ఘోర రోడ్డు ప్రమాదం.. 9మంది మృతి

నవతెలంగాణ ఢిల్లీ: బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఆటోరిక్షాను లారీ ఢీకొనడంతో 9మంది మృతి చెందగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. లక్ష్మిసరాయ్ జిల్లాలోని రామ్‌గఢ్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జులోనా గ్రామ సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఆటో లకిసరాయ్ నుంచి సికంద్రా వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు వెల్లడించారు. దీంతో అక్కడికక్కడే 8మంది మరణించగా..ఆస్పత్రిలో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో ఆటోలో 15 మంది ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను పాట్నా ఆస్పత్రికి తరలించారు. అందులో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ప్రమాదానికి గల స్పష్టమైన కారణాలు తెలియరాలేదు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల్లో ఒకరు ముంగేర్‌ వాసి కాగా, మరొకరు లక్షీసరాయ్‌ వాసిగా గుర్తించారు. మిగతా వారి వివరాలు తెలియరాలేదు.

Spread the love