– పాంతాల్లో అభివృద్ధిపై వర్క్‌షాపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అటవీ సంరక్షణ, తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాల మధ్య సమతుల్యత అనే అంశంపై అటవీ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో ఒక్కరోజు వర్క్‌షాపును నిర్వహించారు. తెలంగాణ అటవీ దళాల అధిపతి ఆర్.ఎం. డోబ్రియల్ దీన్ని ప్రారంభించారు. జీవవైవిధ్య సంస్థ సంచాలకులు ఈ.వెంకట్‌రెడ్డి ఇతర రాష్ట్రాల అధికారులకు స్వాగతం పలికారు. ముఖ్య అతిథి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ రమేశ్ పాండే మాట్లాడుతూ..అటవీ సంరక్షణ చట్టానికి నియమ నిబంధనలు రూపొందించేందుకు ఈ వర్క్‌షాపు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పీసీసీఎఫ్ డోబ్రియల్ మాట్లాడుతూ.. అటవీ సంరక్షణ చట్టం-1980ని ఇటీవల సవరించిన నేపథ్యంలో కొత్తగా చట్టం అమలులో ఈ వర్క్‌షాపు దోహపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అటవీ శాఖ ప్రాంతీయ కార్యాలయం(బెంగుళూరు) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ పి.సుబ్రమణ్యం మాట్లాడుతూ.. సవరించిన అటవీ సంరక్షణ చట్టం పట్ల ఉన్న అపోహలను తొలగించడానికి ఈ కార్యశాల ఉపయోగపడుతుందని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల అధికారులు ఆన్‌లైన్‌లో పాల్గొన్నారు. ఈ వర్క్‌షాపులో న్యాయ నిపుణులు డీవీఎన్ మూర్తి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్ జి.వినీత్, కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ప్రాంతీయ కార్యాలయం(బెంగుళూరు) డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఎంకే శంభు సాంకేతిక అంశాలపై ప్రసంగించారు. అటవీ జీవ వైవిధ్య సంస్థ అధికారి సందీప్ ప్రాటీ వందన సమర్పణ చేశారు. ఈ వర్క్‌షాపులో అన్ని జిల్లాల అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.