ఖేలో ఇండియా సైక్లింగ్ ఎంపికలకు మంచి స్పందన

– జిల్లా యువజన సంక్షేమ, క్రీడాల శాఖ అధికారి నాగేందర్
నవతెలంగాణ – సిద్దిపేట
ఖేలో ఇండియా సిద్దిపేట జిల్లా సెంటర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన సైక్లింగ్ ఎంపికలకు 86 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు జిల్లా యువజన సంక్షేమ మరియు క్రీడా శాఖ అధికారి నాగేందర్ తెలిపారు. శుక్రవారం గౌట్ ఆఫ్ ఇండియా సాయ్, కేలో ఇండియా సైక్లింగ్ సిద్దిపేట  సెంటర్ ఆధ్వర్యంలో ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 12 నుండి 16 సంవత్సరాల మధ్య ఉన్న బాల ,బాలికలకు సైక్లింగ్ లో శిక్షణ పొందాలని ఆసక్తి ఉన్నవారికి రన్నింగ్, సైక్లింగ్, మెడిసిన్ బాల్, ఎత్తు, బరువు, ఫ్లెక్సిబిలిటీ అంశాలలో పోటీలు నిర్వహించామని, మెడికల్ చెక్ అప్ కూడా చేసినట్లు తెలిపారు. వచ్చిన వారిలో ప్రతిభ చూపిన 20 మంది బాలికలను, 20 మంది బాలురను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎంపికైన వారికి ఖేలో ఇండియా సెంటర్ ద్వారా జెర్సీ, ట్రాక్ షూట్, షూ, హెల్మెట్ అందించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం నుండి రూ 7 లక్షలు రానున్నాయని, అందులో మూడు లక్షలు కోచ్ వేతనానికి, రెండు లక్షలు సైకిల్ ఎక్విప్మెంట్ కు, రెండు లక్షలు జిల్లా ఖేలో ఇండియా సైకిల్ సెంటర్ నిర్వహణకు ఖర్చు చేయడం జరుగుతుందన్నారు.  ఈ కార్యక్రమంలో సైక్లింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బండారుపల్లి శ్రీనివాసులు, పిడి సుజాత, పిఈటిలు సువర్ణ, సంధ్య, ఫిట్నెస్ థరపిస్ట్ అజయ్, కోచ్ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love