పోలింగ్‌ ప్రక్రియపై దృష్టి

పోలింగ్‌ ప్రక్రియపై దృష్టి– ఓటర్‌ ఇన్ఫర్మేషన్‌ స్లిప్‌ల పంపిణీకి చర్యలు
– బ్రెయిలీ లిపిలో బ్యాలెట్‌ తయారీ
– వృద్ధులకు, వికలాంగులకు ఇంటి వద్దే ఓటు హక్కుకు అవకాశం
నవతెలంగాణ- సిటీబ్యూరో
నామినేషన్ల పర్వం పూర్తి కావడంతో హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ అధికారులు పోలింగ్‌పై దృష్టి సారించారు. పోలింగ్‌ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు నోడల్‌ అధికారులు అన్ని ఏర్పాట్లూ వేగవంతంగా చేస్తున్నారు. అధికారులతో శనివారం జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌ జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.
ఇప్పటికే హైదరాబాద్‌ జిల్లాలోని 15 నియోజకవర్గాలకు ఆయా రాష్ట్రాల సీనియర్‌ ఐఏఎస్‌లు 8 మందిని జనరల్‌ అబ్జర్వర్లుగా కేంద్ర ఎన్నికల కమిషన్‌ నియమించింది. వారు హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఇదిలావుడగా పోలింగ్‌ సిబ్బంది కోసం వాహనాలను సెక్టోరల్‌ వారీగా సమకూర్చనున్నారు. పోలింగ్‌లో విధులు నిర్వహించే వారు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలుసుకొని ఇబ్బంది లేకుండా ట్రాన్స్‌పోర్ట్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల ఆర్‌.ఓ పరిధిలోని పోలింగ్‌ కేంద్రాలకు రూట్‌ మ్యాప్‌, కమ్యూనికేషన్‌ ప్లాన్‌, పోస్టల్‌ బ్యాలెట్‌, వాహనాలు, ట్రాన్స్‌పోర్ట్‌ సౌకర్యానికి సిద్ధం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్‌ రోస్‌ ఆదేశాలిచ్చారు. పోలింగ్‌ కేంద్రాల్లో కనీస మౌలిక సదుపాయాలు సమకూరుస్తున్నారు.
ఓటర్‌ ఇన్ఫర్మేషన్‌ స్లిప్‌లు
ఓటరు స్లిప్‌ ఐడీ కాదు. ఎన్నికల కమిషన్‌ నిర్దేశించిన 12 ఐడీ కార్డుల్లో ఏదో ఒకటి పోలింగ్‌ బూత్‌కు తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. (ఓటరు గుర్తింపు నిర్ధారణకు ప్రత్యామ్నాయ ఫొటో గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి). ఈ మేరకు ఓటర్‌ ఇన్ఫర్మేషన్‌ స్లిప్‌ల పంపిణీకి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్‌ జిల్లాలో ఓట్ల నమోదు శాతం పెంచేందుకు సెలబ్రిటీల ద్వారా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఓటింగ్‌పై విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. అంధులకు ప్రత్యేకంగా బ్రెయిలీ లిపిలో బ్యాలెట్‌ను తయారు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. 80 సంవత్సరాల పైబడిన వృద్ధులకు, వికలాంగులు ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నారు. హౌమ్‌ ఓటింగ్‌ సెక్టోరల్‌ వారీగా ఎంత మంది ఉన్నారో సమాచారాన్ని సిద్ధం చేస్తున్నారు.
భారీ బందోబస్తు
ఎన్నికల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నామినేషన్ల పర్వం పూర్తి కావడంతో పోలింగ్‌ ప్రక్రియపై దృష్టి సారించారు. ఇప్పటికే నియోజకవర్గానికి మూడు బృందాలు 24 గంటలపాటు నిఘా ఉండేవిధంగా 105 బృందాలను ఏర్పాటు చేశారు. టీమ్‌లో సగం మంది కేంద్ర బలగాలు ఉండనున్నాయి. ఓటర్లను ప్రభావితం చేసే విధంగా వ్యవహరించిన వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు. కంట్రోల్‌ రూం, కమాండ్‌ కంట్రోల్‌ రూంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా మద్యం షాపులు, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు.

Spread the love