ఫ్యూచర్‌..కన్ఫ్యూజన్‌..!

Future..Confusion..!– బీజేపీలోకి వెళ్లలేక..కాంగ్రెస్‌ రానివ్వక..
– అంతర్మథనంలో మామ, అల్లుడు
– కాంగ్రెస్‌తో రాజీకి మల్లారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి
– ఇద్దరు ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్‌ ప్రశ్నార్థకమే..!
‘పాలు అమ్మినా.. పూలు అమ్మిన.. మెడికల్‌ కాలేజీలు, ఇంజినీరింగ్‌ కాలేజీలు పెట్టిన.. ఏడాదికి వేలాది మందిని డాక్టర్లు, ఇంజినీర్లుగా తీర్చిదిద్దుతున్న.. నా కష్టమే దీనంతటికీ కారణం’.. ఈ మాటలు ఎక్కడో విన్నట్టు ఉంది కదా.. వినే ఉంటారు. సాక్ష్యాత్తు మాజీ మంత్రి, మేడ్చల్‌ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పలు సందర్భాల్లో చెప్పిన మాటలివి. దాదాపు దశాబ్దం పాటు మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాను ఏలిన మల్లారెడ్డి ఇప్పుడు దిక్కు
తోచని స్థితిలో ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష కాంగ్రెస్‌, బీజేపీలపై విరుచుకుపడ్డ ఆయన పరిస్థితి ఇప్పుడు ‘ముందు నుయ్యి.. వెనుక గొయ్యి’ అన్నట్టుగా తయారైంది. బీఆర్‌ఎస్‌లో ఉండలేక.. బీజేపీలోకి వెళ్లలేక.. కాంగ్రెస్‌ వారు రానివ్వకపోవడంతో మేడ్చల్‌, మల్కాజిగిరి నియోజకవర్గాల ఎమ్మెల్యేల ఫ్యూచర్‌ కన్ఫ్యూజన్‌లో పడింది. అక్రమ ఆస్తులు, కబ్జా భూములను ఎలా కాపాడుకోవాలో తెలియక మామ, అల్లుడు అంతర్మరథంలో పడ్డారు.
నవతెలంగాణ-సిటీబ్యూరో
అధికారంలో ఉంగా కాంగ్రెస్‌ పార్టీని, అప్పటి మల్కాజిగిరి ఎంపీ, ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో దూషణకు మల్లారెడ్డి సై అంటే సై అన్నారు. ఇప్పుడు అనుహ్యంగా కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో సీన్‌ రివర్స్‌ అయ్యింది. రేవంత్‌రెడ్డి చెప్పినట్టుగానే భూ కబ్జాలపై ఫోకస్‌ పెట్టడంతో మల్లారెడ్డి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మల్లారెడ్డితోపాటు ఆయన అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి భూ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. చివరికి లోక్‌సభ బరి నుంచి తప్పుకుని మరీ కాంగ్రెస్‌తో కాళ్ల బేరానికి వచ్చినా ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం వీరిద్దరి రాజకీయ భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారింది.
అప్పుడు తొడగొట్టి.. ఇప్పుడు కాళ్ల బేరం..
దుండిగల్‌ చిన్నదామర చెరువులోని ఆయన అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ రెడ్డికి చెందిన ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ భవనాలను రెవెన్యూ సిబ్బంది పాక్షికంగా కూల్చేశారు. మల్లారెడ్డి కుటుంబ సభ్యులు, బంధు మిత్రులకు హైదరాబాద్‌ చుట్టుపక్కల ఇంకా చాలా కాలేజీలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు కూడా ఉండటంతో రేవంత్‌ రెడ్డి ఇచ్చిన ఈ చిన్న ‘జలక్‌’తో మల్లారెడ్డి సైలెంట్‌ అయ్యారు. ఈ దెబ్బతో ఇన్ని రోజులూ ‘మల్కాజిగిరి ఎంపీ సీటు మాదే, మమ్మల్ని ఓడించే మొగాడు పుట్టలేదు’ అని పలికిన నోటితోనే, ఈసారి పోటీ చేయడం లేదని చెప్పుకోవడంతోపాటు కాంగ్రెస్‌తో కాళ్ల బేరానికి వచ్చారు.
రాజీనామా చేస్తారా..? 100 ఎకరాలు తిరిగిస్తారా..?
ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరడం ప్రస్తుతం నడుస్తున్న రాజకీయ ట్రెండ్‌. ఈ ట్రెండ్‌ను ఫాలో కావడంలో మాజీ మంత్రి మల్లారెడ్డి ముందు వరుసలో ఉంటారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆ ర్‌ఎస్‌ అధికారం కోల్పోవడంతో మల్లారెడ్డి కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్‌లో చేరాలని చూశారు. కానీ రెండు పార్టీలూ షాక్‌ ఇచ్చాయి. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీలో చేరాలని బీజేపీ సూచించగా.. కబ్జా చేసిన 100 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగిస్తేనే పార్టీలోకి ఆహ్వానిస్తామని మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్‌ నేతలు ఆఫర్‌ ఇచ్చారు. దాంతో మల్లారెడ్డి పరిస్థితి ‘రెంటికీ చెడ్డ రేవడి’లా తయారైంది. ఎమ్మెల్యే పదవికి రాజీమానా చేయలేక.. కబ్జా చేసిన భూమిని తిరిగి ఇవ్వలేక మామ, అల్లుడు అంతర్మథనంలో పడ్డారు.
రాజకీయ భవిష్యత్‌ ప్రశ్నార్థకం
మేడ్చల్‌, మల్కాజిగిరి ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి రాజకీయ భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారింది. ఇవే చివరి ఎన్నికలు అని ప్రకటించిన మల్లారెడ్డిని పక్కనబెడితే.. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన రాజశేఖర్‌రెడ్డికి ప్రస్తుత పరిస్థితులు రాజకీయంగా ఎదగలేకుండా చేసేలా ఉన్నాయి. బీజేపీ మాటలు నమ్మి రాజీనామా చేసి మళ్లీ బరిలోకి దిగితే గెలుపు అంత ఈజీ కాదు. ఇక కాంగ్రెస్‌ ఆఫర్‌కు అట్రాక్ట్‌ అయి కబ్జా భూములను తిరిగిస్తే రూ.వేల కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఈ రెండూ కాకుండా బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుదామంటే రాజకీయంగా ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయంటూ ఇద్దరు ఎమ్మెల్యేలూ పునరాలోచనలో పడ్డట్టు సమాచారం. వీరిద్దరూ ఏ పార్టీలో కొనసాగుతారు..? అసలు రాజకీయాల్లో ఉంటారా..? లేక రాజకీయాల నుంచి తప్పుకుంటారా..? తెలియాలంటే పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత వరకు ఆగాల్సిందే..!

Spread the love