Sunday, June 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతులు అధైర్యపడొద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది

రైతులు అధైర్యపడొద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది

- Advertisement -

– జిల్లాలో యూరియా కొరత లేకుండా ఆన్‌లైన్ విధానంలో సరఫరా
– పెద్దాపూర్, లక్ష్మాపూర్ వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
నవతెలంగాణ – ఉప్పునుంతల

అచ్చంపేట నియోజకవర్గంలోని ఉప్పునుంతల మండలం పెద్దాపూర్, లక్ష్మాపూర్ గ్రామాల్లో ఐకేపీ, మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆదివారం ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ఎక్కువ కాలం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచకుండా వెంటనే బాయిలర్ మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు.

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు, తేమ శాతం, తూకం ప్రక్రియ, హమాలీల ఏర్పాటు, రవాణా సదుపాయాలను పరిశీలించిన కలెక్టర్, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. వర్షాల వల్ల ధాన్యం నాణ్యత దెబ్బతినకుండా అదనపు టార్పాలిన్లు, కవర్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

అనంతరం రైతులతో మాట్లాడిన కలెక్టర్, ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండగా ఉంటుందని, ఎవరూ అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కొనుగోలు ప్రక్రియలో జాప్యాలు, అవకతవకలకు తావు లేకుండా చూడాలని, తూకాలు వేగవంతం చేసి రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా రైతులు యూరియా ఎరువుల లభ్యతపై ఆందోళన వ్యక్తం చేయగా, జిల్లాలో యూరియా కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ తెలిపారు. ఆన్‌లైన్ విధానంలో యూరియా పంపిణీ జరిగేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని, ప్రతి రైతుకు సకాలంలో ఎరువులు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి నరసింహారావు, తహసీల్దార్, వ్యవసాయ, మార్కెటింగ్, సివిల్ సప్లైస్, ఐకేపీ, మెప్మా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -