నిప్పులు చిమ్ముతూ నింగిలోకి..

Fire spewing into Ningi..– పీఎస్‌ఎల్‌వీ-సీ58 ప్రయోగం సక్సెస్‌
సూళ్లూరుపేట : ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా శ్రీహరికోట సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి పీఎస్‌ఎల్‌వీ- సీ58 రాకెట్‌ ద్వారా ఎక్స్‌పో శాట్‌ ఉపగ్రహం విజయవంతంగా అంతరిక్ష కక్ష్యలోకి చేరుకుంది. నూతన సంవత్సర శుభారంభం అని ఇస్రో చైర్మెన్‌ సోమనాథ్‌ ఆనందం వ్యక్తంచేశారు. భూమికి 650 కిలోమీటర్ల దూరంలో నిర్ణీత కక్ష్యలోకి ఎక్స్‌పో శాట్‌ చేరుకుంది. ఎక్స్‌ పో శాట్‌ ఉపగ్రహంలోని సోలార్‌ ప్యానల్స్‌ విచ్చుకొని బ్యాటరీలను ఛార్జింగ్‌ చేసే పనిని ప్రారంభించిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. 1963 తరువాత జరిగిన నేటి ప్రయోగ విజయంతో ఇస్రో 60 ఏండ్ల చరిత్ర పూర్తి చేసుకుంది. నూతన సంవత్సరం రోజున ఈ రాకెట్‌ ప్రయోగ విజయం భారత ప్రజలకు ఇస్రో బహుమతని ఇస్రో చైర్మెన్‌ ఎస్‌.సోమనాథ్‌ తెలిపారు. భవిష్యత్‌ ప్రయోగాలకు, పరిశోధనాత్మక ప్రయోజనాలకు ఈ ఉపగ్రహం కీలకంగా ఉపయోగ పడుతుందని తెలిపారు. ఈ ఏడాదిలో పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ, ఎస్‌ఎస్‌ఎల్‌వీ, 10 నుంచి 12 రాకెట్‌ ప్రయోగాలు ఉంటాయని తెలిపారు. మానవ రహిత గగన్‌యాన్‌ ప్రయోగమూ ఈ ఏడాది ఉంటుందని తెలిపారు.
అంతరిక్షం అంతు చూసేలా..
ఈ ప్రయోగం దేశ తొలి పొలారిమెట్రీ మిషన్‌ కాగా.. ప్రపంచంలో రెండోది. ఇంతకు ముందు ఈ తరహా మిషన్‌ అమెరికా చేపట్టింది. సవాళ్లతో కూడుకున్న పల్సర్‌లు, బ్లాక్‌హోల్‌ ఎక్స్‌ రే బైనరీలు, యాక్టివ్‌ గెలాక్సీ న్యూక్లియోలు, న్యూట్రాన్‌ స్టార్స్‌, నాన్‌ థర్మల్‌ సూపర్‌ నోవా అవశేషాలతో సహా విశ్వంలో గుర్తించబడిన 50 ప్రకాశవంతమైన మూలాలను ఎక్స్‌పోశాట్‌ అధ్యయనం చేయనున్నది. ఈ ఉపగ్రహాన్ని 500-700 కిలోమీటర్ల దూరంలో వృత్తాకార దిగువ భూ కక్ష్యలో ప్రవేశపెడుతారు. ఐదేండ్లపాటు సేవలందించనున్న ఎక్స్‌పోశాట్‌లో రెండు పేలోడ్స్‌ ఉన్నాయి. పాలీఎక్స్‌ (ఎక్స్‌-కిరణాలలో పొలారిమీటర్‌ పరికరం), ఎక్స్‌-రే స్పెక్ట్రోసోపీ, టైమింగ్‌ (ఎక్స్‌పెక్ట్‌-ఎక్స్‌స్‌పీఈసీటీ)ను అమర్చారు. ఖగోళ వస్తువులు, తోకచుక్కల నుంచి సుదూర గెలాక్సీల వరకు సమాచారాన్ని ఎక్స్‌పోశాట్‌ సేకరించనున్నది.
ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం అభినందనలు
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ-సీ58 రాకెట్‌ ప్రయోగం విజయవంతం కావటంపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేతలకు ఆయన ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. ఈ ప్రయోగంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా తర్వాత బ్లాక్‌ హోల్స్‌ను అధ్యయనం చేయటానికి అబ్జర్వేటరీ ఉపగ్రహం ఉన్న రెండో దేశంగా భారతదేశం అవతరించిందని పేర్కొన్నారు. కొత్త సంవత్సరం రోజున మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించటంతో ఇస్రో రోదసిలో భారతదేశ పతాకాన్ని ఎగుర వేసిందన్నారు. దీంతో ఇస్రో మరో శిఖరాన్ని చేరుకుందనీ, భవిష్యత్తులో అది మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Spread the love