గంప గుత్త బేరాలు

గంప గుత్త బేరాలు– ఊర్లకు ఊర్లే కొనుగోలు సామూహిక ప్రమాణాలు
– ట్రెండ్‌ మార్చిన నేతలు
– అంగడి సరుకుగా మారిన ఓటు
ఎన్నికల సమరం తుది అంకానికి చేరుకున్న వేళ.. అంది వచ్చిన ఏ అవకాశాన్నీ రాజకీయ పార్టీలు వదులుకోవడం లేదు. ఓటర్లను ప్ర్రలోభ పెట్టడం చాలా ఎన్నికల్లో చూసాం. కానీ ఈసారి రాజకీయ పార్టీలు కొత్త తరహా పంథాకు శ్రీకారం చుట్టాయి. విలువలకు పాతరేసి గంప గుత్త బేరాలు మొదలు పెట్టాయి.ఊళ్ళకు ఊళ్ళనే కొనుగోలు చేస్తున్నాయి. ఓటర్లను అంగట్లో సరుకుల్లా చేస్తున్నాయి. ”ఆ ఊర్లో ఇతర పార్టీల జెండాలు ఎగరకూడదు… వందకు వంద శాతం ఓట్లు మన పార్టీకే పడాలి”… ఇది ఆయా గ్రామాల ప్రజలకు సదరు పార్టీకి మధ్య ఒప్పందం. ఇందుకోసం ఆ గ్రామాల్లోని రచ్చబండల దగ్గర సామూహిక ప్రమాణాలు చేయిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో వచ్చిన ఈ కొత్త పోకడ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది.
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
”మనసా… వాచా.. కర్మణా ప్రమాణం చేస్తున్నాం. గ్రామ శ్రేయస్సు కోసం, గ్రామ అభివద్ధి కోసం ఫలానా పార్టీకి ఓటేస్తున్నాం. గ్రామంలోని ప్రజలందరూ తమ వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి సమిష్టిగా తీసుకున్న నిర్ణయం ఇది” తెలంగాణ ఎన్నికల్లో మొదలైన కొత్త పోకడ ఇది. గతంలో వ్యక్తులు, కుటుంబాలు,కుల సంఘాల ఓట్లను రాజకీయ పార్టీలు కొనుగోలు చేసేవి. అయితే ఇప్పుడు ట్రెండ్‌ మార్చిన నేతలు అవకాశం ఉన్నచోట గ్రామాలకు గ్రామాలనే కొనుగోలు చేస్తున్నారు. వందకు వందశాతం ఓట్లు తమకే పడేలా సామూహిక ప్రమాణాలు చేయిస్తున్నారు.
ప్రతి గ్రామంలో భిన్న పార్టీలు ఉంటాయి. వ్యక్తుల మధ్య, పార్టీల మధ్య, వైరుధ్యాలుంటాయి. అలాంటప్పుడు ఇదెలా సాధ్యం? అన్న ప్రశ్న సహజం. అయితే ముందుగా గ్రామాల్లోని చోటా మోటా నేతలను, పార్టీల సభ్యులు, ఇతర కీలక నేతలను మచ్చిక చేసుకుంటున్నారు. ఆ తర్వాత కుల సంఘాల నాయకులను దారికి తెచ్చుకుంటున్నారు. అన్ని సక్రమంగా జరిగితే ఆ గ్రామాన్ని కొనుగోలు చేస్తున్నా ”విడిగా ఓటుకు ఇంత అని ఇవ్వడంతో పాటు మీ గ్రామానికి ఇంత మొత్తాన్ని అందజేస్తాం. ఈ మొత్తాలు చాలా పెద్దవి. దాంతో గ్రామంలో రోడ్డు వేయించు కుంటారో, బడి కట్టించుకుంటారో, ఆస్పత్రి కట్టించుకుంటారో మీ ఇష్టం” అంటూ ఒప్పందం చేసుకుంటారు. కాని షరతు ఏమిటంటే గ్రామంలో వందకు వందశాతం ఓట్లు వారికే పడాలి. ఇందుకు కావలసిన గ్యారంటీని గ్రామంలోని ఫలానా వ్యక్తి దగ్గర ఉంచుతున్నాం. ఇది గ్రామస్తులకు రాజకీయ పార్టీలకు మధ్య జరుగుతున్న ఒప్పందం. ఈ ఎన్నికల్లో సదరు పార్టీ అభ్యర్థి ఓడిపోయినా గెలిచినా సంబంధం లేదు. అనుకున్న ప్రకారం గ్రామ నిర్ణయానికి అనుగుణంగా ఓట్లు పడితే ఒప్పందం అమలవుతుంది. అందుకు మీ గ్రామంలోని ఫలానా వ్యక్తి గ్యారెంటీ.. ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్‌, నిజామాబాద్‌ తదితర జిల్లాల్లో గత రెండు రోజుల నుంచి ఎంచుకున్న గ్రామాల్లో రాజకీయ పార్టీలు ఈ తరహా బేరాలకు పాల్పడుతు న్నాయని తెలుస్తోంది.
ఎన్నికల్లో గెలుపొందేందుకు ఓటర్లను అంగట్లో సరుకుల మాదిరిగా తయారు చేస్తున్నారు. గతంలో ఊర్లలో వేలం పాటల నిర్వహించేవారు. అక్కడక్కడ కుల సంఘాలు ఇతర సమూహాలకు ఓపెన్‌ ఆఫర్‌ ఇచ్చేవారు. అయితే ఇప్పుడు ట్రెండు మార్చి ఈ కొత్త పోకడలకు శ్రీకారం చుట్టారు. ఎన్నికల్లో డబ్బు మద్యం తో పాటు గంపగుత్తగా గ్రామాలను కొనుగోలు చేసే సంస్కతి మొదలైంది. ఇది ప్రజాస్వామ్యానికి అంత శ్రేయస్సు కాదు. ఎన్నికల కమిషన్‌ ఇలాంటి సంఘటనలపై దష్టి పెట్టి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సర్వత్రా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Spread the love