పటేల్‌ సైన్యాలు ఎవరికోసం వచ్చాయి?

పటేల్‌ సైన్యాలు ఎవరికోసం వచ్చాయి?సెప్టెంబర్‌ 17ను విమోచన దినంగా ప్రభుత్వం నిర్వహించాలని ఇటీవల కాలంలో కేంద్ర హోంశాఖ ఒక సర్కులర్‌ను విడుదల చేసింది. అదే సమయంలో సంఫ్‌ు పరివార్‌ ప్రమేయంతో తీసిన ‘రజాకార్‌’ సినిమా విడుదలైంది.ఈ రెండు అంశాలను పరిశీలిస్తే గనుక తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించడం, హిందూ, ముస్లింల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందు కునేని స్పష్టమవుతున్నది. హైదరాబాద్‌ నైజాం సంస్థానంలో ముస్లిం రాజుపై మెజారిటీగా ఉన్న హిందువులు పోరాడి విజయం సాధించారని బీజేపీ వాదనలు చేస్తోంది. ఆనాడు హోంశాఖ మంత్రిగా ఉన్న సర్దార్‌ వల్లభారు పటేల్‌ సైన్యాల పోలీసు చర్యతోనే హైదరాబాద్‌ విముక్తి సాధించిందని, లేకపోతే అఖండ భారత్‌ నిర్మాణానికి గుండెకాయ లాంటి హైదరాబాద్‌ను నైజాం నవాబ్‌ పాకిస్తాన్‌లో కలిపేవాడనే వదంతుల్ని ప్రచారం చేస్తున్నది. ఇది భూమికోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం ఆంధ్ర మహాసభ నాయకత్వం, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో జరిగిన వీర తెలంగాణ సాయుధ రైతాంగ విప్లవ పోరాట చరిత్రను వక్రీకరించడం తప్ప మరొకటికాదు. ఈ పోరాటంలో ఆవగింజంత పాత్రలేని బీజేపీకి నైజాం రాజు లొంగిపోయిన రోజును విమోచన దినంగా జరపాలనడం సహేతుకం కానేకాదు. 1942-1951 వరకు ఫ్యూడల్‌ భూస్వాములు, రజాకార్లు చేసిన నిర్బంధ పన్నుల వసూళ్ల దోపిడీ, రైతులను సాగు భూముల నుండి బేదాఖల్‌ చర్యలకు, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా హైదరాబాద్‌ సంస్థానంలో ప్రజలు సాగించిన వీరోచిత పోరాటమది. ఈ పోరాటం ప్రజలకు మాట్లాడే హక్కు, సభలు నిర్వహించుకునే హక్కు, పత్రికా స్వేచ్ఛ వంటి ప్రజాతంత్ర పౌర హక్కులు కావాలనే డిమాండ్లను సమాజం ముందుకి తెచ్చింది. కౌలు రైతులకు భూమిపై హక్కులు కల్పించాలని, దున్నే వానికి భూమి కావాలని నినదించేలా చేసింది. ‘బాంఛన్‌ దొర నీ కాల్మొక్తా’ అన్న బక్కోనితో బంధూకు పట్టించింది.
పసలేని పటేల్‌ మిలిటరీ సైన్యాలతో తెలంగాణ విముక్తి ప్రచారం
ఆపరేషన్‌ పోలో పేరుతో పటేల్‌ మిలిటరీ, పోలీసు చర్య గవర్నర్‌ జనరల్‌ జే ఎన్‌ చౌదరి నాయకత్వంలో మూడు వైపుల నుంచి 24వేల మంది భారత యూనియన్‌ సైన్యం హైదరాబాద్‌ సంస్థానంలోకి ప్రవేశించింది. వీరిలో శిక్షణ పొందిన వారు కేవలం 6వేల మంది మాత్రమే. 1948 సెప్టెంబర్‌ 13న పోలీస్‌ చర్య చేపట్టింది. కేవలం ఐదు రోజులకే 1948 సెప్టెంబర్‌ 17న నైజాం నవాబు లొంగిపోతున్నట్టు ప్రకటించారు. అయినప్పటికీ సైన్యాలు వెనక్కి తిరిగిపోకుండా 1951 అక్టోబర్‌ 1 వరకు హైదరాబాద్‌ సంస్థానంలో ఉన్నాయి. ఎవరికి రక్షణ కోసం పటేల్‌ సైన్యం ఉన్నదో? లొంగిపోయిన ప్రజాకంఠకుడైన నైజాం నవాబు, రజాకార్‌ సైన్యం అధ్యక్షుడు కాసీం రజ్వీలను అరెస్టు చేసి ఎందుకు శిక్షించలేదో బీజేపీ నేతలే సమాధానం చెప్పాలి? పైగా నెహ్రూ ప్రభుత్వం నైజాం నవాబుతో లాలూచి పడింది. హైదరాబాద్‌ సంస్థానానికి రాజ్‌ప్రముఖ్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. రాచ మర్యాదలతో ప్రత్యేక విమానంలో రాజుతో పాటు కుటుంబీకులను, కాసీం రజ్వీని పాకిస్తాన్‌కు పంపింది. ప్రజల ఆగ్రహానికి బలి కావాల్సిన వీరికి పటేల్‌ సైన్యం విమోచన కలిగించింది తప్ప హైదరాబాద్‌ సంస్థానా నికి కాదు. ప్రజా పోరాటానికి భయపడి గ్రామాలొదిలి పట్టణాల్లో దాక్కున్న భూస్వాములను గ్రామాలకు తీసుకొచ్చి తిరిగి భూస్వామ్య వ్యవస్థను పునరుద్ధరణ చేయడానికి పటేల్‌ సైన్యాలు కృషి చేశాయే తప్ప ప్రజల బాధలకు కారణమైన వారిని శిక్షించలేదు.
ముస్లింలపై హిందువుల తిరుగుబాటు వాదన వాస్తవమా?
గ్రామీణ ప్రాంతాలలో విపరీతమైన భూకేంద్రీకరణ, వెట్టి చాకిరి, కౌలు దోపిడీ విధానం పెరిగింది. వ్యవసాయ భూమి మొత్తం ఐదు కోట్ల 30 లక్షల ఎకరాలు. దీనిలో మూడు కోట్లు దివాని పేరుతో ప్రభుత్వ భూమి శిస్తు కింద, కోటి 50 లక్షల ఎకరాలు భూమి జాగీర్దార్‌ విధానం కింద, పది శాతం సర్పిఖాన్‌ విధానం కింద నైజాం సొంత భూమిగా ఉండేది. పైగాలు పేరుతో ముస్లిం భూస్వాముల ఎస్టేట్స్‌ ఉండేవి. పన్నులు వసూళ్లు చేసే పటేల్‌, పట్వారి, మాలి పటేల్‌లకు వతన్లు పేరుతో 5 నుంచి 10 గ్రామాలు ఉండేవి. దేశ్‌ముఖ్‌లు వీటిపై పెత్తనం చెలాయించే వారు. వీరిలో ఎక్కువమంది హిందువులే ఉన్నారు. ఆనాటి రికార్డుల ప్రకారం హైదరాబాద్‌ సంస్థానంలో 975 మంది జాగిర్‌దార్లు ఉంటే వీరిలో 872 మంది హిందువులు, 102 మంది ముస్లింలున్నారు. వీరి చేతిలో 21 వేల గ్రామాలుండేవి. సాగులో ఉన్న అతి సారవంతమైన భూములను రకరకాల తప్పుడు పద్ధతుల్లో సామాన్య రైతాంగం నుంచి భూస్వాములు కబళించారు. సర్వే సెటిల్మెంట్‌ సందర్భంలోనే రైతులకు తెలియకుండా తమ పేర్లపై రాయించుకునేవారు.తమ వశంకాని వాటిని కరువు, కాటకాలతో పంటలు పండక, పన్నులు కట్టలేకపోయిన రైతులను బెదిరించి స్వాహా చేశారు. దీంతో తమ సొంత భూమిలోనే కౌలుదారులుగా సాగుచేసుకునే స్థితికి రైతులు నెట్టబడ్డారు. ఈ విధంగా జన్నపురెడ్డి ప్రతాపరెడ్డి సూర్యాపేట భూస్వామి1,50,000 ఎకరాల భూమి, కల్లూరు దేశముఖ్‌ లక్ష ఎకరాలు భూమి, అదిలాబాద్‌ జిల్లా లక్షెటిపేట్‌ నర్సాపూర్‌ సంస్థాన భూస్వామి 50 వేల నుంచి లక్ష ఎకరాల భూమి, విసునూరు దేశ్‌ ముఖ్‌ 40 వేల ఎకరాల భూమి, బాబా సాహెబ్‌ పేట దేశ్‌ముఖ్‌కు పదివేల ఎకరాల భూమి, పొలంపల్లికి చెందిన అల్వాల కుటుంబం సుందమేరీ మాధవరావు పదివేల ఎకరాల భూములను ఆక్రమించి పేరు మోసిన భూస్వాములయ్యారు. దీంతోపాటు వీరు అనేక గ్రామాలపై పెత్తనం కలిగి ఉండేవారు. 1950-51 పరిపాలన నివేదికల ప్రకారం 500 ఎకరాల పైబడిన భూమి పట్టా గలిగిన భూస్వాములు 550 మంది ఉండేవారు. వీరి పొలాల్లో, ఇండ్లల్లో వృత్తిదారులు, వ్యవసాయ కార్మికులు, సన్న, చిన్నకారు రైతులు ఉచితంగా నిర్బంధ వెట్టిచాకిరి చేసే స్థితికి నెట్టబడ్డారు. ఈ విధానం రద్దు కోసం ఆంధ్ర మహాసభ సంఘం ఇచ్చిన పిలుపునందుకొని వీరనారి చాకలి ఐలమ్మ పోరాటానికి నడుం బిగించింది. 1920లో విసునూరు దేశముఖ్‌ గుండాల చేతిలో షేక్‌ బందగి, జఫర్గడ్‌ జాగీర్దార్‌ ఖాదర్‌ ఆలీ, మహమ్మద్‌ ఖాసిం, దొడ్డి కొమరయ్య హత్య గావించబడ్డారు. నిజాం అరాచకాలపై కలాన్ని ఎక్కుపెట్టిన షోయబుల్లాఖాన్‌ను హైదరాబాద్‌ నడిబొడ్డున హతమార్చారు. ఇలా అనేకమంది పేద ముస్లిం రైతాంగం వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించారు.ఇలాంటి పోరాటాన్ని ముస్లింలపై హిందువులు చేసిన పోరాటంగా చిత్రించడం బీజేపీ దిగజారుడుతనానికి నిదర్శనం.
మారణహోమం సృష్టించిన పటేల్‌ సైన్యం
భూస్వాములతో పటేల్‌, రజాకార్‌ సైన్యాలు మూకుమ్మడిగా ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు కార్యకర్తల ఇండ్లపై దాడి చేసి 4వేల మందిని పొట్టన పెట్టుకున్నారు. వారికి ఆశ్రయం కల్పించి భోజనాలు పెట్టిన సానుభూతి పరులను నిర్బంధించారు. మహిళలపై సామూహిక అత్యాచారాలకు తెగబడ్డారు, హత్యలకు పాల్పడ్డారు. మిలిటరీ క్యాంపుల్లో పెట్టిన చిత్రహింసలకు 6వేల మంది పైగా మరణించారనేది అంచనా. ఒక గ్రామం తర్వాత మరొక గ్రామాన్ని తగలబెడుతూ సైన్యాలు పైశాచికానందాన్ని పొందాయి. ఇదే సమయంలో నైజాంకు వ్యతిరేకంగా పోరాడిన ముస్లింల పైన దాడులు జరిగిన అనేక గ్రామాల్లో వారిని హిందువులు కాపాడారు. వారి కుటుంబాల్లో రక్షణ కల్పించారు. హిందూ, ముస్లింల మధ్య సృష్టించిన మత ఘర్షణలను కమ్యూనిస్టు ఉద్యమం తిప్పికొట్టింది. కానీ కమ్యూనిస్టు ఉద్యమం బలహీనంగా ఉన్న ఇతర ప్రాంతాలలో ముస్లిం వ్యతిరేక విద్వేషం, వారిపై దాడులు విస్తారంగా జరిగాయి. విలీన ప్రక్రియ పేరుతో పటేల్‌ మిలటరీ పోలీసు, ప్రయివేట్‌ రజాకారు సైన్యం కలిసి జరిపిన మారణ హోమంపై నెహ్రూ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా విమర్శలనెదుర్కొంది. దిక్కుతోచనిస్థితిలో సుందర్‌లాల్‌ నేతృత్వంలో విచారణ కమిషన్‌ వేసింది.1948 నవంబర్‌ నుండి డిసెంబర్‌ వరకు హింసాత్మక ఘటనలు జరిగిన తొమ్మిది జిల్లాల్లో పర్యటించి నివేదిక అందించింది. ఈ రిపోర్టు ప్రకారం ఉస్మానాబాద్‌, గుల్బర్గా, బీదర్‌, నాందేడ్‌ ఈ నాలుగు జిల్లాల్లో సుమారుగా 18వేల మంది ముస్లింలను ఊచకోత కోశారు. ఔరంగాబాద్‌, నల్లగొండ, మెదక్‌ జిల్లాల్లో 3,500 నుండి 4వేల మందిని హతమార్చారు. హైదరాబాద్‌ సంస్థానంలో 30 వేల మంది ముస్లింలు చంపబడ్డారు. అనేక మసీదులు కూల్చి వేయబడ్డాయి. బలవంతపు మతమార్పిడులు జరిగాయి. దీనికి ప్రధాన కారణం హైదరాబాద్‌ సంస్థానం బయట నుండి సాయుధ శిక్షణ పొందిన హిందూ మతోన్మాద సంస్థకు చెందిన వారేనని నివేదికలో పేర్కొన్నారు. యూనియన్‌ సైన్యం, స్థానిక పోలీస్‌ యంత్రాంగంలో ఉన్న మతమౌడ్యుల సహకారంతో ఈ దుర్మార్గాలు జరగడానికి మరొక కారణంగా తెలిపింది.
కమ్యూనిస్టులను ఆణిచేసే కుట్ర
పటేల్‌ సైన్యం రెండు వ్యూహాలతో హైదరాబాద్‌లోకి ప్రవేశించింది. ఒకటి నైజాం నవాబును విలీనం కోసం ఒప్పించడం, రెండు కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మూలించడం. ఇది స్వయంగా ఆనాటి గవర్నర్‌ జనరల్‌ రాజాజీ చేసిన ప్రకటన. అప్పటికే రెండు జిల్లాలకు పైగా కమ్యూనిస్టుల ఆదీనంలోకి వెళ్లాయి. వారి పట్టు సంస్థానం మొత్తం వ్యాపించే ప్రమాదముందని కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న సర్దార్‌ వల్లభారు పటేల్‌ పదేపదే చేసిన ప్రకటనలు చూస్తే పాలకవర్గాలకు కమ్యూనిస్టు ఉద్యమంపై పెరిగిన విద్వేషానికి నిదర్శనంగా చెప్పొచ్చు. ఆ పోరాటాన్ని అణచడం కోసం 50 వేల మంది సాయుధ బలగాలను రంగంలోకి దింపినా ప్రజలు కమ్యూనిస్టుల నాయకత్వంలో ముందుకు సాగారే తప్ప వెనక్కి తగ్గలేదు. ఆ పోరాట సంకల్ప ఫలితంగానే మూడు వేల గ్రామాల్లో గ్రామ రాజ్యాలను నెలకొల్పారు. భూస్వాములు, దొరలను వారి కోటలైన గడీల నుంచి తరిమికొట్టారు. పది లక్షల ఎకరాల భూమిని భూమిలేని పేదలకు పంచారు. రైతులను భూముల నుండి బేదాఖల్‌ చేయడం, వెట్టిచాకిరీ, అధిక వడ్డీల వ్యాపారం వంటి చర్యలు రద్దు చేయించారు. వ్యవసాయ కార్మికులకు కూలి రేట్లు పెంచి కనీస వేతనాలు అమలు పరిచారు. ఆటవిక తెగల ప్రజలను పీడించే ఫారెస్ట్‌ అధికారుల బృందాలను అడవుల నుంచి తరిమారు. రెండు వేల మంది గెరిల్లా సాయుధ దళ సభ్యుల అండతో లక్షలాదిమంది ప్రజలు మొదటిసారి రెండు పూటలా భోజనం చేయగలిగారు. ఇదీ వీర తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర. దీన్ని బీజేపీ-ఆరెస్సెస్‌ పరివారం వక్రీకరించేందుకు చేస్తున్న ప్రయత్నం దుర్మార్గం. దీన్ని తెలంగాణ సమాజం ఈసడించుకుంటోంది.
బి. ప్రసాద్‌
9490098901

Spread the love