బంగారు పతకాలు సాధించిన హెడ్‌ కానిస్టేబుల్‌

బంగారు పతకాలు సాధించిన హెడ్‌ కానిస్టేబుల్‌– ‘పాన్‌ ఇండియా నేషనల్‌ మాస్టర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌’ పోటీల్లో..
– ప్రత్యేకంగా అభినందించిన రాచకొండ సీపీ
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు బంగారు పతకాలను సాధించిన హెడ్‌కానిస్టేబుల్‌ తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ గౌరవాన్ని మరింత పెంచారు. రాచకొండ పరిధిలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో విధులు నిర్వహిస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌ అంబోజు అనిల్‌ కుమార్‌ ‘పాన్‌ ఇండియా నేషనల్‌ మాస్టర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌’ పోటీల్లో మూడు బంగారు పతకాలు సాధించారు. వీటితో పాటు ఈ ఏడాది ఫిబ్రవరి 22 నుంచి 25వరకు థారులాండ్‌లో జరిగిన 28వ ఏషియన్‌ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ -2024 (ఏఏంఏ)లో 45 సంవత్సరాల విభాగంలో నాలుగు పతకాలు (1 బంగారు పతకం, 3 కాంస్య పతకాలు) అనిల్‌ కుమార్‌ సాధించారు. అందులో 4×400 మీటర్ల రిలేలో బంగారు పతకం, 800 మీటర్లు, 1500 మీటర్లు, 5000 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకాలు వరించాయి. త్వరలో సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాలో జరుగనున్న అంతర్జాతీయ పోటీల్లో పాల్గొననున్న సందర్భంగా గురువారం నేరెడ్‌మెట్‌లోని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో సీపీ తరుణ్‌ జోషి హెడ్‌ కానిస్టేబుల్‌ అంబోజు అనిల్‌ కుమార్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడారు. రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో అథ్లెటిక్స్‌ క్రీడలను ప్రోత్సహిస్తామని తెలిపారు. అనిల్‌ కుమార్‌కు పోలీసు శాఖ తరపున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని, భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించాలని కమిషనర్‌ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

Spread the love