జొన్నలగడ్డ హీరోగా నటించిన ‘డీజే టిల్లు’ ఎంతటి విజయాన్ని సాధిం చిందో తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ‘టిల్లు స్క్వేర్’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పాటలు, ప్రచార చిత్రాలు ఆ అంచనాలను రెట్టింపు చేశాయి. ఈ చిత్రానికి సిద్ధు జొన్నలగడ్డ కథనం, సంభాషణలు అందించగా, మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా నేడు (శుక్రవారం) ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో గురువారం మీడియాతో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ, ‘డీజే టిల్లు సమయంలో ప్రేక్షకుల్లో అంచనాల్లేవు. హీరో పాత్ర ఎలా ఉంటుంది అనేది ముందు తెలీదు. అందుకే ఆ పాత్రను చూసి ప్రేక్షకులు సర్‌ప్రైజ్ అయ్యారు. ఇప్పుడు అదే పాత్రతో మరోసారి మ్యాజిక్ చేయాల్సి రావడంతో కాస్త ఒత్తిడి ఉండటం సహజం. అయితే ఒత్తిడిని జయించి మెరుగైన అవుట్ పుట్‌ని అందించడానికి కషి చేశాం.ఈ సీక్వెల్ పాత్రకి అలాగే కథకి కూడా కొనసాగింపుగా ఉంటుంది. పాత్ర కొనసాగింపు పూర్తి స్థాయిలో ఉంటుంది. కథ కొనసాగింపు కూడా కొంత ఉంటుంది కానీ.. అది పాత కథను గుర్తుచేస్తూ కొత్త అనుభూతిని ఇస్తుంది. టిల్లు పాత్ర కూడా సీక్వెల్‌లో ఇంకా ఎక్కువ ఎనర్జిటిక్‌గా ఉంటుంది. ఎందుకంటే ఈసారి ఇంకా పెద్ద సమస్యలో ఇరుక్కుంటాడు. ఆ సమస్య ఏంటి అనేది ఇప్పుడే చెప్పను. థియేటర్‌లో చూసి ఎంజారు చేస్తారు. చాలా సర్‌ప్రైజ్‌లు, షాక్‌లు ఉంటాయి. సినిమా అంతా నవ్వుకుంటూనే ఉంటారు. టిల్లు ఎక్కడా నవ్వడు.. కానీ అందరినీ ఫుల్‌గా నవ్విస్తాడు’ అని అన్నారు.