హస్తం గూటికి మాజీలు

Formers of Hastam Guti– మల్లికార్జున ఖర్గే సమక్షంలో చేరికలు
– బీఆర్‌ఎస్‌ను ఓడించే సత్తా కాంగ్రెస్‌కే ఉంది : కపిలవాయి దిలీప్‌ కుమార్‌
– కాంగ్రెస్‌ 70 నుంచి 80 స్థానాల్లో గెలుస్తుంది : కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ మాజీ నేతలు సొంత గూటికి చేరుకుంటున్నారు. రాష్ట్రంలో హస్తం హవా కన్పిస్తుండటంతో తరుణంలో… అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ నుంచి కూడా పలువురు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోగా, ఇతర పార్టీల్లో చేరిన కాంగ్రెస్‌ నేతలు తిరిగి ‘ఘర్‌ వాపసీ’ బాట పట్టారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, మాజీ ఎమ్మెల్యేలు రాజగోపాల్‌ రెడ్డి, ఏనుగు రవీందర్‌ రెడ్డి, శాసన మండలి మాజీ ఉపాధ్యక్షులు నేతి విద్యాసాగర్‌, మాజీ ఎమ్మెల్సీలకు కపిలవాయి దిలీప్‌ కుమార్‌, ఆకుల లలిత, బీఆర్‌ఎస్‌ నేతలు సంతోష్‌ కుమార్‌, నీలం మధు ముదిరాజ్‌లు కాంగ్రెస్‌లో చేరగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వారికి కండువా కప్పి ఆహ్వానించారు. శుక్రవారం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, రాష్ట్ర ఇంచార్జ్‌ మాణిక్‌ రావ్‌ ఠాక్రే, సీఎల్పీ నేత భట్టి, ఎంపి కోమటి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాజగోపాల్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను తప్పు చేశానని, సరిదిద్దుకునేందుకే తిరిగి కాంగ్రెస్‌లో చేరానని అన్నారు. బీజేపిలోకి వెళ్లినా, తిరిగి కాంగ్రెస్‌లో చేరినా… కేసీఆర్‌ను గద్దె దించేందుకే అని తెలిపారు. కేసీఆర్‌ అవినీతిపై బీజేపీ చర్యలు తీసుకుంటుందనే ఆ పార్టీలో చేరినట్లు చెప్పారు.కానీ ఆ దిశలో చర్యలు లేనందునే ఆ పార్టీని వీడినట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో హంగ్‌ వస్తే బీజేపీ, ఎంఐఎం ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తారని అన్నారు. తనకు పదవులు ముఖ్యం కాదని, ప్రజల కోసం వంద అడుగులైనా వెనక్కి వేస్తానని చెప్పారు. కాంగ్రెస్‌ వల్లనే తెలంగాణ ఆకాంక్షలు నెరవేరతాయని, 70 నుంచి 80 స్థానాల్లో పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్‌ఎస్‌ను ఓడించే సత్తా కాంగ్రెస్‌కే ఉంది ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ని ఓడించే పరిస్థితిలో బీజేపీ లేదని, ఆ సత్తా కేవలం కాంగ్రెస్‌ పార్టీకి మాత్రమే ఉందని మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌ కుమార్‌ అన్నారు. కేసీఆర్‌ను ఓడించేందుకే కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్లు చెప్పారు.
బండి సంజయ్ తొలగింపు తరువాత బీజేపి బలహీన పడిందన్నారు. 2009లో కేసీఆర్‌ను మొట్ట మొదట విభేదించి బీఆర్‌ఎస్‌ నుంచి తాను బయటకి వచ్చానన్నారు. ఆనాడే కేసీఆర్‌ ఎలాంటి వాడో ప్రజలకు చెప్పానని గుర్తు చేశారు. ఏదీ ఆశించి పార్టీలో చేరలేదని, కాంగ్రెస్‌ గెలుపు కోసం కృషి చేస్తానన్నారు. తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరడం సంతోషంగా ఉందని ఆకుల లలిత అన్నారు. బీసీ మహిళగా నిజామాబాద్‌ అర్బన్‌లో పోటీకి తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. నిజామాబాద్‌ లో గట్టి అభ్యర్థి ఉంటే కాంగ్రెస్‌ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Spread the love