మతిమరుపు నాన్న

మతిమరుపు నాన్నగ్రహీత్‌ చలాకీ పిల్లవాడు. బాగా చదివి ఏడో తరగతిలో మంచి మార్కులు తెచ్చుకున్నాడు. పట్టణంలోని రెసిడెన్షియల్‌ స్కూల్‌లో చదివిస్తే మరింత ఎదుగుతాడని గ్రహీత్‌ నాన్న భావించాడు. పల్లెకు పాతిక మైళ్ళ దూరంలో పెద్ద పేరున్న స్కూల్‌ లో చేర్పించాడు.
మూడు నెలల పరీక్షల తర్వాత శెలవులు వచ్చాయి. ఇంటికి వచ్చిన గ్రహీత్‌ తన మిత్రులతో కలిసి ఆటలు ఆడాడు, పాటలు పాడాడు. శెలవులు సర్రున అయిపోయాయి.
గ్రహీత్‌ని హాస్టల్‌కి పంపుదామని నాన్న లగేజి తీసుకుని బస్సులు ఆగే చోటికి బయలుదేరాడు. నాన్న వెనుకే గ్రహీత్‌ నడుస్తున్నాడు. దారిలో ఈశ్వరుని గుడి ఉంది. ఆ చుట్టుపక్కల ఊళ్లలోకి అదే పెద్ద గుడి కావడంతో జనం దండిగా వచ్చి ఉన్నారు. హాస్టల్‌ కి వెళ్లేముందు దేవుడి దర్శనం చేద్దామని తండ్రీ కొడుకు గుడికి వెళ్ళారు.
ఇద్దరూ దర్శనం చేసుకుని బస్సు నిలిచే చోటికి చేరుకున్నారు. ఇంతలో బస్సు రురు మని వచ్చి ఆగింది. గబగబా బస్సు ఎక్కిన గ్రహీత్‌ సీటులో కూర్చుంటూ నాన్నకు ‘టాటా’ చెప్పాడు.
బస్సు చిన్నగా బయలు దేరుతుంటే, నాన్న వైపే అభిమానంగా చూశాడు. బస్సు వేగం పుంజుకుంది. అప్పుడు చూశాడు… నాన్న కాళ్ళకి చెప్పులు లేకపోవడం.
‘ఇంటినుంచి బయలుదేరేటప్పుడు వేసుకువచ్చాడు, గుడి వద్ద వదిలి, మరిచిపోయినట్లు ఉన్నాడు’ అని తట్టింది. వెంటనే నాన్నకు గట్టిగా అరిచి చెబుదామనుకున్నాడు. కానీ బస్సు అప్పటికే చాలా దూరం వెళ్ళిపోయింది.
‘వయసు పెరిగాక పెద్దలకి మతిమరుపు వస్తుంది’ అని టీచర్‌ చెప్పింది గుర్తుకొచ్చింది. ‘అయ్యో… చెప్పులంటే ఫర్లేదు. విలువైన వస్తువులను నాన్న మరిచిపోతే ఎలాగబ్బా’ అని ప్రయాణం చేస్తున్నంతసేపూ బాధపడ్డాడు.
బడికి వెళ్ళాక, చదువులో పడి ఆ విషయమే మరిచిపోయాడు. గిర్రున రోజులు గడిచిపోయాయి. అర్ధ సంవత్సర శెలవులు వచ్చాయి. ఎగురుకుంటూ ఇంటికి చేరాడు. అందరి బంధువుల ఇండ్లకూ వెళ్ళాడు. కబుర్లాడాడు, తీపి మిటాయిలు తిన్నాడు.
బడికి వెళ్ళే రోజు రానే వచ్చింది. ఇంటినుంచి నాన్నతో బయలుదేరి గుడికెళ్ళి దండం పెట్టుకుని బస్సునిలిచే చోటుకి చేరారు. ఇంతలో దూరంగా బస్సు రావడం కనిపించింది. చేయి అడ్డం పెడుతూ, నాన్న కాళ్ళకేసి చూశాడు. చెప్పులు లేవు. ‘ఈసారి కూడా నాన్న గుడికాడ చెప్పులు మరిచిపోయాడు…’ అనుకుంటూ అదే విషయం నాన్నకి చెప్పాడు.
నాన్న చిరునవ్వు నవ్వుతూ ”నేను నా చెప్పుల్ని మరవలేదు. కావాలనే విడిచిపెట్టాను” అని బదులిచ్చాడు. ఆశ్చర్యంగా నాన్న వైపు చూశాడు గ్రహీత్‌.
”ప్రతి మూడు నెలలకొకసారి నేను చెప్పులు కొంటాను. వాడిన తరువాత గుడివద్ద విడిచి పెట్టేస్తాను, అవసరమైన వారు ఎవరైనా వేసుకు వెళ్తారని. ఎంతోమంది పేదలు డబ్బులిచ్చి చెప్పులు కొనుక్కునే స్థితిలో ఉండరు కదా, వారికి సహాయం చేసినట్లవుతుంది” అని చెప్పాడు. ‘ఆ…’ అని నోరు తెరిచాడు గ్రహీత్‌.
క్షణాల్లోనే బస్సు వచ్చి రోడ్డు మీద వాలింది. బస్సు ఎక్కి కూర్చున్న గ్రహీత్‌ కి నాన్న పట్ల గౌరవం ఎంతగానో పెరిగింది. నాన్న కళ్ళలోకి చూస్తూ ‘టాటా…’ చెప్పాడు.
వారం రోజులు గడిచాయి. పర్యవేక్షణ నిమిత్తం వారి బడికి విద్యాశాఖాధికారి వచ్చాడు. గ్రహీత్‌ క్లాసుకి కూడా వెళ్ళాడు.
అందరినీ అడిగినట్లే గ్రహీత్‌ని కూడా ఓ ప్రశ్న వేశాడు అధికారి. ”నీవు బాగా చదివి ఉద్యోగం తెచ్చుకున్నాక వచ్చే మొదటి నెల జీతంతో ఏమి చేస్తావు?” అని.
వెంటనే గ్రహీత్‌ ”చెప్పులు కొనుక్కోలేని పేద పిల్లలకి చెప్పులు కొనిస్తాను సార్‌!” అని బదులిచ్చాడు.
గ్రహీత్‌ సమాధానానికి ఎంతో సంతోషించిన అధికారి మంచి పేన్‌ ఒకటి బహూకరించాడు. పిల్లలందరూ చప్పట్లు చరిచారు.
– ఆర్‌.సి.కష్ణస్వామి రాజు, 9393662821

Spread the love