జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం

జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం– ముందున్న లారీని ఢీకొన్న మేకల లారీ
– ఐదుగురు మృతి
– మరో ఐదుగురికి తీవ్ర గాయాలు
– 200కు పైగా మేకలు మృత్యువాత
నవతెలంగాణ – చేగుంట
మెదక్‌ జిల్లా చేగుంట మండలంలోని 44వ జాతీయ రహదారిపై వడియారం సమీపంలో రెండు లారీలు ఢీకొనడంతో ఐదుగురు మేకల వ్యాపారులు మృతిచెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో 200పైగా మేకలు మృత్యువాత పడ్డాయి. వ్యాపారులు లారీలో హైదరాబాద్‌కు మేకలు తరలిస్తుండగా.. ముందుగా వెళ్తున్న పశువుల దానా లారీని వేగంగా వెనుక నుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. వివరాలిలా ఉన్నాయి..
మధ్యప్రదేశ్‌ రాష్ట్రం గుహరేవకు చెందిన ఎండీ ఇబ్రహీం(21), చిక్వా రాజు(57), చిక్వ మనీష్‌ కుమార్‌(30), ఎండీ షబ్బీర్‌ ఖాన్‌ (48), ఎండీ జిషన్‌(21) మేకల వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే నాగ్‌పూర్‌ నుంచి లారీలో హైదరాబాద్‌కు మేకలు తరలిస్తున్నారు. వారి లారీ.. ముందున్న పశువుల దానా లారీని చేగుంట మండలంలోని 44వ జాతీయ రహదారిపై వడియారం సమీపంలో ఢకొీట్టింది. దాంతో మేకల లారీ క్యాబిన్‌లో కూర్చున్న ఇద్దరు, వెనుక కూర్చున్న ముగ్గురి మీద మేకలు పడి ఊపిరి ఆడక మృతిచెందారు. వీరు మేకల వ్యాపారంతో పాటు కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ ప్రమాదంలో రమేష్‌, మహేష్‌, శుక్లాల్‌, బుట్టా సింగ్‌, లాల్‌మనీకి గాయాలయ్యాయి. 200కు పైగా మేకలు కూడా మృత్యువాత పడ్డాయి. ఘటనా స్థలానికి స్థానిక పోలీసులతో పాటు ఎస్పీ బాలస్వామి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను తూప్రాన్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చేగుంట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love