ఎట్టకేలకు కదలిక..!

Finally a move..!– జోడేఘాట్‌లో మొదలైన డబుల్‌బెడ్‌రూంలు
– రూ.2.20లక్షలు అదనంగా పెంచిన ప్రభుత్వం
– సీఎం ఆదేశాలతో కదిలిన అధికార యంత్రాంగం
– ఆగిన నిర్మాణాల పున్ణప్రారంభంతో లబ్దిదారుల్లో ఆనందం
అది పోరాటాల పురిటి గడ్డ.. నిజాం నవాబుపై పోరాటానికి కేంద్ర బిందువు ఆ గ్రామం. ఆదివాసీల ఆరాధ్య దైవం కుమురంభీం నేలకొరిగిన ఈ గ్రామం ఇప్పటికీ దీనవాస్థలో ఉంది. అక్కడ ఏండ్లుగా నివసిస్తున్న వారికి ఇండ్లు కూడా లేని పరిస్థితి. పూరి గుడిసెల్లో నివాసముంటూ కాలం వెళ్లదీస్తున్న ఆదివాసీలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. గత ప్రభుత్వ హయాంలో ఆగిపోయిన ఇండ్ల నిర్మాణాలు.. తాజాగా కొత్త ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టిసారించి.. జోడేఘాట్‌లో ఆగిపోయిన ఇండ్ల నిర్మాణాలను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. దాంతోపాటు ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.20లక్షల నిధులు పెంచారు. దీంతో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చి.. నిర్మాణాలను పున:ప్రారంభించారు.
నవతెలంగాణ- ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి, కెరమెరి
కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కెరమెరి మండలంలోని జోడేఘాట్‌ చిన్న గ్రామం. మన్యం వీరుడు కుమురంభీం నేలకొరిగిన గ్రామం. ప్రతి ఏటా కుమురంభీం వర్ధంతి రోజు అనేక మంది ఈ గ్రామానికి వెళ్లి భీం విగ్రహానికి నివాళులర్పిస్తుంటారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత కొలువుదీరిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం జోడేఘాట్‌లో అధికారికంగా వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించింది. రూ.25కోట్లతో కుమురంభీం స్మారక స్థూపం, మ్యూజియం, యాంపి థియేటర్‌, స్మృతివనం, హట్టి నుంచి జోడేఘాట్‌ వరకు తారు రోడ్డు నిర్మాణం తదితర సౌకర్యాలను ఏర్పాటు చేసింది. 2016లో మ్యూజియం ప్రారంభోత్సవానికి హాజరైన అప్పటి మంత్రి కేటీఆర్‌ జోడేఘాట్‌ వాసులకు 30 డబుల్‌ బెడ్‌రూంలు మంజూరు చేశారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5లక్షల చొప్పున కేటాయించారు. 2017లో ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ సమయంలో ఒకరిద్దరు ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించారు. మరికొందరు బేస్‌మెంట్‌ వరకు.. ఇంకొందరు బేస్‌మెంట్‌కు కూడా డబ్బులు లేని కారణంగా నిర్మాణం చేపట్టలేదు. ఆ సమయంలో అధికారుల సాయంతో వీడీసీ ఆధ్వర్యంలో ఇంటి నిర్మాణాలు చేపట్టాలని భావించినా.. నిధులు రాకపోవడం మూలంగా ఎక్కడి నిర్మాణాలు అక్కడే నిలిచిపోయాయి. మిగతా ప్రాంతాల మాదిరిగానే ఈ గ్రామంలోనూ ఐదేండ్లుగా డబుల్‌ బెడ్‌రూంలు అసంపూర్తిగా మిగిలిపోయాయి.
ఎమ్మెల్యే చొరవ..సీఎం ఆదేశం..!
రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువు దీరిన కొద్ది రోజుల్లోనే జోడేఘాట్‌లో ఆగిపోయిన ఇండ్ల నిర్మాణాలతో పాటు ఇంద్రవెల్లి అమరుల స్థూపం వద్ద స్మృతి వనం ఏర్పాటుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంటి నిర్మాణాలు పూర్తిచేయడంపై ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ప్రత్యేక దృష్టిసారించారు. ఈ విషయాన్ని నేరుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన సీఎం వెంటనే నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. హుటాహుటిన గ్రామానికి వెళ్లిన జిల్లా ఉన్నతాధికారులు, ఐటీడీఏ అధికారులు సీఎంకు నివేదిక అందించారు. గత ప్రభుత్వం ఒక్కో ఇంటికి కేటాయించిన రూ.5లక్షల నిధులకు తోడు మరో రూ.2.20లక్షలు అదనంగా కేటాయించాలని సీఎం ఆదేశించారు. వెంటనే జీఓ విడుదల కావడంతో అధికారులు గుత్తేదారుతో ఇంటి నిర్మాణాలు పూర్తి చేయిస్తున్నారు. ప్రస్తుతం కొన్ని ఇండ్లు పూర్తి కావస్తుండగా.. మిగతా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. దీంతో లబ్దిదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
చాలా సంతోషంగా ఉంది
ఐదేండ్ల కిందటే ఇంటి నిర్మాణాలు మంజూరైనా నిధులు సరిపోవడం లేదనే కారణంగా ఆగిపోయాయి. పూరి గుడిసెల్లో ఉంటూ చాలా ఇబ్బందులు పడ్డాం. ప్రస్తుత ప్రభుత్వం అదనంగా రూ.2.20లక్షలు పెంచడంతో మళ్లీ ఇంటి నిర్మాణాలు ప్రారంభించారు. ఇప్పటికైనా సొంతింటి కల నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉంది.
-పెందూర్‌ మారు, జోడేఘాట్‌
నిర్మాణాల్లో నాణ్యత పాటించాలి
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల నిర్మాణ పనులు కొనసాగడం సంతోషంగా ఉంది. గతంలో ఇండ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో పనులు నిలిచిపోయాయి. ప్రస్తుత ప్రభుత్వం అదనంగా మరో రూ.2.20లక్షలు నిధులు పెంచడంతో మళ్లీ పనులు ప్రారంభమయ్యాయి. కానీ వాటి నిర్మాణంలో వాడే సిమెంట్‌, కంకర, ఇసుకలో నాణ్యత పాటించాలి. సకాలంలో పూర్తి చేసి లబ్దిదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలి.
-పెందూర్‌ రాజేశ్వర్‌, భీం ఉత్సవ కమిటీ మాజీ చైర్మెన్‌

Spread the love