స్వాతంత్య్ర దినోత్సవం రోజునే మహిళాసర్పంచ్‌ ఆత్మహత్యాయత్నం

– బిల్లులు రాక.. అప్పులు తీర్చలేక..
నవతెలంగాణ-మాక్లూర్‌
అప్పులు చేసి గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టినా.. బిల్లులు రాలేదు.. అప్పులోల్ల వేధింపులు భరించలేక నిజామాబాద్‌ జిల్లా ఆలూర్‌ మండలం కల్లెడ గ్రామ మహిళా సర్పంచ్‌ మంగళవారం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబీకులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కల్లెడ సర్పంచ్‌ పెద్దగాని లావణ్య(34) సుమారు రూ.30 లక్షల మేర పలువురి వద్ద అప్పుగా తీసుకొచ్చి గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టారు. అయితే ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో, అప్పిచ్చిన వాళ్ళు ఒత్తిడి చేయసాగారు. గ్రామాభివృద్ధికి ఖర్చు చేసిన నిధులు రాకపోవడంతో తెచ్చిన అప్పునకు వడ్డీ పెరగడంతో ఏమి చేయాలో తెలియక సర్పంచ్‌ లావణ్య మంగళవారం ఉదయం నిద్ర మాత్రలు మింగింది. కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అయితే, లావణ్య భర్త ప్రసాద్‌ సంవత్సరం కిందట ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో అరెస్టు అయ్యి ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యాడు. అంతలోనే సర్పంచ్‌ లావణ్య, ఆత్మహత్యాయత్నం చేసుకోవడం జిల్లాలో కలకలం రేపుతోంది.

Spread the love