మహిళలతోనే మంచి సమాజాభివృద్ధి సాధ్యం

– బీ.సంజీవ: బాలల సంరక్షణ విభాగం ములుగు జిల్లా
నవతెలంగాణ – గోవిందరావుపేట
మహిళలతోనే ఒక మంచి సమాజం అభివృద్ధి సాధ్యమని ములుగు జిల్లా బాలల సంరక్షణ విభాగం అధికారి బి సంజీవ అన్నారు. మంగళవారం మండలంలోని పసర గ్రామంలో అంగన్వాడి కేంద్రం 4 లొ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బి సంజీవ హాజరై మాట్లాడారు. కుటుంబంలో పిల్లలను భర్తను సక్రమమైన మార్గంలో నడిపించే విషయంలో ఆ పిల్లలకు తల్లిగా భర్తకు భార్యగా ప్రతి విషయంలోనూ తోడుంటూ చక్కని సలహాలను ఇస్తూ ఆరోగ్యాన్ని సంరక్షిస్తూ కుటుంబ ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకుంటూ చక్కని సమాజ స్థాపనకు మహిళలు విశేషంగా కృషి చేస్తున్నారని అన్నారు. నేడు అన్ని రంగాల్లో ప్రథమ స్థానాలల్లో రాణిస్తూ సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొడుకుల కంటే కూతుర్లే నయం అనే పదం ఎక్కువగా వినిపిస్తోందని ఇది అక్షర సత్యమని తెలిపారు. అనంతరం ఇరువురు మహిళలను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు టీ పద్మారాణి ఎస్ చంద్రమ్మ కె పద్మావతి సరిత లతోపాటు ఆయా వేముల సామ్రాజ్యం  గర్భిణీ స్త్రీలు తల్లులు ఐదు సంవత్సరాల లోపు బాల బాలికలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love