– స్వపరిపాలన ఒక వరం..! : మంత్రి నిరంజన్‌రెడ్డి ట్వీట్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రారంభంతో పాలమూరు జిల్లా ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతున్నదని, ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం కాబోతున్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. పరాయి పాలన పాలమూరు ప్రజలకు ఒక శాపంగా మారితే.. స్వపరిపాలన ఇక్కడి ప్రజలకు ఒక వరంగా మారిందని ఆయన గురువారం ట్వీట్ చేశారు. ఈ ప్రాంత నేతల బానిస మనస్తత్వం, వెన్నెముక లేని తనం పాలమూరు ప్రజలకు శాపంగా నిలిచిందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం పాలమూరు – రంగారెడ్డి అని మంత్రి పేర్కొన్నారు. పాలమూరు ప్రాజెక్టు ముందుకు సాగకుండా ప్రతిపక్షాలు అనేక అవరోధాలు కల్పించాయన్నారు. అయినా ముఖ్యమంత్రి కేసీఆర్ సరైన వ్యూహంతో రాజ్యాంగబద్ధంగా అనుమతులు సాధించారని గుర్తు చేశారు. రూ. 25 వేల కోట్లతో ప్రాజెక్టు పూర్తి చేసుకుంటున్నామని చెప్పారు. ‘ ఉమ్మడి పాలమూరు-రంగారెడ్డి జిల్లాల్లో 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు వెట్‌రన్ ఈ నెల 16న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. 70 ఏండ్ల గోసకు 10 ఏండ్ల పాలనతో పరిష్కారం లభించిందని నిరంజన్ రెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు.