GOLD : భారీగా పెరిగిన బంగారం ధర

నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయంగా బంగారం ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పెరగడం, పశ్చిమాసియాలో ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య నెలకొన్ని యుద్ధం, అమెరికన్‌ డాలర్‌తో పోల్చితే రూపాయ మారకం విలువ మరింత పతనం కావడం లాంటి కారణాలు దేశీయంగా బంగారం బంగారం ధరలు పెరగడానికి కారణమయ్యాయని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం 10 గ్రాముల మేలిమి (24 క్యారట్స్‌) బంగారం ధర రూ.750 పెరిగి రూ.61,650 కి చేరింది. గత ట్రేడింగ్‌ సెషన్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.60,900 వద్ద ముగిసింది. వెండి సైతం శుక్రవారం కిలో రూ.500 పెరిగి రూ.74,700కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరగడంతో దేశీయంగానూ వీటి ధరలు పెరిగాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ కమొడిటీస్‌ సీనియర్‌ అనలిస్ట్‌ సౌమిల్‌ గాంధీ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర ప్రస్తుతం 1980 డాలర్లు ఉండగా, ఔన్సు వెండి 23.80 డాలర్లుగా ఉంది. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్‌- హమాస్‌ మధ్య నెలకొన్న యుద్ధం వల్ల మదుపర్లు సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించి బంగారం వైపు మొగ్గు చూపుతుండటం కూడా బంగారం ధరలు పెరగడానికి కారణంగా చెప్పవచ్చు. భిన్న కారణాలతో బంగారం ధర ఇవాల నాలుగు నెలల గరిష్ఠానికి చేరిందని నిపుణులు చెబుతున్నారు.

Spread the love