ప్రజా విముక్తి పోరాటానికి

For the people's liberation struggle– మత రంగు పులమాలనే కుట్ర
– తెగబడి, తిరగబడ్డ ఉద్యమం..
– ఐలమ్మ పోరాట తెగువ స్ఫూర్తిదాయకం
–  ఆ ఉద్యమంలో అజ్ఞాత వీరవనితలెందరో.. : ఐద్వా సీనియర్‌ నాయకులు పుణ్యవతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి మతతత్వ సంఫ్‌ుపరివార్‌ శక్తులు మత రంగు పులుముతున్నారనీ, ‘బాంచెను నీ కాల్మొక్తా అనే స్థాయి నుంచి దొర ఏందిరో..వాడి జులుమేందిరా’? అనగలిగే ధైర్యాన్నిచ్చిన ఆ మహత్తర పోరాటానికి వక్రభాష్యాలు చెప్పడం విడ్డూరంగా ఉందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) జాతీయ కోశాధికారి ఎస్‌ పుణ్యవతి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్‌లోని వీరనారి ఐలమ్మ భవన్‌(ఐద్వా కార్యాలయం)లో సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్‌ అరుణజ్యోతి, మల్లు లక్ష్మి, ఉపాధ్యక్షులు బి హైమావతి, కేఎన్‌ ఆశా లతతో కలిసి విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాచరికానికి వ్యతిరేకంగా తెగబడి, తిరగబ్డ పోరాటం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటమని చెప్పారు. ఆ పోరాటంలో మహిళల పాత్ర విడదీయలేనిదన్నారు. చిట్యాల ఐలమ్మతో పాటు అజ్ఞాత వీర వనితలు ఎందరో ఉన్నారని చెప్పారు. చల్లపల్లి జమిందారుకు వ్యతిరేకంగా, మందస రైతాంగ పోరాటంలోనూ వియమ్మ,గున్నమ్మ లాంటి పోరాట యోధుల చరిత్ర నేటి తరానికి స్ఫూర్తినిస్తాయని తెలిపారు. భూమి, భుక్తి, విముక్తి కోసం జరిగిన రైతాంగ సాయుధ పోరాటానికి ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ శక్తులు మత ప్రాతిపదికన జరిగిన పోరాటంగా చిత్రీకరించే కుయుక్తులకు పాల్పడుతు న్నారని విమర్శించారు. నాటి పోరాటంలో బీజేపీ, దాని పరివారం పాత్రం కించిత్తు కూడా లేదని తెలిపారు.
ఆ పోరాటంలో మఖ్దూం మొహియుద్దీన్‌, సయ్యద్‌ ఆలంఖుంద్‌మీర్‌, షోయబుల్లాఖాన్‌, ముర్తుజా హైదర్‌, సయ్యద్‌ ఇబ్రహీం,బందగి తదితరులు ఎందరో నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరు నడిపారని గుర్తు చేశారు.”దొడ్డికొమరయ్య” వీర మరణం తర్వాత.. మల్లు స్వరాజ్యం కడివెండి గ్రామంలో తమ ఉపన్యాసాలు, ఉయ్యాల పాటల ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించారని చెప్పారు. కుల, మత భేదాలకు అతీతంగా వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం జరిగిన ఆ పోరాటంలో సబ్బండ కులాలు పాల్గొన్నాయని తెలిపారు. ఆ పోరాటంలో నాలుగు వేల మంది విప్లవ వీరుల ప్రాణాలు, 10వేల మంది నిర్బంధం, ధారుణమైన చిత్రహింసలు, సామూహిక లైంగిక దాడులు, అయినా మొక్కవోని ధైర్యంతో సాగిన ఆ పోరాటాలను ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులు జరిపిన పోరాటంగా చరిత్రకు వక్రభాష్యాలు చెబుతున్న మతతత్వ వాదుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్‌ 10న వీరనారి ఐలమ్మ వర్దంతిని నిర్వహించుకుంటు న్నామని తెలిపారు.
ఈ నెల 17నుంచి ఐదు రోజుల పాటు ఐద్వా జాతా..
‘స్వేచ్ఛగా జీవించే హక్కు కోసం, మహిళల్లో చైతన్యం రగిలించే దిశగా ఈ నెల 17 నుంచి 22వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఐద్వా ఆధ్వర్యంలో జాతా నిర్వహించనున్నట్టు మల్లు లక్ష్మి తెలిపారు. రాష్ట్రంలో, దేశంలో మహిళలపై రోజురోజుకు లైంగిక దాడులు, హింస పెరుగుతున్నదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అశ్లీల వీడియోలు, మద్యం, మత్తు పదార్థాలు విచ్చలవిడిగా యువతకు చేరువవుతున్నాయని తెలిపారు. వీటిని అరికట్టాల్సిన పోలీసు యంత్రాంగం మాటలతో సరిపెట్టుకుంటుందని విమర్శించారు.రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మహిళా వ్యతిరేక విధానాలను ఎండగడతామన్నారు. ప్రతి జిల్లాలో మహిళా పారిశ్రామిక కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. గృహలక్ష్మి పథకానికి రాష్ట్రం రూ.5లక్షలు, కేంద్రం రూ.15లక్షలు ఇవ్వాలన్నారు. ఇంటి స్థలాలు లేని వారికి 125 గజాల స్థలాన్ని ఇచ్చి, ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Spread the love