18 ఏండ్ల తర్వాత తెలంగాణ వాసులకు విముక్తి

నవతెలంగాణ హైదరాబాద్: 18 ఏండ్ల తర్వాత తెలంగాణ వాసులకు విముక్తి దొరికింది. దుబాయ్‌లో శిక్ష అనుభవిస్తున్న ఐదుగురు తెలంగాణ వాసులు ఎట్టకేలకు స్వదేశానికి తిరిగొచ్చారు. హత్యకేసులో దుబాయ్‌లో సిరిసిల్ల వాసులకు 18 ఏండ్లు జైలు శిక్ష పడింది. నేపాల్‌కు చెందిన వాచ్ మెన్ బహదూర్ సింగ్ హత్య కేసులో దుబాయ్ ప్రభుత్వం వీరికి శిక్ష విధించింది. తొలుత పదేండ్లు.. ఆ తర్వాత జైలు శిక్షను 25 ఏండ్లకు దుబాయ్ కోర్టు పెంచింది. నేపాల్ వెళ్లి హతుని కుటుంబసభ్యులకు రూ.15లక్షల పరిహారాన్ని మాజీ మంత్రి కేటీఆర్ ఇచ్చారు. స్వయంగా డబ్బులు చెల్లించి క్షమాభిక్ష పత్రాన్ని కేటీఆర్ రాయించారు. మారిన నిబంధనలతో ఖైదీల విడుదలకు దుబాయ్ కోర్టు అంగీకరించలేదు.


అనారోగ్య కారణాలు చూపుతూ న్యాయవాది మరో సారి విడుదలకు యత్నించారు. అనారోగ్య కారణాలు అంగీకరించి ఏడేండ్ల ముందే దుబాయ్ కోర్టు ఐదుగురుని విడుదలకు అంగీకరించింది. వారిని దుబాయ్ ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు సిరిసిల్ల, రుద్రంగి, కొనరావుపేట వాసులు చేరుకున్నారు. 18 ఏండ్ల తర్వాత కుటుంబసభ్యులను కలుసుకోవడంతో వారంతా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

Spread the love