పంటలపై వరద ప్రతాపం

 Flood damage crops– ప్రకృతి ప్రకోపానికి వేలాది ఎకరాల్లో నష్టం
– పొలాల్లో ఇసుక మేటలు.. బండరాళ్లు
– అమలుకు నోచుకోని ఫసల్‌ బీమా పథకం సర్కారు
– సాయంపైనే అన్నదాతల ఆశలు
బోథ్‌ మండల కేంద్రానికి చెందిన ఈ రైతు పేరు ఈట్టెడి మోహన్‌రెడ్డి. రెండున్నర ఎకరాల్లో సోయా సాగు చేశారు. పైరు ఎదిగే దశలో వరద బీభత్సం సృష్టించింది. పొలంలోకి పెద్ద బండరాళ్లు కొట్టుకొచ్చాయి. పైరు వరద పాలైంది. ఎకరానికి కనీసం రూ.30వేల చొప్పున పరిగణనలోకి తీసుకుంటే సుమారు రూ.70వేల వరకు నష్టం జరిగినట్టు రైతు చెబుతున్నారు. ఇలాంటి రైతులు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో వేలాది మంది ఉన్నారు.
నవతెలంగాణ- ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఇటీవల రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టించాయి. ఊళ్లకు ఊర్లే నీటిలో మునిగిపోయాయి. పంట పొలాలు చెరువుల్లా మారాయి. రోజుల తరబడి నీరు నిలిచిపోవడంతోపాటు వరద పారడంతో ఇసుక మేటలు వేశాయి. చెత్త, చెట్లు, రాళ్లు కొట్టుకొచ్చాయి. లక్షల ఎకరాల్లో పంట వరద పాలైంది.
అలాగే, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఉగ్రరూపం దాల్చిన నదులు, వాగుల కారణంగా పరివాహక ప్రాంతాల్లోని పంటలన్నీ నాశనమయ్యాయి. రైతులు పెట్టిన పెట్టుబడి మొత్తం వరదపాలైంది. నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన పంటలను చూసి రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. పరివాహక ప్రాంతాల్లోని పంట పొలాలు ఇప్పటికీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఇసుక మేటలు వేయడం..బండరాళ్లు కొట్టుకురావడంతో బీడు భూముల్లా కనిపిస్తున్నాయి. పంట నష్టంపై వ్యవసాయశాఖ ప్రాథమికంగా సర్వే చేపట్టింది. ఉమ్మడి జిల్లాలో వేలాది ఎకరాల్లో నష్టం వాటిల్లినట్టు గుర్తించింది. కానీ ఫసల్‌ బీమా పథకం అమల్లో లేపోవడంతో నష్టపరిహారం అందలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో జాతీయ విపత్తుగా పరిగణించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారం అందించి ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. పది రోజులపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాను అతలాకుతలం చేశాయి. పచ్చని పంటలతోపాటు ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. అనేకచోట్ల వంతెనలు, రోడ్లు కొట్టుకుపోయాయి. విద్యుత్‌ స్తంభాలు నేలకూలడంతో రూ.కోట్ల నష్టం జరిగింది.
ఆయా శాఖల అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టాన్ని అంచనా వేస్తోంది. ప్రభుత్వానికి పంపించేందుకు అధికారులు నివేదిక రూపొందిస్తున్నారు. ఇవి ఒక ఎత్తైతే.. ఎదుగుతున్న దశలో ఉన్న పైర్లు కొట్టుకుపోయాయి. రైతులకు తీరని శోకాన్ని మిగిల్చింది. ఖరీఫ్‌ తొలినాళ్లలో వర్షాభావ పరిస్థితుల కారణంగా వేసిన విత్తనాలు భూమిలోనే కలిసిపోగా.. మలి విడత వేసిన విత్తనాలు మొలకెత్తి పంట ఎదుగుదలకు చేరుకుంది. కానీ భారీ వర్షాల వల్ల నదులు, వాగులు, వంకల పరివాహక ప్రాంతాల్లోని పంట పొలాలు పూర్తిగా కొట్టుకుపోయాయి. పత్తి, సోయా, మొక్కజొన్న తదితర పంటలు రోజుల తరబడి నీటిలోనే ఉండటంతో మురిగిపోయి పనికిరాకుండా పోయాయి.
ఆదిలాబాద్‌ జిల్లాలో 60వేలు, నిర్మల్‌ జిల్లాలో 33వేల ఎకరాల్లో పంటలు దెబ్బతినడంతో ఎదుగుదల లోపించి దిగుబడి వచ్చే పరిస్థితి లేదని అఖిలపక్ష రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి
వరదల కారణంగా పంటలు, రోడ్లు, వంతెనలు తదితర వాటికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ పరిస్థితులను జాతీయ విపత్తుగా పరిగణించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సహకారం అందించాలి. పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.40వేలు, కోతకు గురైన భూములకు సంబంధించి రూ.50వేల చొప్పున పరిహారం అందించాలి. రానున్న రోజుల్లో పంటలు పండే పరిస్థితి లేకపోవడంతో రైతులు నష్టపోకుండా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఫసల్‌ బీమా పథకాన్ని వర్తింపజేయాలి.
– బండి దత్తాత్రి, అఖిలపక్ష రైతు సంఘం నాయకులు
అమలు కాని ఫసల్‌ బీమా..!
ప్రకృతి విపత్తులు, అవృష్టి..అనావృష్టి సంభవించి పంటలు నాశనమైతే ఫసల్‌ బీమా పథకం కింద పరిహారం వచ్చేది. రైతులకు పంట రుణాలు అందించే సమయంలో బ్యాంకులు రైతుల ఖాతాల నురచి ఇన్సురెన్సు కింద ప్రీమియం తీసుకునేవి. ఇలా రైతులు చెల్లించిన ప్రీమియం డబ్బులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా చెల్లించేవి. కానీ 2020 నుంచి ఈ పథకం అమలు కాకపోవడంతో రైతులకు పరిహారం రావడంపై అనుమానం తలెత్తుతోంది. రైతుల నుంచి ప్రీమియం తీసుకోకపోవడం.. ప్రభుత్వాలు తమ వాటా చెల్లించకపోవడంతో ఇన్సురెన్సు కంపెనీలు కూడా ఎలాంటి పరిహారం అందించలేని పరిస్థితి. ఈ ఆపద సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. జాతీయ విపత్తుగా పరిగణించి ప్రభుత్వాలు రైతులకు నష్ట పరిహారం చెల్లిస్తే కొంత మేరకైనా ఉపశమనం లభించే ఆస్కారం ఉంటుంది.

Spread the love