వేలానికి తందాన!

వేలానికి తందాన!గత రెండ్రోజులుగా తెలంగాణ ప్రజలు ముఖ్యంగా సింగరేణి గనులున్న ఆ ఆరు జిల్లాలవారూ బీజేపీ, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల ప్రకటనలు చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. అందరూ అయ్యగార్లే రొయ్యల బుట్ట మాత్రం మాయమైందన్నట్టు లేదూ పరిస్థితి! 2022 నవంబరు 12న రామగుండం సభలో భారత ప్రధాని పెద్ద పులి పచ్చగడ్డే తింటుందని ఒట్టేసి మరీ చెప్పారు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న రీతిలో ఉంది కదూ!
‘సింగరేణిని ప్రయివేటీకరించం’ అని మోడీ నొక్కివక్కాణిస్తారు కాని వేలం వేస్తారట! వేలం పాటలో ఇల్లు కొన్నవాడు ఆ ఇంట్లో వాడే ఉంటాడు తప్ప పాత ఓనర్ని ఉండనివ్వడనే విషయం ఇంగిత జ్ఞానం ఉన్న వారెవరికైనా తెలిసేదే! వేలం పాటను ఒక విధానంగా కొనసాగిస్తోంది మోడీ సర్కార్‌. దేశంలోని సుమారు 500 బొగ్గు బ్లాకుల్లో ఇప్పటికే 300 బ్లాకుల వేలం పాట పూర్తయింది. వాటిలో కొత్త ఓనర్‌ జొరబడిపోయాడు. ‘రాజ్యం’ వాటా ముగిసిపోయింది.
సింగరేణిలో మూడు బ్లాకులు కొందరు పొందారు. ఆ పొందిన వారితో బీఆర్‌ఎస్‌కున్న చుట్టరికం గురించి రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల హడావుడి తప్ప అసలు విధానం గురించి ఏ మాటా ఉండదు. మైనింగ్‌ చట్టం సవరణలపై 2015లో కేసీఆర్‌ పార్టీ పార్లమెంటులో ఎగబడి బీజేపీని బలపరిచిన సంగతి బీఆర్‌ఎస్‌ వారు మాట్లాడరు. వారి హనీమూన్‌ కాలంలో మూడు బ్లాకులు వేలం పాడుకున్న ఫార్మా కంపెనీ బొగ్గు బయటికి తీసే యంత్రాలు లేక, సాంకేతిక పద్ధతులు రాక బొగ్గు తవ్వలేకపోయారు. ఇవి వారు చెప్పిన మాటలే! అప్పటిదాకా ఆంధ్రప్రదేశ్‌కు టన్ను రూ.3,500 – 4,000ల మధ్య అమ్మే సింగరేణి బొగ్గు ‘అందక’ బహుశా ఆ సాకుతో టన్నుకి రూ.18 వేలకు ఏకంగా అదానీ దొర నుంచి 17 లక్షల టన్నుల బొగ్గు కొన్నారు. ఈ భారం ఆ రాష్ట్ర ప్రజలు మోయాల్సిందే!
ప్రభుత్వరంగ పరిశ్రమలను ప్రయివేటు ఆసాములకు కట్టబెట్టేందుకు నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ 2021-22 బడ్జెట్‌లో ప్రకటించి 2025 నాటికి మొదట ఆరు లక్షల కోట్లు లీజ్‌పై ప్రయివేటు వారికి అప్పగించాలని, ఆ తర్వాత పదకొండు లక్షల కోట్లు బంగారు పళ్ళెంలో పెట్టి అప్పగించాలని భావించారు. కీలకమైన కోల్‌మైన్‌ రంగంలో ఈ వేలంపాట ప్రక్రియకు తలుపులు తీయడం మరో విధమైన ప్రయివేటీకరణ దారి. విశాఖ స్టీల్‌ ప్లాంటుకు ఐరన్‌ ఓర్‌ క్యాప్టివ్‌ మైన్స్‌ ఇవ్వకపోవడం ఆ రకంగా దాన్ని నష్టాల్లోకి నెట్టేయడం, ఆ తర్వాత ప్రయివేటు వారికి అప్పగించడం మరో రకమైన ప్రయివేటీకరణ ప్రక్రియ. ఒకటి 16వ శతాబ్దం ఐరోపా గిలెటన్స్‌ వాడటం. ఇంకోటి 19వ శతాబ్దం అమెరికాలో కరెంట్‌షాక్‌తో చంపేయడం. మరో పద్ధతి 20వ శతాబ్దపు ఉరిశిక్ష. పద్ధతి ఏదైనా ప్రభుత్వరంగాన్ని చంపేయడమే బీజేపీ విధానం.
బీఆర్‌ఎస్‌ – బీజేపీ సంబంధ బాంధవ్యాలు బీఆర్‌ఎస్‌ రాజకీయ అవసరాల చుట్టూనే తిరగడం దారుణమైన విషయం. 2014-18 మధ్య చెట్టాపట్టాలేసుకొని తిరిగేటప్పుడు గనుల ప్రయివేటీకరణకు జై (2015లో), పెద్దనోట్ల రద్దుకు జై (2016లో), జీఎస్టీకి జై (2017లో). ఎక్కడ చెడిందో! ఇప్పుడు డొక్క చించేస్తా, డోలు కట్టేస్తామంటున్నారు బీఆర్‌ఎస్‌ నేతలు. ఈ రోజు వేలం పాటని నేటి ”హిజ్‌ మాస్టర్స్‌ వాయిస్‌”లో సీమటపాకాయలు మోగాయి. చివరికి ‘పాట’ ప్రశాంతంగా సాగిపోయింది. అక్కడ ఒక్క నిరసనా జరగలేదు. దేశంలో ప్రయివేటీకరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్‌ పార్టీ అధినాయకత్వం ఈ విషయంలో చప్పుడు చేయదు. భట్టి వేలం పాటలో పాల్గొని మా సింగరేణిని కాపా డాలని సన్నాయి నొక్కులు నొక్కితే ఏం ఉపయోగం? ఎవరే విషయం మాట్లాడినా దీన్నే ”వాషింగ్టన్‌ కన్సెన్సస్‌” అంటారు. అంటే అమెరికాలో తయారై ప్రపంచంలోకి విస్తరించి అనేక పాలక పార్టీలు, వాటి తోకలు ఆమోదం తెల్పుతున్న సిద్ధాంత మిది. దాని ప్రతిరూపాన్నే నేడు రాష్ట్రంలో చూస్తున్నాం. అందరూ సింగరేణిని కాపాడాలనే అంటారు. ఈ వేలం ప్రయివేటీకరణకి దగ్గరిదారని మాత్రం అంగీకరించరు.
మొత్తానికి దేశవ్యాప్తంగా ఉన్న ఈ బ్లాకుల వేలంపాట ప్రక్రియ రేవంత్‌రెడ్డి సౌజన్యంతో, ఇంకా చెప్పాలంటే కేసీఆర్‌ సౌజన్యంతో కూడా ఏ గొడవా లేకుండా ప్రశాంతంగా ముగిసిపోయింది. మా సింగరేణికే ఇవ్వాలని భట్టి కోరడం, ప్రధానితో మాట్లాడి పరిశీలిస్తామని కిషన్‌రెడ్డి చెప్పటం స్క్రీన్‌ప్లే, దర్శకత్వం రక్తికట్టింది.
సింగరేణి కార్మికులే కాదు, రాష్ట్ర కార్మికవర్గం తమ నోటికాడి ముద్దని ప్రయివేటు గద్దలు తన్నుకుపోవటాన్ని అనుమతిం చడమా, లేదా అనే సవాలును స్వీకరించడానికి సిద్ధమవుతారా లేదా అనేది తేలాల్సిన సమయం.

Spread the love