రైతు సంఘం పధాన కార్యదర్శి టి.సాగర్
నవతెలంగాణ-నారాయణపేట
కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటించినప్పటికీ రైతులు ఈ యాసంగి పంటలో రూ.4వేల కోట్లు నష్టపోయారని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ అన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పంటలకు మద్దతు ధరలను నిర్ణయించి చట్టబద్ధంగా అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో లేనందున ప్రస్తుతం రైతులు రూ.4వేల కోట్ల మేర నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో క్వింటాలకు 4 నుంచి 5కిలోల చొప్పున తరుగు తీస్తున్నారని, వాటిని అరికట్టడంలో ప్రభుత్వ అధికారులు విఫలమవుతున్నారన్నారు. అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందంలో భాగంగా రైతులు తీవ్రంగా నష్టపోయే విధానాలపై మోడీ సంతకం చేయడం దారుణమని విమర్శించారు. భవిష్యత్‌లో రైతు సంక్షేమం కోసం తమ సంఘం ఆధ్వర్యంలో సమరశీల పోరాటాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. రైతు భరోసా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేయడం లేదని విమర్శించారు. తెలంగాణ రైతు సంఘం నారాయణపేట జిల్లా కార్యదర్శి అంజిలయ్యగౌడ్ మాట్లాడుతూ.. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూ నిర్వాసితులందరికీ నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నష్టపరిహారంతోపాటు అర్హులైన వారందరికీ ఇండ్ల స్థలాలు, వారి పిల్లలకు గురుకుల పాఠశాలలు, సైనిక పాఠశాలల్లో చదివేందుకు అవకాశం కల్పించాలని కోరారు. సీఎంఆర్ బియ్యం ప్రభుత్వానికి అందజేయని మిల్లులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అవినీతికి పాల్పడిన మిల్లు యజమానులపై క్రిమినల్ కేసులు మోపాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి బండమీది బలరాం, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గుండెగారి దస్తప్ప తదితరులు ఉన్నారు.
యాసంగిలో రూ.4వేల కోట్లు నష్టపోయిన రైతులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


