ఎన్నిక‌ల కోస‌మే రూ. 2 వేల నోట్ల ర‌ద్దు : సీపీఐ నారాయ‌ణ‌

నవతెలంగాణ – న్యూఢిల్లీ : ఈ దేశంలో అవినీతి లేదని చెప్పిన‌ బీజేపీ ప్రభుత్వం మాత్రం హోల్‌సేల్‌గా అవినీతికి పాల్పడుతుందని సీపీఐ నేత నారాయణ ఆరోపించారు. రాబోయే ఎన్నికల కోసమే బీజేపీ ప్ర‌భుత్వం రూ. 2000 నోట్ల చ‌లామ‌ణిని నిలుపుద‌ల చేసింద‌న్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… నిజంగానే మోడీ ప్రభుత్వానికి బ్లాక్ మనీని అంతం చేయాలనే చిత్తశుద్ధి ఉంటే రూ. 2 వేల‌ నోట్లను వెంటనే రద్దు చేయాల్సి ఉండేదన్నారు. రూ. 500, రూ. 1000 రద్దు సమయంలో కోట్ల నల్లధనం వైట్ మనీగా మారిందని విమర్శించారు. అంతేకాకుండా గతంలో పెద్ద నోట్ల ర‌ద్దు ప్రక్రియలో 3.4 లక్షల కోట్ల బ్లాక్ మనీ బయటపడుతుందని, తద్వారా ప్రతి భారతీయుడు అకౌంట్లో రూ. 15 లక్షలు జమ చేస్తామని నాడు మోడీ హామీ ఇచ్చిన విష‌యాన్ని గుర్తు చేశారు. కానీ ఎవరి అకౌంట్లో పైసా కూడా జమ కాలేదని తెలిపారు. ప్రస్తుతం కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నిజంగా మోడీ ప్రభుత్వానికి బ్లాక్ మనీ అంతం చేయాలని చిత్తశుద్ధి ఉంటే మార్చుకునే అవకాశం ఇవ్వకుండా ఉండేదన్నారు.

Spread the love