‘మా ఉద్యోగాలు.. మాకు ఇప్పించండి’

'మా ఉద్యోగాలు.. మాకు ఇప్పించండి'– డిసెండింగ్‌ ఆర్డర్‌లో ఉద్యోగాల భర్తీ చేపట్టాలి
– మోకాళ్లపై కూర్చుని గురుకుల ఉపాధ్యాయుల నిరసన
– సీఎం రేవంత్‌రెడ్డి నివాసం, గాంధీభవన్‌ వద్ద ఆందోళన
– పెద్దమ్మ గుడి వద్ద భిక్షాటన
నవతెలంగాణ-బంజారాహిల్స్‌
”మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి.. ఎన్నికల వేళ జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించిన కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నింటినీ పక్కనపెట్టింటి.. ఉన్న ఉద్యోగాలను సైతం ఇవ్వకుండా మనోవేదనకు గురి చేస్తోంది” అని గురుకుల అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం గురుకుల అభ్యర్థులు హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నివాసం వద్ద మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. అయితే, ఇక్కడ నిరసనలకు ఎటువంటి అనుమతులూ లేవని.. సెక్యూరిటీరీత్యా ఈ ప్రాంతం నుంచి వెళ్లాలని పోలీసులు ఆదేశించడంతో వారు పెద్దమ్మ గుడి ముందు భిక్షాటన చేసి నిరసన తెలిపారు. పలువురు మహిళా అభ్యర్థులు కొంగు పట్టి చాచి భిక్షాటన చేస్తూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. అయినా, ఇక్కడి నుంచి కూడా వెళ్లిపోవాలని జూబ్లీహిల్స్‌ పోలీసులు ఒత్తిడి చేయడంతో వారు నాంపల్లిలోని గాంధీభవన్‌ గేటు వద్దకు చేరుకుని నిరసన తెలియజేశారు. డిసెండింగ్‌ ఆర్డర్‌లో ఉద్యోగాల భర్తీ చేపట్టి తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. వి వాంట్‌ జస్టిస్‌ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. దాంతో నిరసన వ్యక్తం చేస్తున్న గురుకుల అభ్యర్థులను పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు.

Spread the love