బాల్కొండ నియోజకవర్గంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రాంగి మండలం మానాల గ్రామంలో మంగళవారం ఇండియన్ గ్యాస్ డెలివరీ బాయ్ సేవలను మెచ్చి గ్రామస్తులు సత్కరించారు. కమ్మర్ పల్లి మండల కేంద్రానికి చెందిన బంగారి నర్సింలు స్థానిక ఇండియన్ గ్యాస్ కంపెనీలో గ్యాస్ డెలివరీ బాయ్ గా సేవలందిస్తున్నాడు. విధుల్లో భాగంగా తన ఆటో ద్వారా ఉమ్మడి మానాల ప్రజలకు గ్యాస్ బండాలను సరఫరా చేస్తుంటాడు. మానాల గ్రామంతో పాటు చుట్టూ ఉన్న తండా గ్రామ పంచాయతీల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో గ్యాస్ బండాను అందిస్తూ నర్సింలు ఉత్తమ సేవలందిస్తున్నాడు. మండల కేంద్రానికి సుమారు యాభై కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న మానాల దాని చుట్టుపక్కల తండా గ్రామ పంచాయతీలకు ఏ కాలమైనా ఇబ్బంది పడకుండా గ్యాస్ డెలివరీ బాయ్ గా మంచి సేవలు అందిస్తూ అందరి మన్ననలు పొందాడు. దీంతో బంగారి నర్సింలు సేవలను కొనియాడుతూ మానాల గ్రామ పెద్దలు శాలువాతో సత్కరించి, మిఠాయిలు తినిపించారు. కార్యక్రమంలో బాదనవేని రాజారాం, డేగవత్ తిరుపతి, బుర్ర శంకర్, జూల భూమన్న, సుందర్, గంగ నరసయ్య, రాజేశం, రాజారెడ్డి, రవీందర్, తదితరులు పాల్గొన్నారు.