తక్కువ ధరకు బంగారమంటూ గాలం

తక్కువ ధరకు బంగారమంటూ గాలం– నకిలీ బంగారం బిస్కెట్లను అంటగడుతున్న ముఠా
– నలుగురి అరెస్ట్‌
– నకిలీ నోట్లతోపాటు ఐదు కిలోల నకిలీ బంగారం స్వాధీనం
నవతెలంగాణ-సిటీబ్యూరో
మార్కెట్‌ ధరకంటే తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామని నమ్మించి మోసాలకు పాల్పడుతున్న ముఠాను మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 6.86 లక్షల నకిలీ నోట్లు, 5 కిలోల నకిలీ బంగారం బిస్కెట్లతోపాటు రూ.51లక్షలు, మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు. నేరేడ్‌మెట్‌లోని రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ తరుణ్‌జోషీ వివరాలు వెల్లడించారు.
ఏపీ నెల్లూరుకు చెందిన కె.విజరుకుమార్‌ అలియాస్‌ కృష్ణ మోహన్‌ చౌదరి, గుంటూరుకు చెందిన ఎన్‌.డేవిడ్‌ లివింగ్‌ స్టోన్‌, కావలికి చెందిన బి.సునీల్‌ గవాస్కర్‌ అలియాస్‌ హరీష్‌, బోడుప్పల్‌కు చెందిన ఆదిగోపుల ఓంసాయి కిరీటీ ముఠాగా ఏర్పడ్డారు. సులువుగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. చెన్నరు, బెంగళూర్‌లో కస్టమ్స్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి పెద్దఎత్తున బంగారం బిస్కెట్లను కొనుగోలు చేశామని బంగారం వ్యాపారులను, స్నేహితులతోపాటు అమాయకులను నమ్మించారు. మార్కెట్‌ ధర కంటే తక్కువకు బంగారం బిస్కెట్లు విక్రయిస్తామంటూ నమ్మబలికారు. ముందుగా డబ్బులు తీసుకుని కొంత బంగారాన్ని అందించేవారు. ఆ తర్వాత లక్షల్లో డబ్బులు తీసుకుని నకిలీ బంగారం బిస్కెట్లను అంటగట్టేవారు. ఇదే తరహాలో బోడుప్పల్‌కు చెందిన దిలీప్‌ బర్పాను మోసం చేశారు. తక్కువ ధరకు బంగారం బిస్కెట్లు ఇస్తున్నారని బోడుప్పల్‌లో నివాసముంటున్న స్నేహితుడు సింగిరెడ్డి సురేష్‌ ద్వారా తెలుసుకున్న దిలీప్‌.. అతనితో కలిసి గత నెల 19న బెంగళూర్‌కు వెళ్లాడు. విజరుకుమార్‌, హరీష్‌ను కలిశాడు. రూ.6 లక్షలు చెల్లించిన 81గ్రాముల బంగారాన్ని తీసుకుని దిలీప్‌ హైదరాబాద్‌కు వచ్చాడు. నాలుగు రోజుల తర్వాత బోడుప్పల్‌కు వచ్చిన హరీష్‌ వారితో వ్యాపారం కోసం మాట్లాడాడు. కమీషన్లపై బంగారాన్ని విక్రయించాలని ఒప్పందం చేసుకుని 20 గ్రాముల బంగారాన్ని వారికి అప్పగించాడు. ఒర్జినల్‌ బంగారం కావడంతో పూర్తిగా నమ్మిన దిలీప్‌ మరో 2 కిలోల బంగారం కావాలని రూ.కోటికి ఒప్పందం చేసుకుని అడ్వాన్స్‌గా రూ.20లక్షలు హరీష్‌కు చెల్లించాడు. అయితే, బంగారాన్ని పంపకపోవడంతో తన స్నేహితుడు సింగిరెడ్డిని తీసుకుని దిలీప్‌ తిరిగి బెంగళూర్‌కు వెళ్లి విజరుకుమార్‌ను కలిశాడు. స్టాక్‌ అయిపోయిందని, మిగిలిన డబ్బులు చెల్లించి బంగారాన్ని చెన్నరులోని తన మేనేజర్‌ లివింగ్‌ స్టన్‌ వద్ద తీసుకోవాలని చెప్పడంతో దిలీప్‌ మరో రూ.90 లక్షలు ఇచ్చాడు. గత నెల 30న చెన్నరుకి వెళ్లిన స్నేహితులిద్దరూ రాయల్‌ మెరీడియన్‌ హోటల్‌లో లివింగ్‌ స్టన్‌ను కలిశారు. తానే హైదరాబాద్‌కు వచ్చి బంజారాహిల్స్‌లో బంగారాన్ని అందిస్తానని చెప్పడంతో వారు తిరిగి వచ్చారు. కానీ బంగారాన్ని పంపించకపోవడంతో బాధితులు పలుమార్లు విజరు కుమార్‌కు ఫోన్లు చేసినా స్పందించలేదు. దాంతో అనుమానం వచ్చిన దిలీప్‌ రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న మేడిపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నలుగురి ముఠా సభ్యులను అరెస్టు చేశారు. వారిపై పలు కేసులు నమోదైనట్టు సీపీ తెలిపారు. ఎవరైనా తక్కువ ధరకు బంగారం ఇస్తామని చెప్తే నమ్మి మోసపోవద్దని సూచించారు. ఈ సమావేశంలో డీసీపీ పద్మజా, ఏసీపీ చక్రపాణి, మేడిపల్లి ఎస్‌హెచ్‌వో గోవర్ధన్‌ రెడ్డి, ఐఓ ఏ.నర్సింగరావు తదితరులు ఉన్నారు.

Spread the love