పరికరాల పనితీరు తనిఖీకి విదేశీ బృందం

పరికరాల పనితీరు తనిఖీకి విదేశీ బృందం– జర్మనీకి సాగునీటి శాఖ అధికారులు
సీమెన్స్‌ కంపెనీ సందర్శన : రజత్‌కుమార్‌ ఆధ్వర్యంలో పర్యటన
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
సాగునీటి ప్రాజెక్టుల అవసరార్థం ఆ శాఖ ఉన్నతాధికారులు జర్మనీ దేశం న్యూరెంబర్గ్‌కు వెళ్లారు. వెలిజాల పంపుహౌజ్‌లోని ఫ్యాకేజీ నెంబరు ఒకటి, తుక్కాపూర్‌ పంపుహౌజ్‌లోని ఫ్యాకేజీ నెంబరు నాలుగుకు అవసరమైన ఆయా పరికరాల తయారీ. వాటి పనితీరును తనిఖీ చేశారు. వీటి కోసం సాగునీటి శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ ఆధ్వర్యంలో పలువురు అధికారులు సీమెన్‌ ఫ్యాక్టరీలో తయారుచేసే ఎస్‌ఎఫ్‌సీ యంత్రాల పనితీరును శుక్రవారం పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎస్‌ఎఫ్‌సీ యంత్రాలనే ఎక్కువగా వాడినట్టు ఆ శాఖ ఇంజినీర్లు చెబుతున్నారు. సీమన్స్‌ కంపెనీ ప్రతిష్టాత్మకమైనదనీ, ఆ యంత్రాలు నాణ్యంగా ఉంటాయని సమాచారం. రజత్‌కుమార్‌ వెంట గజ్వేల్‌ ఈఎన్‌షీ బి.హరిరామ్‌, సలహాదారు కె.పెంటారెడ్డి, ప్రతిమ కంపెనీ ప్రతినిధి కెవి రమణ, నవయుగ కంపెనీ ప్రతినిధి బి.రమేశ్‌ తదితరులు ఉన్నారు. వీరికి సీమన్స్‌ కంపెనీ ప్రతినిధి ఎస్‌ఎఫ్‌సీ యంత్రాల పనితీరును వివరించారు. కాగా రజత్‌కుమార్‌ తన కుటుంబంతో వెళ్లారు. ఈనెలాఖరున ఉద్యోగవిరమణ చేస్తున్న నేపథ్యంలో జర్మనీ వెళ్లడం విమర్శలకు దారితీసిన విషయం విదితమే.

Spread the love