హైదరాబాద్‌లో మూడు చోట్ల అగ్ని ప్రమాదాలు

Fire accidents at three places in Hyderabad– ఎగసిపడిన మంటలు.
నవతెలంగాణ-హిమాయత్‌ నగర్‌
హైదరాబాద్‌లో శుక్రవారం ఒక్క రోజే మూడు అగ్ని ప్రమాదాలు జరిగాయి. బొగ్గులకుంటలోని ఓ హాస్టల్‌లో, సికింద్రాబాద్‌ పాలికాబజార్‌లోని బ్యాగుల షాపులో, ఎస్సార్‌ నగర్‌ పీఎస్‌ పరిధిలో ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లో మంటలు ఎగసిపడ్డాయి. నారాయణగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధి అడ్మిన్‌ ఎస్‌ఐ జి.నరేష్‌ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం..
బొగ్గులకుంటలో శ్రీనివాస బార్సు హాస్టల్‌ మొదటి, రెండో అంతస్తుల్లో షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల పెద్దఎత్తున మంటలు లేచాయి. ఆ ప్రాంతంలో పొగ కమ్ముకుంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. హాస్టల్‌ గదుల్లో విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే, విద్యార్థుల సర్టిఫికెట్స్‌, ఫర్నిచర్‌, కుర్చీలు, బెడ్స్‌, పుస్తకాలు, దుస్తులు కాలిపోయాయి.
మోండా మార్కెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పాలికాబజార్‌లో ఉన్న ఓ సెల్లార్‌ ఎంట్రన్స్‌ వద్ద సిటీ కలెక్షన్స్‌ బ్యాగుల దుకాణంలో దట్టమైన పొగలు వచ్చాయి. స్థానికులు వెంటనే పోలీసులతోపాటు ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది, జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేశారు. అలాగే, ఎస్సార్‌ నగర్‌ పీఎస్‌ పరిధిలోని ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌లో మంటలు ఎగిసిపడగా అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదాల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

Spread the love