చికున్‌గున్యాకు ఫస్ట్‌ వ్యాక్సిన్‌ !

Vaccine Forఆమోదించిన అమెరికా
వాషింగ్టన్‌ : దోమ కాటుతో వచ్చే చికున్‌గున్యాకు ప్రపంచంలోనే మొదటి వ్యాక్సిన్‌ను అమెరికా ఆరోగ్య శాఖ గురువారం ఆమోదించింది. ఈ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఆరోగ్య ముప్పుగా ఆవిర్భవించనుందని అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డిఎ) హెచ్చరించింది. యూరప్‌కు చెందిన వాల్నెవా కంపెనీ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్దిపరిచింది. ఇక్స్‌చిక్‌ పేరుతో దీన్ని మార్కెటింగ్‌ చేస్తారు. 18ఏళ్ళకు పైబడిన వారికి మాత్రమే ఈ వ్యాక్సిన్‌ వేసేందుకు అనుమతించారు. ఇక్స్‌చిక్‌ వ్యాక్సిన్‌కు అమెరికా ఆమోద ముద్ర వేయడంతో ఇక వైరస్‌ ప్రబలంగా వున్న దేశాల్లో వ్యాక్సిన్‌ పంపిణీ వేగమందు కుంటుందని భావిస్తున్నారు. జ్వరంతో పాటూ తీవ్రమైన జాయింట్ల నొప్పిని కలిగించే ఈ చికున్‌గున్యా ఎక్కువగా ఆఫ్రికా, ఆగేయాసియా,, అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ వైరస్‌ కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోందని, ఇది ఆందోళన కలిగించే అంశంగా వుందని ఎఫ్‌డిఎ తెలిపింది. గత 15ఏళ్ళలో 50లక్షల మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. వృద్ధుల్లో, ఇప్పటికే ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారిలో ఈ వైరస్‌ ఇంకా తీవ్రతను కలగచేస్తుందని పేర్కొంది. ఈ వ్యాధి లక్షణాలు కొన్నిసార్లు నెలలు లేదా సంవత్సరాలు కూడా కొనసాగే అవకాశం వుంది. అయితే దీనివల్ల మరణాలు చాలా అరుదు.
ప్రస్తుతానికి ఈ వ్యాధికంటూ ప్రత్యేక చికిత్స లేదు, సాధారణ జ్వరం, నొప్పులకు వాడే మందులే వాడుతున్నారు.

Spread the love