– రికార్డు స్థాయిలో పెరిగిన క్రెడిట్‌కార్డుల వినియోగం
– ఒక్క నెలలో రూ.1.78 లక్షల కోట్ల వ్యయం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అప్పుచేసి పప్పుకూడు తినడమంటే ఇదే…ప్రధాని మోడీ హయాంలో ప్రజల ఆర్థిక స్థితి ఏ స్థాయికి దిగజారిందో అక్టోబర్ నెలలో తేలిపోయింది. వరుస పండుగలు, పెరిగిన ఖర్చులతో సతమతమైన ప్రజలు చేతిలో నగదు లేకపోవడంతో భారీగా క్రెడిట్ కార్డుల్ని వినియోగించారు. ఆ ఒక్క నెలలోనే దేశవ్యాప్తంగా రూ.1.78 లక్షల కోట్ల మేరకు క్రెడిట్ కార్డు లావాదేవీలు జరిగాయి. ఈ తరహా క్రెడిట్ కార్డుల వినియోగం గతంలో ఎన్నడూ లేదని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్లో పొదుపు లక్ష్యాలు గణనీయంగా తగ్గిపోయాయని గతంలో రిజర్వుబ్యాంకు చెప్పిన విషయం తెలిసిందే. దీనికి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలు, ద్రవ్యోల్బణం, పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలు వంటివి ప్రధాన కారణమని ఆర్థికరంగ నిపుణులు చెప్తున్నారు. తాజాగా పొదుపు సంగతి దేవుడెరుగు…ఇప్పుడు ప్రజల వ్యక్తిగత అప్పులు భారీగా పెరుగుతున్నాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను మరింత ఆందోళనకు గురిచేస్తున్నది. దేశంలో ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో రూ.1.42 లక్షల కోట్ల క్రెడిట్ కార్డు లావాదేవీలు జరగ్గా, అక్టోబర్‌లో ఈ లావాదేవీలు రికార్డు స్థాయిలో రూ.1.78 లక్షల కోట్లకు చేరాయి. సెప్టెంబర్‌తో పోలిస్తే అక్టోబర్‌లో క్రెడిట్ కార్డుల వినియోగం 25.35 శాతం పెరిగినట్టు రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా తెలిపింది. ప్రజల్ని ఆకర్షించేందుకు ఈ-కామర్స్ ప్లాట్‌ఫారాలు ‘పాయింట్ ఆఫ్ సేల్’ (పీఓఎస్) పేరుతో రకరకాల డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ప్రకటించాయి. దీనికి ఆకర్షితులైన ప్రజలు తమ చేతిలో నగదు లేకున్నా, క్రెడిట్ కార్డుల ద్వారా అప్పులు చేసి, ఆయా ఉత్పత్తులను కొనుగోలు చేసినట్టు ఈ-కామర్స్ లావాదేవీలు పరిశీలిస్తే తెలుస్తున్నది. రిజర్వుబ్యాంకు చెప్పిన లెక్కల ప్రకారం క్రెడిట్ కార్డు ద్వారా పీఓఎస్ లావాదేవీలు అక్టోబరు నెలలో రూ.57,774 కోట్లు జరగ్గా, ఈ-కామర్స్ ప్లాట్‌ఫారాల ద్వారా రూ.1,20,794 కోట్ల చెల్లింపులు జరిగాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్‌కార్డుల వినియోగదారులు ఎక్కువగా వీటిని వినియోగించారు. ఈ బ్యాంకు క్రెడిట్ కార్డుల ద్వారా రూ.45,173 కోట్లు విలువైన ఆర్థిక లావాదేవీలు జరిగాయి. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా రూ.34,158 కోట్లు, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా రూ.21,729 కోట్ల లావాదేవీలు జరిగాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) క్రెడిట్ కార్డుల ద్వారా రూ.35,406 కోట్ల రికార్డు స్థాయి లావాదేవీలు జరిగాయి. అదే సమయంలో దేశంలోని బ్యాంకులు, రుణ సంస్థలు ఈ ఏడాది అక్టోబర్ నాటికి కొత్తగా 17 లక్షల కొత్త క్రెడిట్ కార్డుల్ని జారీ చేశాయి. దీనితో దేశవ్యాప్తంగా మొత్తం క్రెడిట్ కార్డుల సంఖ్య 9.48 కోట్లకు చేరినట్టు రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. బ్యాంకుల వారీగా అక్టోబరు నాటికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులు 1.91 కోట్లకు, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులు 1.87 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులు 1.6 కోట్లు, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులు 1.3 కోట్లకు చేరాయి. అయితే ఇటీవల రిజర్వుబ్యాంకు హామీలేని రుణాల నిబంధనల్ని కఠినతరం చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రభావం క్రెడిట్ కార్డుల రుణ చెల్లింపులపై పడే అవకాశం ఉన్నదనీ, ప్రజల్లో చేసిన అప్పులు తిరిగి చెల్లించే ఆర్థిక స్థోమత నెమ్మదించే అవకాశం ఉన్నదని ఆర్థికరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.