భరోసా ఇచ్చేదాకా పోరు

16 రోజులైనా
– సమ్మెపై స్పందించని సర్కార్‌
-పలువురు నేతల సంఘీభావం
నవతెలంగాణ- విలేకరులు
గ్రామాలను ఆరోగ్యవంతంగా ఉంచడంలో కీలక పాత్ర వహిస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్నారు. ఈ క్రమంలో గ్రామాల్లో చెత్త పేరుకుపోతున్నా.. ముసురు వర్షాల నేపథ్యంలో ప్రజల ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉన్నా ప్రభుత్వం స్పందించడం లేదు.. అటు కార్మికులపై కనికరం చూపడం లేదు.. చర్చలకు దిగిరావడం లేదు. మరోవైపు కార్మికులను నయానో భయానో బెదిరించి సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు అధికారులు, పలువురు సర్పంచులు యత్నిస్తున్నారు. అయినా వెనక్కి తగ్గని జీపీ కార్మికులు తమ బతుకులకు భరోసా ఇచ్చే వరకు తగ్గేది లేదంటూ సమ్మె కొనసాగిస్తున్నారు.
హయత్‌నగర్‌లోని మండల కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె కొనసాగింది. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు సుధాకర్‌ పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు అధికారులు, సర్పంచ్‌లు యత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మల్టీపర్పస్‌ పని విధానంలో అవగాహన లేని పనులు చేసే సమయంలో కార్మికులకు ఏమైనా ప్రమాదం జరిగితే మాదే బాధ్యత అని అధికారులు, సర్పంచ్‌లు రాసిస్తారా అని ప్రశ్నించారు. కార్మిక సంఘాల నేతలతో ప్రభుత్వం చర్చలు జరపాలని డిమాండ్‌ చేశారు.
యాదాద్రిభువనగిరి జిల్లా మోటకొండూరు ఎంపీడీవో కార్యాలయం ఎదుట గ్రామపంచాయతీ ఉద్యోగ, కార్మికులు చేపట్టిన సమ్మె 16వ రోజుకు చేరుకుంది. ఎంపీడీఓ ఆఫీస్‌ నుంచి అంబేద్కర్‌ చౌరస్తా వరకు కార్మికులు అర్ధనగ ప్రదర్శన చేసి అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. యాదగిరిగుట్ట మండల ప్రజాపరిషత్‌ కార్యాలయం ఎదుట జీపీ కార్మికుల సమ్మెకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, ఆలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి బీర్ల ఐలయ్య మద్దతు తెలిపి, ఆర్థిక సహాయం అందజేశారు. రామన్నపేటలో బీఎస్పీ నియోజకవర్గ ఇన్‌చార్జ్జి మేడి ప్రదర్శిని సంఘీభావం తెలిపారు. బొమ్మలరామారంలో రాస్తారోకో చేశారు. నల్లగొండ జిల్లా తిప్పర్తిలో గ్రామపంచాయతీ కార్మికుల పట్ల కార్యదర్శుల వేధింపుల అరికట్టాలని డిమాండ్‌ చేశారు. తిప్పర్తి కార్యదర్శి వైఖరిని నిరసిస్తూ మార్కెట్‌ యార్డ్‌ నుంచి గ్రామపంచాయతీ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ నల్లగొండ నియోజకవర్గం గ్రామ పంచాయతీ కార్మికులంతా ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతెపాక వినోద్‌కుమార్‌ పాల్గొన్నారు. చండూర్‌లో భిక్షాటన చేశారు. పెద్దవూరలో జీపీ కార్మికుల సమ్మెకు మహాజన సోషలిస్టు పార్టీ మద్దతు తెలిపింది.
నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో నిరసన ప్రదర్శన చేశారు. ఎడపల్లిలో డప్పు చప్పులతో బిక్షాటన చేసి నిరసన తెలిపారు. మహబూబాబాద్‌ జిల్లా గార్లలో ద్విచక్ర వాహనాల ర్యాలీ తీశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలో జేఏసీ నాయకులు దున్నపోతుకు వినతిపత్రం అందజ శారు. రంగారెడ్డి జిల్లా మంచాలలో పంచాయతీ కార్మికులు ఒంటికాలిపై నిల్చొని నిరసన తెలి పారు. వీరికి సీఐటీయూ మండల కన్వీనర్‌ పోచమొని కృష్ణ మద్దతు తెలిపారు. వికారాబాద్‌ జిల్లా నవాబుపేట మండల కేంద్రంలోని అంబేద్కర్‌ విగ్రహం ఎదుట పంచాయతీ కార్మికులు ఆందోళన చేపట్టారు.

Spread the love