మా పాలన చూసి ఓటేయండి…

– అదే అసలైన గీటురాయి…
– రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్‌ పిలుపు
– లోక్‌సభ ఎన్నికల్లో 14 సీట్లు గెలుస్తామని ధీమా
– రేపు లేదా ఎల్లుండి అభ్యర్థులను ప్రకటిస్తాం
– బీఆర్‌ఎస్‌, బీజేపీలది చీకటి ఒప్పందం
– అందుకే ‘కాళేశ్వరం’పై కేంద్రం సాగదీస్తోంది: పాత్రికేయుల ఇష్టాగోష్టిలో ముఖ్యమంత్రి
– అసలైన సాగుదార్లకే రైతు భరోసా ఇస్తామంటూ స్పష్టీకరణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
డిసెంబరు తొమ్మిదిన మొదలైన తమ పరిపాలనను, అప్పటి నుంచి ఇప్పటి వరకూ తీసుకున్న నిర్ణయాలను చూసి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఓటేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజల పట్ల తమ చిత్తశుద్ధికి అదే అసలైన గీటురాయని ఆయన వ్యాఖ్యానించారు. ఒకరకంగా ఎంపీ ఎన్నికలు తమ పాలనకు రిఫరెండమని తెలిపారు. రాష్ట్రంలో కచ్చితంగా 14 లోక్‌సభ స్థానాలను తమ పార్టీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. గురు లేదా శుక్రవారం అభ్యర్థులను ప్రకటించే అవకాశముందని చెప్పారు.
మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో సీఎం రేవంత్‌… పాత్రికేయులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. రానున్న లోక్‌సభ ఎన్నికలు, సాగునీటి పారుదల శాఖతోపాటు వివిధ శాఖల్లో గతంలో జరిగిన అవినీతి, అవకతవకలు, వాటిపై విచారణలు, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ తీరు, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ వ్యవహారశైలి, ఎల్‌ఆర్‌ఎస్‌ తదితరాంశాలపై ఆయన తన అభిప్రాయాలను ఈ సందర్భంగా వెలిబుచ్చారు. కేసీఆర్‌తోపాటు బీఆర్‌ఎస్‌ నేతలు కేటీఆర్‌, హరీశ్‌రావుపై ఆయన సెటైర్లు వేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటన సందర్భంగా ఆయన్ను తాను ‘పెద్దన్న’ అని సంబోధించటంపై వస్తున్న విమర్శలను సీఎం ఈ సందర్భంగా తిప్పికొట్టారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన్ను అధికారికంగానే కలిశాను తప్పితే అందులో రాజకీయ కోణమేమీ లేదని స్పష్టం చేశారు. కేసీఆర్‌ లాగా తాను ప్రధాని చెవిలో గుసగుసలు పెట్టలేదన్నారు. రాష్ట్రానికి అన్ని రకాలుగా సాయం చేయాలంటూ బహిరంగంగానే ప్రధానికి విజ్ఞప్తి చేశానని గుర్తు చేశారు.
గత బీఆర్‌ఎస్‌ సర్కారు… తన పదేండ్ల హయాంలో రాష్ట్రంలో వందేండ్ల విధ్వంసాన్ని సృష్టించిందని రేవంత్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఆ పార్టీని ప్రజలు తిరస్కరించారని ఎద్దేవా చేశారు. ఆ విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని బాగు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. పాలనను గాడిలో పెట్టేందుకు ధృడ సంకల్పంతో పని చేస్తున్నామని వివరించారు. అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొడుతున్న ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్‌ తీరును సీఎం తప్పుబట్టారు. ‘ప్రధాన ప్రతిపక్ష నేత
కేసీఆర్‌ అంటూ మా చేతికి కాగితమైతే అందింది, కానీ మనిషే కనబడటం లేదు…’ అంటూ ఎద్దేవా చేశారు. శాసనసభకు రాని వ్యక్తి ప్రధాన ప్రతిపక్ష నేత ఎలా అవుతారంటూ ప్రశ్నించారు. తాను సీఎం హోదాలో ప్రధాని మోడీని కలిసిన మాదిరిగానే… బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లోని సమస్యలపై తనను కలుస్తున్నారని చెప్పారు. దీనిపై రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదన్నారు. తమ ప్రభుత్వం కొద్ది రోజుల్లోనే పడిపోతుదంటూ కామెంట్‌ చేస్తున్న వారు, అది ఎందుకు పడిపోతుందో చెప్పాలంటూ ఎదురు ప్రశ్నించారు. ఎల్‌ఆర్‌ఎస్‌పై ఇష్టానుసారంగా మాట్లాడుతున్న బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు నిజంగా ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే సిరిసిల్లలోని అంబేద్కర్‌ విగ్రహం ముందు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా నిరాహారదీక్ష చేయాలంటూ సూచించారు. తానో పెద్ద ఇంజినీర్‌నంటూ ఫోజు కొడుతూ కేసీఆర్‌ కట్టిన కాళేశ్వరం పరిధిలోని మేడిగడ్డ… ఇప్పుడు మేడిపండైదంటూ సీఎం విమర్శించారు. 80 వేల పుస్తకాలు చదివిన మేధావి కుండిపోయిన మేడిగడ్డను ఇప్పటి వరకూ ఎందుకు సందర్శించలేదని ప్రశ్నించారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు బీఆర్‌ఎస్‌ నేతలు అక్కడికి చీకట్లో వెళ్లొచ్చారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్‌డీఎస్‌ఏ ఇచ్చిన రిపోర్టు ప్రకారమే తాము ముందుకెళ్తామని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే పలువురిపై చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌పైనా చర్యలుంటాయని హెచ్చరించారు. తన చదువుతోపాటు అనేక విషయాల్లో కేసీఆర్‌ నిత్యం అబద్ధాలను వల్లె వేస్తారంటూ విమర్శించారు. జలీల్‌ఖాన్‌ తరహాలో తాను ‘ఎమ్మెస్సీలో పొలిటికల్‌ సైన్స్‌’ చదివానంటూ కేసీఆర్‌ చెప్పుకున్నారని గుర్తు చేశారు. అసలు ఎమ్మెస్సీలో పొలిటికల్‌ సైన్స్‌ ఉంటుందా..? అని ఎద్దేవా చేశారు. కాళేశ్వరానికి సంబంధించి లోక్‌సభ ఎన్నికల్లోపు ఎన్‌డీఎస్‌ఏ రిపోర్టు ఇస్తే… ఆ వెంటనే చర్యలు తీసుకునేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రేవంత్‌ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌)కి సంబంధించి గతంలో జరిగిన అవినీతిపై ఆడిట్‌ ప్రస్తుతం కొనసాగుతోందని సీఎం ఈ సందర్భంగా వెల్లడించారు.రి
గత బీఆర్‌ఎస్‌ హయాంలో ఇసుక ద్వారా రోజుకు కోటి వరకూ ఆదాయం వచ్చేదన్నారు. ఇప్పుడది రెండున్నర కోట్లకు చేరిందని చెప్పారు. జీఎస్టీ రూపంలో వచ్చే ఆదాయం రూ.500 కోట్లకు పెరిగిందని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో కూడా ఇదే రకమైన ఆదాయం వచ్చినా…దాన్ని మొత్తం బొక్కి, రాబడిని తక్కువ చేసి చూపించారని ఆరోపించారు. వివిధ శాఖల్లో గతంలో జరిగిన అవినీతిపై విచారణ చేయించేందుకు తమ వద్ద సరైన అధికారులు లేరని చెప్పారు. ఉన్న వారు కూడా విచారణ సరిగా చేయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.కేవలం పోలీసులతోనే విచారణ చేయించలేమని ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య చీకటి ఒప్పందాలున్నాయంటూ రేవంత్‌
ఈ సందర్భంగా విమర్శించారు. అందుకే కాళేశ్వరంపై కేంద్రం సాగదీస్తోందని అన్నారు. అందులో భాగంగానే మోడీ సర్కార్‌ వేసిన నిపుణుల కమిటీ విచారణకు నాలుగు నెలల సమయం కావాలంటూ కోరుతోందని అన్నారు. అప్పటి వరకూ ఆ రెండు పార్టీల మధ్య సర్దుబాటు జరుగుతుందేమోననే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఎంపీ అభ్యర్థుల విషయంలో బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక స్పష్టమైన అవగాహనతోనే ఉన్నాయని అన్నారు. అందుకే మెదక్‌, చేవెళ్ల అభ్యర్థులను ఇప్పటి వరకూ ప్రకటించలేదని విమర్శించారు. తమ పార్టీకి సంబంధించి ఎంపీ అభ్యర్థుల కసరత్తు ఒక కొలిక్కి వచ్చిందని సీఎం తెలిపారు. సోనియా, రాహుల్‌…ఇద్దరిలో ఎవరో ఒకరు తెలంగాణ నుంచి పోటీ చేస్తే రాష్ట్ర గౌరవం పెరుగుతందని ఆయన వ్యాఖ్యానించారు.
పీసీసీ, పీఈసీలో ఈ మేరకు తీర్మానించామన్నారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత ప్రచారాన్ని హోరెత్తిస్తామని చెప్పారు. బీఆర్‌ఎస్‌, బీఎస్పీ పొత్తు వల్ల ఏం జరుగుతుందో చూద్దామంటూ ఎద్దేవా చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో తమ కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయబోరని రేవంత్‌ స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్‌ నుంచి తన తమ్ముడు కొండల్‌రెడ్డి పోటీ చేస్తారనే వార్తల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు. ట్యాక్స్‌ పేయర్స్‌కు రైతు భరోసా (రైతు బంధు) ఎందుకివ్వాలంటూ సీఎం ఈ సందర్భంగా ప్రశ్నించారు. అసలైన సాగుదార్లకే పెట్టుబడి సాయం ఇస్తామని వెల్లడించారు. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చించి, ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని వివరించారు. అవసరమైతే అఖిలపక్షంతోపాటు రైతు, కూలీ సంఘాల సలహాలు, సూచనలు తీసుకుంటామని అన్నారు. అంతేతప్ప ఫాంహౌస్‌లు, రాళ్లు, రప్పలున్న భూములకు పెట్టుబడి సాయం అందించేది లేదని స్పష్టం చేశారు. ప్రయివేటు యూనివర్సిటీలపై విచారణ నిర్వహిస్తామని తెలిపారు. డీఎస్సీ -2008 అభ్యర్థుల సమస్య ఈనాటిది కాదన్నారు. అది 15 ఏండ్లుగా కొనసాగుతోందనీ, అందువల్ల 15 నిమిషాల్లో పరిష్కరించలేమని చెప్పారు. అడ్వకేట్‌ జనరల్‌ సలహా తీసుకుని, ఈ విషయంలో న్యాయపరమైన చిక్కులు రాకుండా చూసుకుంటామంటూ సీఎం ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Spread the love