పోలీస్ సూచనలు పాటించి విలువైన ప్రాణాలు కాపాడుకోండి 

– వర్షాల ధాటికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి 
– బయటకు, పంట పొలాలకు, చేపల వేటకు వెళ్ళొద్దని సూచన
– విపత్కర పరిస్థితుల్లో డయల్ 100, పోలీస్ కంట్రోల్ రూమ్ సంప్రదించాలి
– అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండాలి
– దుబ్బాక సీఐ మున్నూరు కృష్ణ
నవతెలంగాణ -దుబ్బాక రూరల్ 
తెలిసి తెలియని ప్రదేశాలకు చేపల వేటకు వెళ్లి  ప్రజలు విలువైన ప్రాణాలు పోగొట్టుకోవద్దని, సీపీ ఆదేశాల మేరకు పోలీసుల సూచనలు తప్పకుడా మండల ప్రజలు పాటించి వర్షాల ధాటికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ దుబ్బాక సీఐ మున్నూరు కృష్ణ కోరారు.దుబ్బాక మండలంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువుల్లో నీరు నిండి వాగులు, వంకలు, కుంటలు, మత్తడులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో గురువారం సీఐ మున్నూరు కృష్ణ ఆధ్వర్యంలో రఘోత్తంపల్లి నుండి గొసన్ పల్లి రోడ్డు మార్గం అలాగే ఆకారం గ్రామం నుండి తుజాల్ పూర్ గ్రామానికి వెళ్ళే బ్రిడ్జి పై కూడవెల్లి వాగు నీటి ప్రవాహం పెరగడంతో   ఆయా గ్రామ సర్పంచులు, ఎంపీటీసీల సహకారం తో ఆ దారిని క్లోజ్ చేశారు. అనంతరం పలు గ్రామాలను  ఎస్ఐ గంగరాజు, పోలీస్ సిబ్బందితో కలిసి డేంజర్ జోన్లుగా ఉన్న గ్రామాలను పరిశీలించారు. ఈ సందర్భంగా దుబ్బాక సీఐ మున్నూరు కృష్ణ మాట్లాడుతూ వర్షాల కారణంగా  వాగులు , చెరువులు,కుంటలు ప్రమాదకర పరిస్థితికి చేరుకున్నాయని ప్రజలెవరు బయటకు రావొద్దని, అత్యవసర సమయం (విపత్కర పరిస్థితుల్లో) లో డయల్ 100, పోలీస్ కంట్రోల్ రూమ్ లను సంప్రదించాలని, అవసరమైతే తప్ప బయటకు రావొద్దని వర్షం తగ్గే వరకు ప్రజలు ఇళ్లలోనే జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చేపల వేటకు అస్సలు వెళ్ళొద్దని తెలిపారు. వర్షాలు తగ్గేవరకు రైతులు వ్యవసాయ పనులకు వెళ్ళదని, ప్రమాదకర స్థాయికి చేరుకున్న పెంకుటిళ్ళల్లో ప్రజలు నివసించ వద్దని కోరారు.
ప్రజలు పోలీస్ అధికారుల సూచనలు పాటించి విలువైన ప్రాణాలు కాపాడుకోవాలని అన్నారు. ప్రకృతి లోజరిగే మార్పులు, పరిస్థితి దృశ్య అధికారులు, సర్పంచులు, ప్రజా ప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు.కార్యక్రమంలో ఆకారం ఎంపీటీసీ పొలబోయిన లక్ష్మీ నారా గౌడ్, పలు గ్రామాల సర్పంచ్లు, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు ఉన్నారు
Spread the love