మణిపూర్‌ ప్రజలకు న్యాయం చేయండి

– తక్షణ చర్యల అవసరాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలపండి
– రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఐద్వా వినతి
– ప్రభుత్వ నమ్మక ద్రోహం ప్రజల ఐక్యతను తీవ్రంగా దెబ్బతీసింది
– రాజకీయ పరిష్కారం అవసరం
– సీఎం బీరెన్‌ సింగ్‌ తొలగింపు మొదటి అడుగు
‘మణిపూర్‌ ప్రజలకు, ముఖ్యంగా మహిళలు, చిన్నారులకు న్యాయం కోసం తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ప్రభుత్వానికి తెలిపేందుకు మీరు అధికారాన్ని ఉపయోగించాలి’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఐద్వా అభ్యర్థించింది. శుక్రవారం నాడిక్కడ రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఐద్వా పాట్రన్‌ బృందాకరత్‌ కలిశారు. మణిపూర్‌లో తమ పర్యటన అంశాలను వివరిస్తూ, తనతో పాటు ఐద్వా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పికె. శ్రీమతి టీచర్‌, మరియం ధావలే రాసిన వినతి పత్రాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బృందాకరత్‌ అందజేశారు.
న్యూఢిల్లీ : లైంగిక వేధింపులు, ఇతర హింస బాధితులపై జరిగిన క్రూరత్వాల వివరాలను రాష్ట్రపతి విన్నారనీ, ఈ ఘటనలపై ఆమె విచారం వ్యక్తం చేశారని బృందాకరత్‌ తెలిపారు. తాను గవర్నర్‌తో పలుమార్లు మాట్లాడినట్లు రాష్ట్రపతి చెప్పారని, సహాయక శిబిరాల్లో నెలకొన్న దుస్థితిపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారని బృందాకరత్‌ తెలిపారు.
మణిపూర్‌ స్వరాలను మీకు అందిస్తున్నాం
‘ఆగస్ట్‌ 9-11 వరకు అఖిల భారత ప్రజాస్వామ్య మహిళా సంఘం (ఐద్వా) తరపున మా మూడు రోజుల పర్యటనలో మేము విన్న మణిపూర్‌ స్వరాలను మీకు అందిస్తున్నాం. లైంగికదాడి, లైంగిక వేధింపులకు గురైన మహిళలతో పాటు హింసను ఎదుర్కొంటున్న మహిళలను కలుసుకున్నాం. వారు తమ అభద్రతా భావాన్ని, నిరాశను మీకు తెలియజేయాలని మమ్మల్ని అభ్యర్థించారు. మేం కలిసిన గవర్నర్‌ అనుసుయ ఉయికే చాలా మంది బాధితులతో నేరుగా మాట్లాడారనీ, సంబంధిత అధికారులకు ఆమె సిఫార్సులను అందించారని తెలిపారు. అయితే, మేము చూసిన విషయాలు మాత్రం క్షేత్రస్థాయిలో ప్రజల హృదయాల్లో ఎలాంటి మార్పు లేదని తెలియజేస్తున్నాయి. రాష్ట్రాన్ని సందర్శించి అక్కడి ప్రజలతో ముఖ్యంగా మహిళలతో మమేకమైన తరువాత మాత్రమే మణిపూర్‌లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు’ అని తెలిపారు.
నొప్పి, బాధలో రాష్ట్రం
‘మణిపూర్‌ రాష్ట్రం బాధలో ఉంది. ఒకరికొకరు శాంతియుతంగా జీవించిన వర్గాల మధ్య విభేదాలు ఇప్పుడు తీవ్రస్థాయిలో ఉన్నాయి. రెండు వైపులా భయం, అపనమ్మకం, అనుమానాలు ఉన్నాయి. భౌగోళికంగా ఇది ఆయా వర్గాలు నివసించే రెండు ప్రాంతాల మధ్య జాతీయ సరిహద్దు వలె ప్రతిబిం బిస్తుంది. ఎవరూ ఈ సరిహద్దును దాటడానికి అను మతించబడరు. దాదాపు ఐదు వేల కాలనీలు, అనేక గ్రామాలు కాలి బూడిదయ్యాయి. ఇరు వర్గాలకు చెందిన వేలాది మంది ప్రజలు తమ ఇండ్లను విడిచి పెట్టి సహాయక శిబిరాల్లో ఉన్నారు. ఆదివాసీలు హింసాకాండను ఎదుర్కొన్నారు’ అని పేర్కొన్నారు.
ఎలాంటి న్యాయం జరగక నిరాశ
‘మణిపూర్‌లో అనాగరికమైన పరిస్థితి నెలకొంది. మేం కలుసుకున్న లైంగిక హింస బాధితులు గిరిజన యువతులు. వారి కుటుంబాలు వారిపై జరిగిన చెప్పలేని అకృత్యాలను వివరిం చాయి. ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం జరగక పోవడంతో వారు నిరాశ చెందుతున్నారు. సుప్రీం కోర్టు జోక్యం దోహదపడుతుందని కొందరు అభిప్రా యపడ్డారు. అయితే, తక్షణ పరిష్కారం అవసరమైన కొన్ని సమస్యలు ఉన్నాయి.
ఉదాహరణకు, సామూహిక అత్యాచారానికి గురైన యువతి, ఆమె తల్లి, ఆమెను రక్షించే ప్రయత్నంలో కొడుకు, భర్త దారుణంగా చంపబడ్డారు. వారు కనీసం మార్చురీ లో ఉన్న తమ వారి మృతదేహాలను చూడాలనుకుం టున్నారని మాకు చెప్పారు. వారిని గౌరవప్రదమైన ఖననం చేయండి. మేము కలిసిన దాదాపు అన్ని గిరిజన కుటుంబాలు వారి కుటుంబ సభ్యులు హత్య కు గురయ్యారు. మృతదేహాలను చూడడానికి తహ తహలాడుతున్నాయి. దయచేసి దీని ఆవశ్యకత ను ప్రభుత్వానికి తెలియజేయవలసిందిగా మేము మిమ్మ ల్ని మనస్ఫూర్తిగా కోరుతున్నాం’ అని విజ్ఞప్తి చేశారు.
ప్రజలను రక్షించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం
‘ప్రజలను రక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలుసుకున్నాం. బీరెన్‌ సింగ్‌ ప్రభుత్వం నిష్క్రియాత్మకంగా వ్యవహరించడం, రాజ్యాంగ బాధ్యతల నుంచి తప్పుకోవడం మణిపూర్‌ ప్రజలకు ఆగ్రహం తెప్పించింది. ప్రభుత్వం, పరిపాలన వ్యవస్థ, పోలీసులు చేసిన నమ్మక ద్రోహం ప్రజల సామరస్యాన్ని, ఐక్యతను తీవ్రంగా దెబ్బతీసింది. రాజకీయ పరిష్కారం అత్యంత ముఖ్యమైన అవసరం. ముఖ్యమంత్రిని తొలగించడమే దీనికి మొదటి అడుగు అని ప్రజలు భావిస్తున్నారు’ అని వివరించారు.
సహాయక శిబిరాల భయంకరమైన స్థితి
‘మణిపూర్‌లోని 350 సహాయ శిబిరాల్లో 55 వేల మందికి పైగా బాధితులు ఉన్నారు. మూడు నెలల నుంచి ఎలాంటి పరిష్కారం కనిపించకపోవడంతో వారు ఈ సహాయక శిబిరాల్లోనే మకాం వేశారు. ఈ శిబిరాల్లో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వర్షాల వల్ల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. వారు తమ ఇళ్లకు తిరిగి వెళ్లగలరో లేదో వారికి తెలియదు. వృద్ధులు, చిన్నారులు, బాలింతలు, గర్భిణులు ఉన్నారు. ఈ శిబిరాల్లో సరైన సౌకర్యాలు లేవు. మరుగుదొడ్లలో తయారు అవుతున్నాయి. పురుషులు సహా సహాయక శిబిరాల్లో ఉన్న అందరితో తమ స్థలాన్ని పంచుకోవడానికి మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. స్నానం చేయడం, బట్టలు మార్చుకోవడం, విశ్రాంతి కోసం పడుకోవడం మొదలైన సాధారణ రోజువారీ కార్యకలాపాలు పెద్దలతో సహా అందరి ముందు చేయాలి. వారి ఆత్మగౌరవాన్ని, గౌరవాన్ని దోపిడికి గురవుతున్నారు. కొండ ప్రాంతాల్లో ఇప్పటికీ పిల్లలు బడి బయటే ఉన్నారు. ఆహారం, పోషకాహారం అందటం లేదు. ప్రజలు మూడు నెలలుగా పప్పు, అన్నం మాత్రమే తింటున్నారు’ అని వివరించారు.
వందల కుటుంబాలు రోజుకు ఒక్కపూటే భోజనం
‘ఈ సహాయక శిబిరాల్లో కాకుండా సొంత ఇండ్లలోనే ఉన్న సామాన్యులు కూడా ఈ ప్రతికూల పరిస్థితుల్లో తమ జీవితాలను ఎలా కొనసాగించాలో పూర్తిగా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వారికి ఉద్యోగాలు లేవు. ఇతర జీవనోపాధి లేదు. డబ్బు లేదు. వందల కుటుంబాలు రోజుకు ఒక్కసారే భోజనం చేస్తున్నాయి. రేషన్‌ ధాన్యాలు నిలిచిపోయాయి. కోవిడ్‌ కాలంలో ప్రారంభించిన ఐదు కిలోల బియ్యం మాత్రమే ఇస్తున్నారు’ అని తెలిపారు.
తక్షణమే పరిష్కరించాల్సిన కొన్ని సమస్యలు
‘తక్షణమే పరిష్కరించాల్సిన కొన్ని సమస్యలు ఉన్నాయి. బాధితులకు న్యాయం చేయాలని, దోషులందరినీ తక్షణమే అరెస్టు చేయాలని కోరారు. వీడియోలలో ఇప్పటికే గుర్తించబడిన వారిని కూడా అరెస్టు చేయలేదు. ఆస్తి దగ్ధం, దోపిడి విషయంలో ఇరువైపులా జరిగిన నష్టాలను సరైన అంచనా వేసి తగిన పరిహారం ఇవ్వాలి.
ఇళ్లు కాలిపోయిన వారందరికీ పునరావాస ప్రక్రియ చేపట్టాలి. ప్రజా పంపిణీ వ్యవస్థను విస్తరింప చేయాలి. రేషన్‌ కోటాలను ఒక్కొక్కరికి పది కిలోలకు పెంచాలి. భారీ నిరుద్యోగం, తీవ్రమైన ఆదాయ నష్టం ఉన్నందున నగదు బదిలీలు తక్షణం చేయాలి. విద్యార్థులందరి విద్యను పున్ణప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి. వైద్య సదుపాయాలు క్షీణించిన గిరిజన ప్రాంతాలకు అత్యవసరంగా వైద్యులను పంపించాలి’ అని కోరారు
భయం…కన్నీళ్లు
ఎటుచూసినా అంతులేని ఆవేదనలు.. ఆక్రందనలే సహాయక శిబిరాల నిండా విషాదాశ్రువులే..
మణిపూర్‌ పర్యటనలో సీపీఐ(ఎం) బృందానికి కనిపించిన దృశ్యాలు
న్యూఢిల్లీ : మణిపూర్‌లో ప్రజలు భయం, కన్నీళ్లతో కొట్టుమిట్టాడుతున్నారు. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి నేతృత్వంలో ప్రతినిధి బృందం శుక్రవారం మణిపూర్‌ లోని చురచంద్‌పూర్‌లో పర్యటించింది. వివిధ సహాయక శిబిరాలను సందర్శించిన బృందానికి బాధితులు తమ సమస్యలను వివరించారు. బాధితులకు బృందం సంఘీభావాన్ని తెలిపింది. అండగా ఉంటామని హామీ ఇచ్చింది. చురచంద్‌పూర్‌లోని సెడాన్‌, చంపై క్యాంపుల్లోనే ఈ మూడున్నర నెలల్లో 12 మంది శిశువులు జన్మించారు. ‘సహాయ శిబిరాల్లో’ ప్రజలు భద్రత, తగిన ఆహారం, పారిశుధ్య సౌకర్యాలు లేకుండా నివసిస్తున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్న వారిని రక్షించడానికి పురుషులు గ్రామాల్లో కాపలాగా ఉంటున్నారు. అల్లర్లు చెలరేగిన రాత్రి మే 3న జైదాన్‌ హమర్‌ యూత్‌ అసోసియేషన్‌ హాల్‌లో శిబిరం ప్రారంభమైంది. స్థానిక ఆరోగ్య కార్యకర్తల సంరక్షణలో ఇక్కడ తొమ్మిది మంది శిశువులు జన్మించారు. శిబిరాన్ని సందర్శించిన సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి నేతృత్వంలోని బృందంతో సహాయక సిబ్బంది మాట్లాడుతూ.. ‘తల్లులు, శిశువులకు ఇంకా ఆస్పత్రి సాయం కూడా అందలేదన్నారు.
ఏ క్షణంలోనైనా దాడి జరుగుతుందన్న భయంతో ప్రాణాలను అరచేతలో పెట్టుకొని జీవిస్తున్నాం. శుక్రవారం మరో ముగ్గురు కుకీలు హత్యకు గురికావడంతో భయం మరింత పెరిగింది’ అని తెలిపారు.
సీపీఐ(ఎం) త్రిపుర రాష్ట్ర కార్యదర్శి జితేంద్ర చౌదరి, అస్సాం రాష్ట్ర కార్యదర్శి సుప్రకాష్‌ తాలుక్దార్‌, కేంద్ర కమిటీ సభ్యురాలు డెబ్లినా హెంబ్రామ్‌ కూడా సీతారాం ఏచూరితో పాటు శిబిరాలను సందర్శించారు. ఈ బందం రాత్రి గవర్నర్‌ అనసూయ ఉయికేతో సమావేశమైంది.
మణిపూర్‌ లో పరిస్థితి ప్రమాదకరంగా ఉంది: సీతారాం ఏచూరి
మణిపూర్‌లో పరిస్థితి ప్రమాదకరంగా ఉందని, దేశ ఐక్యత కోసం దీనిని నియంత్రించాల్సిన అవసరం ఉందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ”తమ సంఘీభావం తెలిపేందుకు, మద్దతు ఇచ్చేందుకు వచ్చామన్నారు. మణిపూర్‌ సోదరి, సోదరులంతా ఇండియా కుటుంబంలో భాగమైన వారేనని, వారిని కలిసి ఓదార్చుతామన్నారు. భారతదేశం మీ వెంటే ఉందని వారికి చెబుతున్నాం. మణిపూర్‌ లో శాంతి, సాధారణ పరిస్థితి పునరుద్ధరించాలి’ అన్నారు. మణిపూర్‌లో హింస చాలా కాలంగా కొనసాగుతోందని, దానిని కొనసాగనివ్వకూడదని అన్నారు. ముఖ్యమంత్రి ఎన్‌. బీరెన్‌ సింగ్‌ను బర్తరఫ్‌ చేయాలనే ప్రతిపక్షాల డిమాండ్‌ను ఆయన పునరుద్ఘాటించారు. ‘రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ బీజేపీతో డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇక్కడి పరిస్థితులకు వారే పూర్తి బాధ్యత వహించాలి. సాధారణ స్థితిని పునరుద్ధరించడంలో సహాయం కోసం మా వంతుగా అవసరమైనది చేయడానికి మేము సిద్ధం. హింస చాలా కాలంగా కొనసాగుతోంది. ఇలాగే కొనసాగడానికి అనుమతించకూడదు” అని ఏచూరి అన్నారు. మణిపూర్‌లో పరిస్థితులకు ప్రభుత్వం, పరిపాలన వ్యవస్థ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రధానమంత్రి, ప్రభుత్వం ఎటువంటి నిర్మాణాత్మక చర్యలు చేపట్టలేదని, ఇది దురదష్టకరమని విమర్శించారు.

Spread the love