చంద్రయాన్‌-3 సక్సెస్‌పై పాక్‌ మాజీ మంత్రి ప్రశంసలు

నవతెలంగాణ – హైదరాబాద్: చంద్రుడి ఉపరితలంపై దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. భారతదేశం చేసిన అద్భుతమైన ఫీట్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు అభినందించారు. భారతీయులే కాకుండా విదేశాల్లోని ప్రముఖులు కూడా భారత్‌ సాధించిన ఈ విజయాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో సమాచార, ప్రసార శాఖ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి కూడా చంద్రుని ల్యాండింగ్‌ను ప్రశంసించారు. ట్విటర్‌ వేదికగా ఆయన చంద్రయాన్‌-3 సాఫ్ట్‌ ల్యాండింగ్‌పై ప్రశంసలు కురిపించారు. చంద్రయాన్-3 స్పేస్ క్రాఫ్ట్ సక్సెస్.. శాస్త్రవేత్తలకు అభినందనల వెల్లువ ట్విటర్‌లో ఆయన ఇలా రాసుకొచ్చాడు. “చంద్రయాన్ 3 చంద్రునిపైకి అడుగుపెట్టినప్పుడు ఇస్రోకు ఇది ఎంతో గొప్ప క్షణం. ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్ ఛైర్మన్‌తో యువశాస్త్రవేత్తలు ఈ క్షణాన్ని ఆస్వాదించడం చూడగలిగాను. కలలు ఉన్న యువతరం మాత్రమే ప్రపంచాన్ని మార్చగలదు.” అని పాక్‌ మాజీ మంత్రి పేర్కొన్నారు. అంతకుముందు చంద్రయాన్-3 ల్యాండింగ్ కార్యక్రమాన్ని పాకిస్తాన్ మీడియా ప్రసారం చేయాలని కూడా ఆయన సూచించారు. ఈ మిషన్‌ను “మానవజాతికి చారిత్రాత్మక ఘట్టం” అని అభివర్ణిస్తూ భారత శాస్త్రవేత్తలు, అంతరిక్ష సంఘాన్ని కూడా ఆయన అభినందించారు.

Spread the love