పేద, మధ్య తరగతి ప్రజల కోసమే..

Only for poor and middle class people..– మల్టీపర్పస్‌ ఫంక్షన్‌ హాల్స్‌ నిర్మాణం
– మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌
నవతెలంగాణ-బేగంపేట్‌
పేద, మధ్య తరగతి ప్రజల మేలు కోసమే ప్రభుత్వం మల్టీపర్పస్‌ ఫంక్షన్‌ హాల్స్‌ నిర్మాణం చేపడుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని రాంగోపాల్‌పేట డివిజన్‌ పాన్‌బజార్‌లో రూ.4.90 కోట్ల వ్యయంతో హాల్‌ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఫంక్షన్ల నిర్వహణ కోసం పేద, మధ్య తరగతి ప్రజలు లక్షలాది రూపాయల అద్దెలను చెల్లించలేక ఆర్ధికంగా ఎంతో ఇబ్బంది పడుతున్నారన్నారు. వారికి ఆ ఇబ్బందులను దూరం చేయాలనే ఆలోచనతోనే అన్ని సౌకర్యాలతో కూడిన ఫంక్షన్‌ హాల్స్‌ నిర్మిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్‌పేటలో నిర్మించగా, బేగంపేట డివిజన్‌ పాటిగడ్డలో రూ.6 కోట్ల వ్యయంతో నిర్మించిన మల్టీపర్పస్‌ ఫంక్షన్‌ హాల్‌ను ఇటీవలనే ప్రారంభించినట్టు వివరించారు. కార్యక్రమంలో జోనల్‌ కమిషనర్‌ రవికిరణ్‌, సుదర్శన్‌, వాటర్‌ వర్క్స్‌ సీజీఎం ప్రభు, కార్పొరేటర్‌ సుచిత్ర, మాజీ కార్పొరేటర్‌ అత్తిలి అరుణ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love