ఎన్నికల బాండ్ల రద్దుకు బీజేపీ నయా నాటకం

– వివరాల వెల్లడికి ఎస్బీఐ గడువు కోరడంపై సర్వత్రా ఆందోళన
– చివరిక్షణాన గడువు కోరడం కోర్టు ధిక్కరణే : సీపీఐ(ఎం)
న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్ల రద్దు ప్రక్రియకు విఘాతం కల్గించడానికి స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) ద్వారా బీజేపీ ప్రభుత్వం కొత్త నాటకాలు ఆడుతోందని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల బాండ్లను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించిన సర్వోన్నత న్యాయస్థానం ఆ బాండ్లు ఎవరెవరు కొన్నారు..ఎవరికి ఇచ్చారు అనే అంశాలతో పూర్తి వివరాలను మార్చి 6లోగా ఎన్నికల సంఘానికి నివేదించాలని, ఎన్నికల సంఘం మార్చి 13 కల్లా వాటిని ప్రచురించాలని ఈ ఏడాది ఫిబ్రవరి 14న ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఈ గడువు బుధవారంతో ముగియనున్న నేపథ్యంలో చివరాఖరులో గత సోమవారం మరింత గడువు కావాలంటూ ఎస్‌బిఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. డేటా డీకోడింగ్‌, దాతలు, విరాళాలను సరిచూడటమనేది సంక్లిష్టమైన ప్రక్రియ అని, వచ్చే జూన్‌ 30వరకు గడువు కావాలని కోర్టును ఎస్బీఐ కోరింది. కేంద్ర ప్రభుత్వం తమ గొప్పగా చెప్పుకుంటున్న ‘డిజిటల్‌ ఇండియా’ కాలంలో అత్యాధునిక బ్యాంకింగ్‌ ఆన్‌లైన్‌ సేవలు అందుబాటుల్లో ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన గడువే చాలా ఎక్కువ అని, ఇప్పుడు అది కూడా చాలదంటూ ఎన్నికల తర్వాత చూస్తామంటూ ఎస్బీఐ కోరడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఎన్నికల బాండ్లను ‘చట్టబద్ధమైన రాజకీయ అవినీతి’గా మార్చేసుకొని బీజేపీ కోట్లకు పడగలెత్తిన నేపథ్యంలో ఆ అవినీతిని రక్షించుకునే దుర్మార్గమైన ఎత్తుగడుల్లో భాగంగానే ఎస్బీఐ ద్వారా బీజేపీ ఈ దొడ్డిదారి వ్యూహాలు పన్నుతోందని విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.
కానీ తమకు జూన్‌ 30 వరకు గడువు కావాలని ఎస్బీఐ సోమవారం సుప్రీంను కోరింది. డేటాను డీ కోడ్‌ చేసి, దాతలను, విరాళాలను మేచింగ్‌ చేయడమనేది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ అని పేర్కొంది. ఒక్క మౌస్‌ క్లిక్‌తో అన్నీ క్షణాల్లో జరిగిపోతాయంటూ ‘డిజిటల్‌ ఇండియా’ గురించి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్న సమయంలో ఎస్బీఐ ఇలా కోరడం పట్ల అందరికీ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మొత్తం ఎన్నికల బాండ్ల వ్యవహారంలో అతిపెద్ద లబ్దిదారు బీజేపీనే అన్నది కాదనలేని సత్యం. 2022-23 చివరినాటికి మొత్తంగా ఈ పథకం ద్వారా రూ.12 వేల కోట్లు రాగా అందులో 6500కోట్లు బీజేపీకి వెళ్లాయి. ఇటువంటి కీలకమైన విషయంలో వివరాల అందచేతకు నాలుగు మాసాల సమయం కావాలని ఎస్బీఐ కోరడాన్ని ప్రతిపక్ష నేతలు, ప్రముఖులు పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎస్బీఐ అడిగిన జూన్‌ 30కల్లా లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ కూడా ముగిసిపోతుంది.
దాచిపెట్టేందుకే : ఖర్గే
మోడీ ప్రభుత్వం తన అనుమానాస్పదమైన కార్యకలాపాలను దాచిపెట్టడానికే ఎస్బీఐని ఉపయోగించుకుంటోందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు. దాతలకు సంబంధించిన 44,434 ఆటోమేటెడ్‌ డేటా ఎంట్రీలను కేవలం 24 గంటల్లో వెల్లడించవచ్చని, మ్యాచ్‌ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారని తెలిపారు. అటువంటపుడు ఈ సమాచారాన్ని క్రోడీకరించేందుకు ఎస్బీఐ నాలుగు మాసాలు అదనంగా సమయం కావాలని ఎందుకు కోరుతోందని ప్రశ్నించారు.
ఆప్‌ నేత సౌరభ్‌ భరద్వాజ్‌ కూడా దీనిపై తీవ్రంగా స్పందించారు. ఈ కంప్యూటర్‌ యుగంలో కూడా కొద్దిమంది కార్పొరేట్ల వివరాలను ఇవ్వడానికి ఏకంగా నాలుగు మాసాల గడువు కావాలని ఎస్బీఐ కోరడం విచిత్రంగా వుందన్నారు. శివసేన (యూబీటీ) నేత సంజరు రౌత్‌ మాట్లాడుతూ, మోడీ డిజిటల్‌ ఇండియాను అవమానించిన ఎస్బీఐ చైర్మెన్‌, డైరెక్టర్లను శిక్షించాలన్నారు.
కోర్టు ధిక్కారం కాదా?
సుప్రీం ఇచ్చిన గడువుకు ఆఖరి రోజున ఎస్బీఐ గడువు పెంచాలని కోరడం విచిత్రంగా వుందని ప్రముఖ కాలమిస్ట్‌ సుహాస్‌ పాల్షికర్‌ అన్నారు. కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు ఎస్‌బిఐ ఉన్నతాధికారులను సుప్రీం జైలుకు పంపుతుందా? అని ఆయన ప్రశ్నించారు.
సిగ్గుచేటైన వ్యవహారం : డీఎంకే
ఎస్బీఐ చర్య ఊహించిందేనని సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ వ్యాఖ్యానించారు. ఎస్బీఐ ద్వారా మోడీ ప్రభుత్వం ఈ పిటిషన్‌ వేసిందని అన్నారు. సుప్రీం తీర్పు ఇచ్చినపుడే ఇది ఊహించానని కాంగ్రెస్‌ నేత అభిషేక్‌ మను సింఘ్వి ట్వీట్‌ చేశారు. ఎన్నికల్లోగా బిజెపి దాతల వివరాలు బహిర్గతం కాకుండా ఎస్బీఐపై ఒత్తిడి వుండి వుంటుందని తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత మహువా మొయిత్రా పేర్కొన్నారు. ఇది సిగ్గు చేటైన ప్రహసనమని డీఎంకే విమర్శించింది. ఎన్నికల బాండ్ల కోసమే కంప్యూటర్లను ఏర్పాటు చేయడానికి కోటిన్నర రూపాయిలు ఖర్చు పెట్టిన ఎస్బీఐ మూడు వారాల్లోగా దాతలు, స్వీకర్తల వివరాలను వెల్లడించలేకపోయిందా? ఇది సిగ్గుచేటైన విషయమని అన్నారు.
కోర్టు ధిక్కరణే : సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
ఎన్నికలు ముగిసిన తర్వాత ఎన్నికల బాండ్ల వివరాలను ఇవ్వగలమంటూ ఎస్బీఐ గడువు కోరడాన్ని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రశ్నించారు. చివరాఖరున గడువు పొడిగించాలని కోరడం, అది కూడా ఎన్నికల తర్వాత తేదీకి ఇవ్వగలమని చెప్పడం కచ్చితంగా కోర్టు ధిక్కరణే అవుతుందని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ‘చట్టబద్దమైన రాజకీయ అవినీతి”ని రక్షించే ఎత్తుగడగా ఎస్బీఐ చర్యను ఆయన విమర్శిచారు. ఇప్పటికే అందుబాటులో వున్న డేటాను మొత్తంగా ఒకచోట పొందుపరిచేందుకు ఎన్నికలు ముగిసే వరకు ఎస్బీఐ గడువు కోరడంలోనే ఏదో మతలబు దాగుందని, అదేంటో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల బాండ్లను చట్టబద్ధమైన అవినీతిగా మార్చేసుకున్న బీజేపీ ఎత్తుగడలకు ఎస్బీఐ చర్య తోడ్పడుతుందని ఏచూరి విమర్శించారు. ఎన్నికల బాండ్ల రద్దు ప్రక్రియకు ఇది విఘాతం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Spread the love