లోక్‌సభ ఎన్నికలపై గురి

–  28న విస్తృతస్థాయి సమావేశం
–  అదే రోజు బీజేపీఎల్పీ నేత ఎన్నిక !
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో గతం కంటే మెరుగైన సీట్లు…ఓట్ల శాతం సాధించిన బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో వీలైనంత ఎక్కువ స్థానాలు సాధించడంపై దృష్టిసారించింది. తెలంగాణపై అమిత్‌షా ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేస్తున్నట్టు తెలిసింది. లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తం చేయడంలో భాగంగానే ఈ నెల 28న తెలంగాణకు ఆయన రాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించేందుకు రాష్ట్ర నాయకత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఆ సమావేశానికి తమ పార్టీ మండలాధ్యక్షులు, జిల్లా, రాష్ట్ర పదాధికారులు 1200 మందికిపైగా హాజరవుతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డి ప్రకటించారు. ఉత్తర తెలంగాణలోని ఎంపీ సీట్లతో పాటు మహబూబ్‌నగర్‌, చేవెళ్ల నియోజకవర్గాలపైనా ఈ సారి ప్రత్యేకంగా దృష్టి సారించనున్నది. వికారాబాద్‌ జిల్లా పరిగిలో తబ్లీక్‌ జమాత్‌ ఆధ్వర్యంలో వచ్చే నెలలో జరిగే మూడు రోజుల సమావేశాలకు రూ.2.75 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడంపై బీజేపీ ఆగ్రహంతో ఉంది. లోక్‌సభ ఎన్నికల ముందు జరుగుతున్న ఆ సమావేశాలను రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకోవడంపై కమలం పార్టీ పెట్టింది. దాన్నిచుట్టూ రాజకీయాన్ని తిప్పి లబ్దిపొందాలనే వ్యూహరచనతో ముందుకెళ్తున్నది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ అభ్యర్థుల ప్రకటనలో స్పష్టత కొరవడింది. కొన్నిచోట్ల అభ్యర్థులను ప్రకటించి మరీ మార్చేసిన పరిస్థితి. దీంతో ఆ పార్టీలో పెద్ద గందరగోళమే నెలకొంది. నేతల రాజీనామాల పర్వం కూడా కొనసాగింది. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో అలాంటి పరిస్థితి ఉత్పన్నం కావొద్దనే ఆలోచనతో బీజేపీ ముందుకెళ్తున్నది. సీనియరా? జూనియరా? ఇతర పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులా? అనే తేడా లేకుండా నెల, నెలన్నర ముందే ఎంపీ స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులను ప్రకటించాలనే ఆలోచన ఆ పార్టీ శ్రేణుల నుంచి బలంగా వినిపిస్తున్నది. కొందరు రాష్ట్ర నేతలు కూడా ఇదే అంశాన్ని జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జాతీయ నాయతకత్వం ఆశించినట్టుగా 15కుపైగా సీట్లు రాకపోయినప్పటికీ గతం కంటే మెరుగైన ఫలితాలు వచ్చిన విషయం విదితమే. మరో మూడు, నాలుగు స్థానాల్లో ద్వితీయ స్థానంలో కూడా ఆ పార్టీ అభ్యర్థులు నిలిచారు. దీంతో పార్లమెంట్‌ స్థానాల్లో మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగానే ఈ నెల 28న రాష్ట్రస్థాయి విస్తృత సమావేశాన్ని నిర్వహించబోతున్నది.
ఎల్పీనేత ఎన్నికపైనా అదే రోజు స్పష్టత
అమిత్‌షా ముఖ్యఅతిథిగా హాజరయ్యే ఆ సమావేశంలోనే బీజేపీ ఎల్పీ నేతను ఎన్నుకోనున్నట్టు తెలిసింది. అసెంబ్లీలో ఇప్పటికే అన్ని పక్షాలు తమ ఎల్పీ నేతలను ప్రకటించాయి. బీజేపీలో మాత్రం ఎవరిని ఎన్నిక చేయాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. సీనియార్టీ దృష్ట్యా రాజాసింగ్‌ రేసులో ముందంజలో ఉన్నారు. తెలుగులో అనర్గళంగా మాట్లాడకపోవడం, అన్ని విషయాలపై పట్టులేకపోవడం ఆయనకు ప్రధాన ఆటంకాలుగా మారనున్నాయి. నిర్మల్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎ.మహేశ్వర్‌రెడ్డి కూడా ఎల్పీనేత రేసులో బలంగా ఉన్నారు. వీరిద్దరూ కాని పక్షంలో ప్రస్తుత, మాజీ సీఎంలపై విజయం సాధించిన వెంకటరమణారెడ్డిని నియమించి ముందుకెళ్లేందుకు బీజేపీ అధిష్టానం యోచిస్తున్నట్టు సమాచారం. పార్లమెంట్‌ ఎన్నికల్లో దూకుడుగా ముందుకెళ్లడానికి ఈ అంశం కూడా దోహదపడుతుందనే ఆలోచనలో ఆ పార్టీ నాయకత్వం ఉంది

Spread the love