స్వేచ్ఛ, సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యం

Freedom and social justice is possible only with Congress–  క్రైస్తవ సమావేశంలో రేవంత్‌ రెడ్డి
–  మణిపూర్‌ను చూసి నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
స్వేచ్ఛ, సామాజిక న్యాయం, రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణ కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే దక్కుతాయని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్టియన్‌ డిక్లరేషన్‌ ఫర్‌ పొలిటికల్‌ పార్టీస్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికలు కేవలం రాష్ట్రంలో ప్రభుత్వ మార్పుకే పరిమితమైనవి కావనీ, కేంద్రంలో బీజేపీ మతోన్మాద ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు పునాది అని చెప్పారు. బీజేపీ పాలనలో మణిపూర్‌ దయనీయమైన పరిస్థితిని చూసి ఎన్నికల్లో ఒక నిర్ణయానికి రావాలని ఆయన సూచించారు. తెలంగాణలోనూ క్రైస్తవులకు మతస్వేచ్ఛను పూర్తిగా అనుభ వించలేని పరిస్థితులున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ చరిత్రను క్రీస్తు పూర్వం, క్రీస్తు శకంగా విభజించినట్టుగానే తెలంగాణ సమస్యలను తెలంగాణ రాష్ట్రం ఏర్పడక మునుపు, ఏర్పడిన తర్వాత బేరీజు వేసుకోవాలని సూచించారు. మానవాళి కోసం క్రీస్తు త్యాగం చేసినట్టుగానే తెలంగాణ ప్రజల కష్టాలను తీర్చేందుకు సోనియాగాంధీ త్యాగం చేశారన్నారు. ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చూసి భయపడే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయనీ, అలాంటి పరిస్థితుల నుంచి స్వేచ్ఛ కోసం కాంగ్రెస్‌ కు మద్ధతుగా నిలవాలని కోరారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీయే తిరిగి ప్రజలకు స్వేచ్ఛనిస్తూ, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తుందని తెలిపా రు. డిసెంబర్‌ మాసమంటే అద్భుతాల నెల అంటరానీ, 2009 డిసెంబర్‌ 9న తెలంగాణ ప్రకటన వచ్చిందనీ, 2023 డిసెంబర్‌ 9న కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువు దీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. క్రైస్తవ నాయకులు ఇచ్చిన డిక్లరేషన్‌ ప్రజలకు ఉపయోగపడుతుందనీ, దాన్ని ఆమోదించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.

Spread the love