ఆళ్ళపల్లి, గుండాల ఆధార్ సెంటర్లకు అనుమతులు ఇవ్వండి

– ఆధార్ సర్వీస్ లేక ప్రజలు నానా అగచాట్లు
– అవసరాన్ని ఆసరా చేసుకుని కొన్ని సెంటర్లలో అధిక వసూళ్లు
– జిల్లా కలెక్టర్ పరిష్కారం చూపాలి 
నవతెలంగాణ – ఆళ్ళపల్లి/గుండాల 
గతంలో ఆళ్లపల్లి మండలంలోని పాతూరు గ్రామంలో సుమారు ఏడాది క్రితం వరకు,గుండాల మండల కేంద్రంలో సుమారు 4 సంవత్సరాల క్రితం వరకు మీ సేవ కేంద్రాల్లో ఆధార్ సర్విస్ సౌకర్యం ఉండేది. ప్రస్తుతం రెండు మండలాల్లో ఎక్కడా ఆధార్ సర్వీస్ సెంటర్ లేక పోవడంతో ఉమ్మడి మండలాల్లోని ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. ఆధార్ కార్డు అప్డేట్ చేసేందుకు, కార్డులో తప్పుగా నమోదైన పేర్లలో మార్పులు, ఫోన్ నంబర్ జతచేయడం, చిరునామా మార్పులు, ఉమ్మడి జిల్లా, మండలాల పేర్లను తొలగించి నూతన జిల్లా, మండలాల పేర్లు నమోదు చేసుకునేందుకు, నూతన వధువులు ఇంటి పేరులో మార్పులు, పాఠశాలలు ప్రారంభం కావడంతో విద్యార్థులను పాఠశాలలో చేర్పించేందుకు ఆధార్ కార్డు అవసరం కావడం, బ్యాంక్ లావాదేవీలు, ఇలా ఆధార్ కార్డుకు సంబంధించి అనేక విషయాల్లో ఆళ్లపల్లి, గుండాల మండలాల్లో ఆధార్ సౌకర్యం లేకపోవడంతో ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు.
ఇక వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, తదితర బాధితుల అవస్థలు రెండు మండలాల్లో వర్ణనాతీతం. మండలాల్లో మీసేవా సెంటర్లో ఆధార్ సంబంధించి సర్వీస్ పునఃప్రారంభం కాకపోవడంతో వృద్ధులు, వికలాంగులు, తదితరులు అనేక మంది సుమారు 50 నుండి 60 కిలో మీటర్ల దూరంలోని కొత్తగూడెం, ఇల్లందు పట్టణాల్లోని ఆధార్ సర్వీస్ సెంటర్ ల దగ్గరకు నానా ఇబ్బందులు పడుతూ వెళ్తున్నారు. అక్కడ కూడా వందల సంఖ్యలో జనాలు వరుస కట్టి ఉండటంతో తిండి, నిద్రాహారాలు మాని నిల్చోవాల్సిన దుస్థితి. అక్కడ కూడా సాంకేతిక సమస్యలు ఎదురైతే   రోజంతా పడిగాపులు కాస్తున్నామని, ఆ రోజు కూడా పనికాకపోవడంతో మరో రోజు వెళ్లాల్సి వస్తోందని బాధితులు తమ గోడును వెలిబుచ్చుకున్నారు.  కొన్ని ఆధార్ సెంటర్లు, మీ సేవ కేంద్రాలు ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకుని 150 నుంచి 200 రూపాయల వరకు  అక్రమ వసూళ్లు చేస్తున్నారని పని చేయించుకున్న బాధితులు ఆరోపిస్తున్నారు.
అసలే దూరాభారం అవుతోందని, అందులో అక్కడ అధిక వసూళ్లు పోగా ఆ రోజు కూలీ సైతం పోతుందని సామాన్య కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెట్టిన, పెట్టనున్న సంక్షేమ పథకాలు, ప్రజలు రేషన్ కార్డులు, పింఛన్లు, తదితర వాటి దృష్ట్యా ఇకనైనా జిల్లా కలెక్టర్ ఆళ్లపల్లి, గుండాల మండలాల్లో ఆధార్ సర్వీస్ లేక సంవత్సరాల తరబడి సామాన్య ప్రజానీకం, వృద్ధులు, వికలాంగులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఆధార్ సర్వీస్ పునఃప్రారంభించాలని ఉమ్మడి మండల వాసులు, ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు. దీనికి ముందు అధిక వసూళ్లకు పాల్పడిన, పాల్పడుతున్న సెంటర్లపై చర్యలు చేపట్టాలని ముక్త కంఠంతో కోరుతున్నారు. ఇదే విషయంపై జిల్లా కలెక్టరేట్ ఆధార్ సర్వీస్ సెంటర్ డీఎంకు చరవాణిలో వివరణ కోరగా.. మా పై అధికారుల ఆదేశాలు ఇంకా రాలేదని తెలిపారు.
Spread the love