విద్యార్థుల సమస్యలపై పోరాటం

విద్యార్థుల సమస్యలపై పోరాటం – హెచ్‌సీయూ విద్యార్థి సంఘం అధ్యక్షులు హతిక్‌ అహ్మద్‌
– యూనివర్సిటీని సెంట్రల్‌ జైలుగా మార్చారు
– ప్రశ్నిస్తున్న విద్యార్థి సంఘాలే లక్ష్యంగా యాజమాన్యం బెదిరింపులు
– మూడో రోజుకు విద్యార్థుల ఆందోళన
నవతెలంగాణ-మియాపూర్‌
విద్యార్ధుల సమస్యలపై పోరాటానికి వెనక్కి తగ్గేది లేదని హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షులు హతిక్‌ అహ్మద్‌ స్పష్టంచేశారు. విద్యార్ధుల హక్కుల కోసం పోరాడుతున్న తమపై సస్పెండ్‌ను వ్యతిరేకిస్తూ మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఆందోళనలో భాగంగా బుధవారం హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ మెయిన్‌ గేట్‌ ఎదుట నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ దాని అనుబంధ సంఘాలకు యూనివర్సిటీ అడ్డాగా మారిందని, వారు ఏది చెబితే ఇక్కడ అదే జరుగుతుందని, అందులో భాగంగానే తమ మీద కేసులు, వెలివేతలు జరుగుతున్నాయని ఆరోపించారు. అడ్మినిస్ట్రేషన్‌ అక్రమాలను ప్రశ్నిస్తున్న తమను టార్గెట్‌ చేసి కేసులు పెడుతున్నారని, వాక్‌ స్వాత్రంత్రాన్ని కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోహిత్‌ వేముల మరణం తర్వాత మరోసారి ఇక్కడ వెలివాడ వెలిసిందని, హెచ్‌సీయూ విద్యార్థుల హక్కుల కోసం ప్రశ్నిస్తున్న తమను వెలిసేస్తున్నారని, రోహిత్‌ వేముల లాగానే తమపై ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. తమ హక్కుల కోసం పోరాడతామని స్పష్టం చేశారు. యూనివర్సిటీ ఎస్‌ఎఫ్‌ఐ కార్యదర్శి కృపా మరియా మాట్లాడుతూ.. ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకుల ఒత్తిడి వల్లనే ఆమపై కేసులు నమోదు చేశారని, విద్యార్థుల హక్కులపై వీసీని ప్రశ్నించడం తప్పా అని ప్రశ్నించారు. హెచ్‌సీయూ, ఎన్‌ఎస్‌యూఐ ప్రెసిడెంట్‌ ధీరజ్‌ మాట్లాడుతూ.. సుకూన్‌ యానవల్‌ ఫెస్టివల్‌ నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తే విద్యార్థి నాయకులను సస్పెండ్‌ చేశారని, కానీ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఫెస్టివల్‌ చేస్తే వీసీ వారికి అన్ని విధాలా సహకరించారని, ఏబీవీపీకి ఓ న్యాయం.. మిగతా విద్యార్థి సంఘాలకు ఓ న్యాయమా అని ప్రశ్నించారు. 50 మంది ఏబీవీపీ కార్యకర్తలు వచ్చి విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా ఎవరూ పట్టించుకోలేదని, కానీ శాంతియుతంగా ఫెస్ట్‌ చేసుకునేందుకు అనుమతులు అడిగిన విద్యార్థులపై కేసులు పెట్టి సస్పెండ్‌ చేయడం సిగ్గుచేటని అన్నారు. వీసీ.. బీజేపీ దాని అనుబంధ సంఘాల ఒత్తిడి మేరకే పనిచేస్తున్నారని, పక్షపాత వైఖరి వల్ల విద్యార్థులు నష్టపోతున్నారని తెలిపారు. వీసీని వెంటనే తొలగించాలని, అలాగే నీట్‌లో ఉన్న మెంబర్స్‌ను తొలగించాలని డిమాండ్‌ చేశారు. అలాగే విద్యార్థుల సస్పెండ్‌ను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ఆందోళనలో పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.

Spread the love