కంప్రెషర్‌ పేలి ఐదుగురు మృతి

Compressor burst Five people died– సౌత్‌ గ్లాస్‌ పరిశ్రమలో భారీ ప్రమాదం
– 15 మందికి గాయాలు
– అంతా వలస కార్మికులే..
– ముక్కలు ముక్కలుగా కార్మికుల శరీర భాగాలు
– రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్‌ మండలంలో ఘటన
నవతెలంగాణ-షాద్‌నగర్‌
సౌత్‌ గ్లాస్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ పరిశ్రమలో శుక్రవారం భారీ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు వలస కార్మికులు మృతి చెందారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ నియోజకవర్గం ఫరూఖ్‌నగర్‌ మండల పరిధిలోని బూర్గుల గ్రామ శివారులో శుక్రవారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సౌత్‌ గ్లాస్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ పరిశ్రమలో ఇతర రాష్ట్రాల కార్మికులు పనిచేస్తున్నారు. శుక్రవారం వారంతా కంప్రెషర్‌ గ్లాసులను ఒక క్రమ పద్ధతిలో అమరుస్తున్నారు. కంప్రెషర్‌కు డోర్‌ లాక్‌ పడక.. ప్రెజర్‌ ఎక్కువ కావడంతో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో బీహార్‌ రాష్ట్రానికి చెందిన చిత్తరాంజన్‌(25), రాం ప్రకాష్‌(45), రావుకాంత్‌(25), రోషన్‌(36), ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన రాం ఆశిష్‌(20) అక్కడికక్కడే మృతిచెందారు. శరీర భాగాలు ముక్కలు ముక్కలుగా తెగి పడి ఎవరినీ గుర్తుపట్టలేని విధంగా మారింది. సుమిత్‌, సుబోధ, మంటుకుయా, గోవింద్‌, కార్తీక్‌, సుజాత, నేలమ్మా, రోషన్‌తోపాటు సుమారు 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని షాద్‌నగర్‌లోని ప్రయివేట్‌ ఆస్పత్రికి తరలించారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. శంషాబాద్‌ డీసీపీ రాజేష్‌, షాద్‌నగర్‌ ఏసీపీ, ఇతర పోలీసు సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించి.. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్‌
రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శశాంక ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనకు గల కారణాలపై ఆరా తీశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
మృతులకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి : కార్మిక సంఘాల నాయకులు
ప్రాణం కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. సేఫ్టీ పరికరాలు లేకపోవడంతోనే ప్రమాదం జరిగిందని, నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు బక్కని నర్సింలు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
షాద్‌నగర్‌ ఘటన పట్ల మాజీ మంత్రి హరీశ్‌రావు దిగ్భ్రాంతి
షాద్‌ నగర్‌లోని గ్లాస్‌ పరిశ్రమలో పేలుడు జరిగి ఆరుగురు కార్మికులు మృతి చెందటం పట్ల మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలనీ, సహాయక చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలోని పరిశ్రమల్లో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నా, భద్రతా చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిం చటం శోచనీయమని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
కార్మికులు చనిపోవడం బాధాకరం : సీఐటీయూ
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ ప్రాంతంలోని సౌత్‌క్లాస్‌ కంపెనీలో జరిగిన ప్రమాదంలో ఆరుగురు కార్మికులు చనిపోవడం, 15 మందికిపైగా కార్మికులు తీవ్రంగా గాయపడటం బాధాకరమని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌ పేర్కొన్నారు. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.40 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ఆ ప్రమాదంపై సమగ్ర విచారణ చేయించాలనీ, యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
చనిపోయిన, గాయపడిన కార్మికుల్లో ఇతర రాష్ట్రాల నుంచి వలసొచ్చిన కార్మికులే ఉన్నారని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.40 లక్షల చొప్పున, గాయపడిన కార్మికులకు రూ.10 లక్షల చొప్పున యాజమాన్యంతో ప్రభుత్వం తక్షణమే ఇప్పించాలని డిమాండ్‌ చేశారు.
సీఎం దిగ్భ్రాంతి
– బాధితులకు అండగా ఉండాలి
క్షతగాత్రులకు వైద్య సేవలందించాలి : అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
షాద్‌నగర్‌ ప్రమాద ఘటనపై అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి అప్ర మత్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్సలు అందించాలని సూచించారు. కలెక్టర్‌, రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక శాఖ, కార్మిక, పరిశ్రమల శాఖల అధికారులు, వైద్య బృందాలు ఘటనా స్థలిలోనే ఉండి సమన్వయంతో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సీఎం ఆదేశించారు.

Spread the love