‌ బుక్‌ చేసి గుట్టుగా రిజిస్ట్రేషన్‌ కూడా చేసుకున్నారు. అయితే రైతులకు పట్టాలు ఇవ్వడానికి సాధ్యం కానీ పని.. బడా వ్యాపారులకు పట్టా ఎట్టా చేశారనేది ప్రశ్నార్థకంగా మారింది.
సర్వే శాఖ సర్వే రిపోర్టు ఉంది
సర్వే నెంబర్‌ 555 రికార్డుల్లో లేదన్న విషయం వాస్తవం. కానీ సర్వే ఆఫ్‌ ల్యాండ్‌ రికార్డు వారి దగ్గర ఉన్న పాత రికార్డుల్లో ఉందని రిపోర్టు ఇవ్వడంతో సర్వే నెంబర్‌ను ధరణిలో పొందుపరిచారు. దాని ప్రకారం స్లాట్‌ బుక్‌ అవుతుంది. దాని ప్రకారమే రిజిస్ట్రేషన్‌ చేయాల్సి వచ్చింది.
– నయిమొద్దీన్‌, శంకర్‌పల్లి తహసీల్దార్‌
మా భూమికి పట్టా ఇవ్వాలి
మాజీ సైనికుడి కోటాలో మా నాన్నకు ప్రభుత్వ ‘బిల్లా దాఖలా’ నాలుగు ఎకరాల భూమి ఇచ్చారు. ఆ భూముల్లో వ్యవసాయం కూడా చేసుకున్నాం. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో పాసు పుస్తకాలు వస్తున్నాయంటే కొన్ని డబ్బులు కూడా ఖర్చు పెట్టుకున్నాం. కానీ పట్టాలు, పాసు పుస్తకాలు రాలేదు. వినాయక డెవలపర్స్‌కు రిజిస్ట్రేషన్‌ చేసిన మాదిరిగా మా భూములకు కూడా పట్టా పాసు పుస్తకాలు ఇవ్వాలి.
– అహ్మద్‌ పాషా, బాధిత రైతు

Spread the love